తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పై మరోసారి కొత్త స్టయిల్ లో పంచ్ వేశారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. రానున్న ఎన్నికల తర్వాత కేటిఆర్ యాంకరింగ్ చేసుకుంటూ బతకాల్సిందే అని చురకలు వేశారు. అసెంబ్లీలో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ పలు అంశాలపై మాట్లాడారు.
భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు ముందుగా భరత్ అని మాత్రమే ఉండేదన్నారు. కానీ కేటిఆర్ 10 లక్షలు ఇచ్చి మహేష్ బాబు క్యారెక్టర్ పేరు భరత్ రామ్ గా మార్పించారని ఆరోపించారు. అందుకే సినిమాలోమహేష్ బాబు పేరు భరత్ కాకుండా భరత్ రామ్ గా ఉంటుందని తెలిపారు రేవంత్ రెడ్డి. అందుకే ఆ సినిమాకు యాంకరింగ్ కూడా కేటిఆర్ చేశాడని గుర్తు చేశారు.
ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ జరుగుతన్న పరిణామాలపై రేవంత్ స్పందించారు. హంగ్ వచ్చిన నేపథ్యంలో కర్ణాటకలో జెడిఎస్ ఎటువైపు ఉండాలో ఫ్రంట్ పెట్టిన నాయకుడు కేసిఆర్ చెప్పాలి కదా అని ప్రశ్నించారు. జెడిఎస్ బిజెపి వైపు వెళ్లాలా? లేక కాంగ్రెస్ వైపు వెళ్లాలా కేసిఆర్ సూచించాలన్నారు. టెంట్ లేని ఫ్రంట్ పెట్టి ఉత్తగనే పండుకుంటే సరిపోతదా అని ఘాటుగా ప్రశ్నించారు. రేపు దేశమంతా కర్ణాటక తరహా ఫలితాలే వస్తాయని అప్పుడు కేసిఆర్ ఎటు ఉంటదో చెప్పాలన్నారు.
ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్ర పై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోవా అసెంబ్లీలో 17 స్థానాలతో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా 13 స్థానాలు గెలిచిన బిజెపి కి అవకాశం ఇవ్వటం దారుణమన్నారు. మణిపూర్, మేఘాలయ ల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు అవకాశం ఇవ్వడం దారుణమన్నారు.
సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం… 1.పూర్తి మెజార్టీ, 2.ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి మెజార్టీ సాధిస్తే, 3. ఎన్నికల తరువాత కూటమి ఏర్పాటైన తర్వాత మెజార్టీ… 4. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. భారత రాజ్యాంగం పైన మోడీ, అమిత్ షా లకు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అఖండ భారత్, సంప్రదాయాలు రక్షించే వారిగా ముద్ర వేసుకున్న వారు… పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. నైతిక విలువల గురించి మాట్లాడే వారు…. ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు మద్దతిస్తారా అని ప్రశ్నించారు. సంప్రదాయాలు మీకు అనుకూలంగా మార్చుకుంటారా అని నిలదీశారు. ఫిరాయింపులను పరోక్షం గా గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తక్షణం కాంగ్రెస్ – జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని డిమాండ్ చేశారు.
ఆనాటి భారతీయ జనతీయ జనతా పార్టీ వీరు…. ఇప్పటి బీజేపీ వేరు అని రేవంత్ అన్నారు. ఒక్క ఓటుతో వాజపాయి ప్రభుత్వాన్ని కోల్పోయిందన్నారు. అవకాశం ఉన్నా అద్వానీ, వాజపాయి లు అక్రమ మార్గాల వైపే చూడలేదన్నారు. కానీ మోడీ, షా బీజేపీ ని చెర బట్టారని విమర్శించారు. ఫిరాయింపులు, అధికార కాంక్ష తో అక్రమ మార్గాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.