తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో కొత్త వివాదం రాజుకుంది. జిల్లాలోని ఆర్ అండ్ బి అధికారులు తమ జీపుపై అధికార పార్టీ టిఆర్ఎస్ జెండా కట్టుకుని గ్రామాల్లో తిరిగినట్లు స్థానిక యువకులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి ఇలా చేస్తున్నరని కల్వరాల గ్రామ యువత మండిపడుతున్నారు. కల్వరాల గ్రామంలో రైతుబందు చెక్కుల పంపిణీ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామానికి వస్తున్నారని R&B అధికారులు టీఆర్ఎస్ పార్టీ జెండా ను ప్రభుత్వ వాహనానికి పెట్టుకుని కల్వరాల గ్రామంలో చక్కర్లు కొట్టారని తెలిపారు.
తక్షణమే ఈ ఘటనపై మంత్రి జూపల్లి విచారణ జరిపి టిఆర్ఎస్ జెండాలు పెట్టుకుని చక్కర్లు కొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల జీపుకు జెండా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఒక యువకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారింది.