శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై సమగ్ర చర్చ జరగాలి
(ఎం పురుషోత్తమ్ రెడ్డి* )
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన రమణ దీక్షితులు చెన్నైలో విలేకర్ల సమావేశం నిర్వహించి తిరుమల ఆలయవ్యవహరాలకు సంబందించి కీలకమైన ఆరోపనలు చేసినారు. వారి వెనక కేంద్ర పెద్దల హస్తం ఉందని రాజకీయ ఆరోపణలు , వారి వ్యవహర శైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికి ప్రధాన అర్చకుడు కావడం, చేసిన ఆరోపణలు ఆందోళన కలిగించేవిగా ఉండటం వలన శ్రీవారి భక్తులలో అనుమానాలకు, ఆందోళనలకు అవకాశం ఉంది కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం వ్యవహరంపై సమగ్ర విచారణ జరిపించాలి. వారి వెనక దాగి ఉన్న ఉద్ధేశాలపై కాకుండా వారు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలి.
రమణదీక్షితులు ప్రధానంగా లేవనెత్తిన అంశాలు 1. ఆభరణాల నిర్వహణ 2. పూజాది కార్యక్రమాల నిర్వహణలో అధికారుల జోక్యం. 3. చారిత్రక నిర్మాణమైన శ్రీవారి ఆలయం చుట్టూ అవసరాల పేరుతో మార్పులు 4. అర్చకుల విధులలో అధికారుల జోక్యం, మిరాశీ విదానం. లాంటివి ప్రదానమైనవి. బిన్నాబిప్రాయాలు ఉన్నా వారు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చ జరగాలి.
ఆభరణాల నిర్వహణ
శ్రీవారి ఆభరణాల నిర్వహణ అత్యంత లోపభూయిస్టంగా ఉంది. కనీస జవాబుదారితనం లేదు అని చెప్పక తప్పదు. రాజరికంలో రాజు ఇష్టం అన్నట్లుగా ఈ వ్యవహరం ఉంది. వేల కోట్ల రూపాయిల సంపద, రాజులకాలంలో శ్రీవారికి ఇచ్చిన విలువైన ఆభరణాలు కూడా ఉండటం వలన వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణదేవరాయుల కాలం నుంచి నేటి ప్రముఖు కులు సమర్పించిన ఆభరణాలు ఉన్నాయి అందులో ఉన్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన విలువైన సంపదను ఒక రిటైర్ అయిన తాత్కాలిక ప్రత్యేక అధికారికి అప్పంగించారు. వారి దయ ప్రజల ప్రాప్తం అన్నట్లుగా వ్యవహరం నడుస్తుంది. శ్రీవారి నగల పర్యవేక్షణతో బాటు రోజూవారి తనిఖీ చేయడానికి అప్రజైరీ కమిటి ఉంది. వీరు నిత్యం ఆభరణాలను తనికీ చేస్తూ రిజిస్టర్ లో సంతకం చేయాలి. ఒక సందర్భంలో ఈ కమిటీ సభ్యులు ఒకరు తాము సంతకం పెట్టడం తప్ప చూసింది ఏనాడూ లేదు. అని పరోక్షంగా మాట్లాడినారంటే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. అందుకే మాలాంటి వారు మొదటి నుంచి చెపుతున్నది నిత్యం ఆభరణాలను ప్రజల సందర్సనకు ఉంచాలని. ఒక దశలో ఆభరణాలను తిరుపతిలో ప్రజల సందర్సనకు ఉంచుతున్నట్లు ప్రకటించి ముందురోజు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. కారణం ఆభరణాల భద్రతకు బరోసా లేదని. ఒక తాత్కలిక ఉద్యోగి చేతిలో భద్రత ఉంటుంది గానీ వ్యవస్థ చేతిలో భద్రత లేదు అనడం కన్నా విచిత్రం ఏమి ఉంటుంది. ఆభరణాలను ప్రజల సందర్శనకు ఉంచితే నిర్వహణదారులకు భయం ఉంటుంది. శ్రీవారి భక్తులకు స్వామివారి ఆభరణాలను చూసినాము అన్న సంతృప్తి మిగలడమే కాదు శ్రీవారికి సమర్పించిన విలువైన ఆభరణాలను ఎవరు సమర్పించినారో తెలియపరుస్తారు కాబట్టి అవకాశం ఉన్న శ్రీవారి భక్తులు తాముకూడా శ్రీవారికి ఆభరణాలు సమర్పిస్తే ఇలాంటి గౌరవం లబిస్తుందన్న ఉద్యేశంతో శ్రీవారికి కానుకలు సమర్పించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. కానీ పాలకులు ఆ వైపు అడుగులు వేయడం లేదు.
చారిత్రక నిర్మాణంలో ఇస్టానుసారం మార్పులు
శ్రీవారి ఆలయానికి 12 వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. విజయనగర, చోళరాజులు నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయి. వాటిని భావితరాలకు భద్రంగా అందించడం నేటి తరం బాధ్యత. కానీ తిరుమల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలలో కీలకమైనది అవసరాల పేరుతో ఆలయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, ఇలానే కొనసాగితే భవిష్యత్ లో తిరుమల అనే ఒక ప్రాంతం ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినారు. చారిత్రక నిర్మాణాల విషయంలో పెరుగుతున్న భక్తుల అవసరాల కోసం కొన్ని మార్పులు అవసరం. అలాంటి విషయాలలో కొన్ని తప్పవు. అదే సందర్బంలో పేరు కోసం మార్పులు చేయాలన్న ప్రయత్నం ప్రమాదకరం. ఏది ఏమైనా తిరుమలలోని నిర్మాణాల విషయంలో మార్పులు చేర్పుల విధాన నిర్ణయం వ్యక్తుల చేతిలో కాకుండా వ్యవస్ద చేతిలో ఉండాలి. వ్యవహారాలను పురావస్తుశాఖకు అప్పంగించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తిరుమలలో నిత్యం పూజాది కార్యక్రమాలు, పెరుగుతున్న భక్తుల అవసరాల నేపథ్యంలో పురావస్తు పరిధిలోకి తిరుమల నిర్వహణ ప్రతిబంధకం అవుతుంది. ఆపేరుతో వ్యక్తుల చేతిలోకి నిర్మాణాల వ్యవహరాన్ని ఉంచడం మంచిది కాదు. అందుకు పరిష్కారంగా దేవస్దానమే స్వంతంగా కేంద్ర పురావస్తు శాఖ మార్గదర్శకాలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం దాని పరిధిలోకి నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకురావడం ఉత్తమం.
మిరాశీ విధానం పునరుద్ధరణ సబబా
రమణదీక్షితులు చేసిన మరో ఆరోపణ తిరుమల పూజాది కార్యక్రమాలు పద్ధతిగా జరగడం లేదని. వారి విమర్శలో అధికారులు- అర్చకుల మధ్య ఆధిపత్య వ్యవహరంగానే కనిపిస్తుంది. దైవం తర్వాత అంతటి గొప్ప స్థానం అర్చకుడిది. అంతటి స్థానంలో ఉన్న రమణదీక్షితుల వ్యవహర శైలి ఆ స్థాయికి తగిన విదంగా లేదు. అనేక సందర్భాలలో తిరుమలకు రిలయన్స్ అధినేతలు వచ్చినపుడు తానే వారి దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం ఇచ్చిన విషయం నేడు వారికి గుర్తులేకపోయిన శ్రీవారి భక్తులకు గుర్తు ఉంటుంది. అనేక సందర్భాలలో వారు గీతదాటిన విషయం మరిచిపోయి అధికారల తప్పులనే ప్రధానంగా చెప్పడం సముచితం కాదు. అర్చకులు తమ పరిధిని దాటినపుడు అధికారులు కూడా అలానే ఉంటారు. తిరుమల ఆలయంలో నిత్యం జరిగే పూజాది కార్యక్రమాలు ఆగమనియమాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. అనేక సందర్భాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పర్వదినాలలో శ్రీవారి పూజాది కార్యక్రమాల సమాయాన్ని కుదించడం, ఏకాంత సేవగా మార్చడం జరుగుతుంది. కొన్ని సందర్బాలలో సెలబ్రటీల కోసం కూడా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయన్నది దీక్షితుల విమర్శ. శ్రీవారి పాలకమండలి, అధికారుల నియామకం సిపార్సుల మేరకు జరుగుతున్నపుడు వారు సెలబ్రటీల సేవలో కాకుండా బక్తుల సేవలో ఉంటారని ఆశించలేము. వారు పదే పదే లేవనెత్తుతున్నది మిరాశీ. స్వర్గీయ రామారావుగారి కాలంలో ఈ విధానాన్ని రద్దు చేసినారు. ఇది అత్యంత ప్రజాస్వామిక నిర్ణయం. ఆ విధానాన్ని మళ్లీ తీసుకురావడం అనే దోరణిలో దీక్షితులు మాట్లాడటం అంగీకారం కాదు. ఏది ఏమైనప్పటికి రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ప్రతి విమర్శలు చేయడం లేదా తప్పించుకునే పద్ధతిలో వ్యవహరించడం మంచిది కాదు. రమణదీక్షితు లు వ్యవహరంలో తెర వెనక ఎవరు ఉన్నారన్న రాజకీయ కోణంలో కాకుండా వారు ప్రస్తావించిన అంశాలపై సమగ్ర చర్చ, అవసరం వాటిపై విచారణ దాని ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే వైపుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయాలి.
*యం. పురుషోత్తం రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి. 9490493436.