ఉత్తమ్ మెడకాయ మీద కేసిఆర్ కత్తి

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మెడకు చుట్టుకోబోతోందా ? రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణంలో జరిగిన ఓ భారీ స్కాం టీ కాంగ్రెస్ ను రాజకీయ సుడిగుండంలోకి నెట్టబోతోందా ? సరిహద్దుల్లో సైనికుడుగా పనిచేశాడని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకునే ఉత్తమ్… ఇప్పుడు కుంభకోణం ఊబిలో కూరుకుపోబోతున్నారా ? టీ కాంగ్రెస్ కు సర్వం తానే అన్నట్టుగా వ్యవహరించే ఉత్తమ్ జుట్టు ఇప్పుడు కేసీఆర్ చేతికి చిక్కినట్టేనా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

రాజకీయ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి తన దారికి  తెచ్చుకోవడానికి ఏ చిన్న అస్త్రం దొరికినా కేసీఆర్ వదులుకోరు. వెంట్రుక దొరికినా కొండను లాగుదామనుకునే టైపు ఆయనది. అదే కొండే వచ్చి చేతికి చిక్కితే ఇక వదులుతారా !? ప్రస్తుతం టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణంలో జరిగిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు కేసీఆర్ చేతిలో అస్త్రంగా మారబోతోంది. రాజీవ్ స్వగృహ స్కీంలో జరిగిన స్కాం పై  సీఐడీ విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో అప్పట్లో భారీ స్కాం జరిగిందని సీఐడీ తన విచారణలో తేల్చినట్టు విశ్వసనీయ సమాచారం. స్వగృహ నిర్మాణాలను అప్పట్లో పది కంపెనీలు చేపట్టాయి. అయితే, అందులో కేవలం రెండు కంపెనీల పై మాత్రమే అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాజ్య ప్రేమ చూపినట్టు స్పష్టమవుతోంది. మెజర్స్ డీఈసీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ కేసీపీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే అసాధారణ లబ్ధి చేకూర్చినట్టు విచారణలో తేలినట్టు చెబుతున్నారు. ఈ రెండు కంపెనీలకు అంచనాలను భారీగా పెంచి, నయా పైసాతో సహా బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించడమే కుంభకోణంలో కీలక అంశమన సమాచారం. మిగతా ఎనిమిది కంపెనీలకు చేకూరని లబ్ధి ఈ రెండు కంపెనీలకు మాత్రమే చేకూరడం వెనుక భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు చెబుతున్నారు. రెండు కంపెనీలకు కలిపి రూ. 360.66 కోట్లకు గానూ… అంచనాలను పెంచి రూ. 519.45 కోట్లు చెల్లించారు.

ఈ వ్యవహారంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీఐడీ రిపోర్టు ఆధారంగా టీ కాంగ్రెస్ రాజకీయాలను కేసీఆర్ ఆడించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష స్థాయిలో ఉన్న నాయకుడు జుట్టే దొరికాక ఇక కేసీఆర్ ఎందుకు వదులుతారన్నది ప్రశ్న. అదీ ఎన్నికల సమయం కావడంతో ఇంత కంటే గోల్డెన్ ఛాన్స్ తమకు రాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. టీ కాంగ్రెస్ ను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టే అస్త్రంగా సీఐడీ నివేదికను అభివర్ణిస్తున్నారు.

సీఐడీ రిపోర్టు…దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందన్న దానిపై ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ ముఖ్యులు కొందరు మీడియా ముఖంగానే ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై కొన్ని పత్రికలలో కథనాలు కూడా వస్తున్నాయి. టీఆర్ఎస్ నేతల ప్రకటనల పై గానీ, పత్రికల్లో వస్తోన్న కథనాల పై గానీ ఇంత వరకు ఉత్తమ్ ఎక్కడా స్పందించలేదు. కనీసం వాటిని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో టీ కాంగ్రెస్ శ్రేణులకు అంతుపట్టడం లేదు. కేసీఆర్ తమ కుంభస్థలాన్ని కొట్టే ప్రయత్నం చేస్తుంటే పార్టీ ముఖ్యులు తేలుకుట్టిన దొంగల్లా ఉండటం ఏమిటన్నది వారి ప్రశ్న. కేసీఆర్ సీఐడీ సవాల్ ను ధీటుగా స్వీకరించి…సై అనకపోతే పార్టీ శ్రేణుల్లో స్థైర్యంసన్నగిల్లుతుందన్న ఆవేదన వారిలో ఉంది. ఈ నివేదిక పై ఉత్తమ్ మనసులో ఏముంది ? ఆయన ఆందోళనకు ఏమైనా గురవుతున్నారా ? అందుకే చూసీ చూడనట్టు… వినీ విననట్టు విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారా ? అన్న సందేహాలు టీ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో గులాబీ బాస్ తో తాడోపేడో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఇలాంటి బలహీనతలు తమ అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా అస్త్రం దొరికితే దాన్ని చేతిలో పెట్టుకుని ప్రత్యర్థిని ఆడించడంలో కేసీఆర్ దిట్ట. దొరికిన అస్త్రాన్ని గురి చూసి ప్రయోగించి ప్రత్యర్థులను లొంగదీసుకోవడంలో కేసీఆర్ స్టైలే వేరు. దీనికి ఓటుకు నోటు కేసే ఉదాహరణ. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును, అప్పటి టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేశారు కేసీఆర్. ఆ దెబ్బకు చంద్రబాబు రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి జంప్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఏకంగా నెల రోజులు జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి కల్పించారు. మరి తాజా అస్త్రంతో పీసీసీ చీఫ్ ను సైతం లొంగదీసుకుంటారా ? కేసీఆర్ ప్రయోగించే సీఐడీ అస్త్రాన్ని ఉత్తమ్ ఎదుర్కోగలరా…? లేక చంద్రబాబు, రేవంత్ రెడ్డి విషయంలో జరిగిన అనుభవాలను చూసుకుని ఎందుకొచ్చిన గొడవని తెర వెనుక వ్యవహారం సెటిల్ చేసుకుంటారా అన్నది వేచి చూడాలి.

 

* రచయిత : సందిళ్ళ శ్రీకాంత్ రెడ్డి, సెల్ నెం. 96407 17123

(ఈ వార్తా కథనంలోని అభిప్రాయాలు రచయితవే. ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు సంబంధించినవి కావు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *