ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం ఎపి ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా ఉన్నారు. నిన్న పాదయాత్రలో ఉన్న జనగ్ పరకాల పేరు తీసుకోకుండానే పరోక్షంగా ఆయనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రమైన భాషలో విరుచుకుపడ్డారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేస్తూ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాల్సిందిగా పరకాల కోరారు.
సిఎం చంద్రబాబును టార్గెట్ చేయడంలో భాగంగా సోమవారం జగన్ పరకాల సతీమణి పేరును ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు. ఎపిలో చంద్రబాబు బిజెపిపై తీవ్రంగా మాట్లాడుతూ ఢిల్లీలో మోడీకి ఒంగి ఒంగి సలాములు కొడుతున్నాడని జగన్ విమర్శలు గుప్పించారు.
అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొగుడిని చంద్రబాబు ప్రభుత్వ సలహాదారు పదవిలో పెట్టుకున్నారని కూడా జగన్ విమర్శలు చేశారు.
ఎపిలో బిజెపితో వైరం.. ఢిల్లీలో మాత్రం ఫ్రెండిప్ చేస్తున్నారంటూ చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే పరకాల పేరును ప్రస్తావించకుండానే ఆయన సతీమణి పేరు పెట్టి నిర్మలా సీతారామన్ మొగుడికి పదవి ఎలా ఇస్తారంటూ ఘాటుగా తిట్ల వర్షం కురిపించారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన పరకాల తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జగన్ మీద పరకాల తీవ్రంగా మండిపడ్డట్లు తెలుస్తోంది. త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలపై పరకాల మాట్లాడతారని ఎపి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.