పోలవరం ఓ మాయా ప్రపంచం

గత కొంత కాలంగా చర్చలో లేని పోలవరం మల్లీ తెరమీదకు వచ్చింది. ఏపీకి రెండు ప్రధాన నదులు ఒకటి క్రిష్ణ, రెండు గోదావరి. క్రిష్ణలో లభ్యమయ్యే నీటిని అందరూ పంచుకున్నారు. మిగులు జలాలను కూడా పంచుకున్నారు. ఇక మిగిలింది గోదావరి. పుష్కలంగా నీటి లభ్యత, గోదావరికి చివరి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కావడం, మనకు ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పై ప్రాజెక్టు నిర్మించడానికి తగిన అవకాశాలు లేకపోవడం వలన వీలైనంత నీటిని వాడుకునే అవకాశం ఉంది. పోలవరం పూర్తి అయితే దాని ద్వారా లభ్యమయ్యే నీటిని క్రిష్ణా డెల్టా, గోదావరి నుంచి విశాఖ పట్నం వరకు ఉపయోగించడం వలన క్రిష్ణా నీటిని రాయలసీమకు పూర్తిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అలా గోదావరి పై నిర్మించే పోలవరం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంగ్లేయుల కాలం నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పరిశీలన జరిగినా విపరీతమైన ఖర్చు, పాలకుల దూరదృష్టి లోపం కారణంగా ప్రాజెక్టు చర్చలకే పరిమితం అయింది. వై యస్ జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఒకటి రెండు అనుమతులు మినహ దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. వారి మరణం నాటికి కీలకమైన నిర్వాసితుల సమస్య, ప్రధాన డ్యాం నిర్మాణం మాత్రమే మిగిలింది. పోలవరం పూర్తి అయితే నీరు విడుదల చేయాల్సిన కుడి, ఎడమ కాలవల నిర్మాణం దాదాపు పూర్తి అయింది. వారి మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గందరగోల రాజకీయాలు, విభజన కారణంగా ప్రాజెక్టు పనులు దాదాపు ఆగిపోయినాయి. విభజన వలన రాష్ట్రానికి లభించిన ఒక మంచి అవకాశం పోలవరం జాతీయ ప్రాజక్టుగా మారడం. విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బాబు ప్రారంభంలో ఈ ప్రాజెక్టుపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. అతి పెద్ద ప్రాజక్టు అయిన పోలవరం నిర్మాణం ఒక పద్దతి ప్రకారం జరగాలి కానీ బాబు పోలవరంను కూడా 2019 ఎన్నికల అవసరం ప్రాతిపదికన నిర్మాణం చేయడం పై దృష్టి పెట్టడంతో సమస్య జఠిలం అయింది. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే. కానీ కేంద్రం నిర్మిస్తే ఆలశ్యం అవుతుందని అందుకే కార్యనిర్వహణ బాధ్యతను తాము తీసుకున్నట్లు అధికార పక్షం మాట్లాడుతుంది. కేంద్రం నిర్మిస్తే శ్రద్ద పెట్టదన్న వాదన వినడానికి బాగున్నా కేంద్రంకు నిర్మించే ఉద్యేశం లేకుంటే రాష్ట్రం బాధ్యత తీసుకున్నంత మాత్రానా సహకరిస్తుందా? అదే చట్టం ప్రకారం కేంద్రం చేపడితే కనీసం ఎపుడు నిర్మస్తారు అని అడగటానికయినా అవకాశం ఉండేది. కానీ నేడు నిర్మించాల్సిన కేంద్రం కన్నా బాధ్యత తీసుకున్న రాష్ట్రం ముద్దాయిగా మిగిలింది.

2019 ఎన్నికల లక్ష్యంగా పోలవరం మారడమే ఆటంకం…

పోలవరం నిర్మాణం లో కీలక ఘట్టం ప్రదాన డ్యాం నిర్మాణం జరగాలంటే ముంపుకు గురైయ్యే నిర్వాశితుల సమస్య పరిష్కారం ముందుగా జరగాలి. అటు పిమ్మట మాత్రమే ప్రధాన డ్యాం నిర్మాణం జరుగుతుంది. కానీ బాబు 2019 ఎన్నికల నాటికి పోలవరం నుంచి కొంత మేరకైనా నీరు ఇచ్చి తీరాలన్నా రాజకీయ కోరికే సమస్యగా మారుతున్నది. పద్ధతి ప్రకారం నిర్మాణం జరగాలంటే మొదట నిర్వాసితులు సమస్య పరిష్కారం జరిగిన తర్వాత కాఫర్ డ్యాం అటు పిమ్మట ప్రదాన డ్యాం పనులు మొదలు పెట్టాలి. ఇలా పద్దతిగా జరిగితే పోలవరం ద్వారా 2019 నాటికి నీరు ఇవ్వడం కుదరదు. అందుకే బాబు మదిలో వచ్చిన రాజకీయ ఆలోచన కాఫర్ డ్యాం. వై యస్ కాలంలో కుడి, ఎడమ కాలవల నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఆ కాలవలను ఉపయోగించుకుని 2019 ఎన్నికల రాజకీయాలను మొదలు పెట్టారు. పోలవరం కుడి కాలవను ఉపయోగించుకుని పట్టి సీమను నిర్మించారు. ఎడమ కాలవను ఉపయోగించుకుని పురుషోత్తపట్నం నిర్మించినారు. వాటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కనుక ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరం అయ్యే తాత్కాలిక నిర్మాణం కాఫర్ డ్యాం చేపట్టడం ద్వారా మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అందుబాటులోకి వచ్చే నీటిలో 4 వవంతు నీరు కాపర్ డ్యాం ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఆ నీటిని ఇది వరకే అందుబాటులో ఉన్న కుడి, ఎడమ కాలవలకు గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసి పోలవరం మొదటి దశ పూర్తి అయింది. మల్లీ అవకాశం ఇస్తే పూర్తి స్దాయి ప్రాజక్టును నిర్మిస్తాం అన్న నినాదంతో ముందుకు వెల్లడం లక్ష్యంగా బాబు పని చేస్తున్నారు.

పోలవరం విషయంలో బాబుగారిది ప్రమాదపు ఎత్తుగడలు…

కాఫర్ డ్యాం కేవలం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఆటంకం కల్పించే నీటి ప్రవాహన్నీ దారి మల్లించే చిన్న నిర్మాణం మాత్రమే. దాని ద్వారా నీరు విడుదల చేయడం అంత మంచి నిర్ణయం కాదు. ఆ ప్రయోగం విఫలం అయితే విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. పై పెచ్చు ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం సహరిస్తుందా? ఆ నిధులను తిరిగి ఇస్తుందా అన్నది అనుమానమే. కాఫర్ డ్యాం ఎక్కువ కాలం మనజాలదు. 2019 కి నీరు ఇచ్చిన తర్వాత కూడా మల్లీ నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలి తర్వాతనే ప్రధాన డ్యాం నిర్మాణం చేపట్టాలి. అంత కాలం కాఫర్ డ్యాం ఉంటుందా సందేహమే. మరో కీలకమైన పొరబాటు రాష్ట్రం బాధ్యత తీసుకోవడం అందులోనూ కేంద్ర బడ్జెట్ నుంచి కాకుండా నాబార్డు ద్వారా నిదులు వచ్చే విధంగా అవగాహనకు రావడం. నాబార్డు ద్వారా కేంద్రం అనేక ప్రాజక్టులు నిర్మింస్తుంది. ఉదా.. రాష్ట్రంలోనే తాడిపుడి, తారకరామా ఎత్తిపోతల ఫధకం, ఎర్రకాలవ లాంటి 6 ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా నిధులను కేంద్రం ఇవ్వాలి. అంతే కాదు ఈ పధకం కింద దేశంలో 100 ప్రాజెక్టులు 40 వేల కోట్లతో చేపట్టింది. అలాంటి పధకంలో పోలవరం చేరింది. 52 వేల కోట్ల అంచనా కలిగిన ప్రాజక్టును 40 వేల కోట్ల 100 ప్రాజక్టుల జతకు చేరితే పోలవరం పూర్తి అవడం సాధ్యమేనా? ఇది వరకే నాబార్డు ద్వారా మంజూరైన 6 ప్రాజక్టుల భవితవ్యం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అదే నాబార్డు ద్వారా ఇదివరకే మంజూరైన ప్రాజక్టులను పూర్తి చేసుకుని పోలవరం పూర్తిగా కేంద్ర సాధారణ బడ్జెట్ నుంచి నిదులు వచ్చే నిర్ణయం జరిగి ఉంటే రాష్ట్రం బహుముఖంగా లాభపడి ఉండేది. కానీ దానికి భిన్నంగా జరగడం వలన అన్ని విధాలా నష్టం జరుగుతుంది.

పోలవరం యాత్రతో సాధించేది ఏమిటి…

పోలవరం సందర్శన యాత్రపేరిట ప్రభత్వం మరో రాజకీయ నాటకానికి తెరలేపింది. ప్రజలను విడతల వారిగా పోలవరం నిర్మాణం జరిగే ప్రాంతంకు తీసుకు వెల్లడం. అందుకు ఏకంగా 22 కోట్లు విడుదల చేయడం అర్థం ఉందా? ప్రజలు పోలవరం యాత్ర చేయడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా కేవలం రాజకీయ ప్రయోజనం తప్ప. నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి జనాన్ని తీసుకు వెలితే అక్కడ జరిగే పనులకు ఎంత ఆటంకం. అంటే అక్కడ పను జరిగితే కదా అన్న సందేహం కలగవచ్చు. ఇక్కడ బాబు ఆలోచిస్తున్నది ప్రజలను ఆ ప్రాంతానికి తీసుకు వెల్లి ఈ ప్రాంతంలోనే ప్రాజక్టు కట్టాల్సింది, కానీ కేంద్రం నిదులు ఇవ్వలేదు, ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయి, కాబట్టి ప్రాజక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్నది, కేంద్రంపై పోరాడుదాం నాతో చేతులు కలపండి అన్న రాజకీయం చేయబోతున్నట్లు అర్దం అవుతుంది. ఈ యాత్ర కయ్యే ఖర్చు నిధులు ఎవరి ఖాతాలో రాస్తారు? చివరకు పోలవరం లెక్కలో రాస్తారు. రేపు ఇలాంటి ఖర్చులకు మేము నిధులు ఇవ్వమని కేంద్రం మొదటికి వస్తే మొత్తం వ్యవహరం బెడిసి కొడుతుంది. తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి హోదాలో దీక్షలు, పోలవరం యాత్రలు రేపు నత్తనడకన నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరిగే ప్రాంతాల సందర్శన… ఇలా ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. అంతగా పోరాటం చేయదలుచుకుంటే ప్రతిపక్షాల లాగానే పార్టీ నిదులతో పోరాటం చేయాలి తప్ప ప్రజల నిధులతో పార్టీ పోరాటం చేయడం బాద్యత అనిపించుకోదు.

-యం. పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి. ఫోన్. 9490493436.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *