సంగీత సాహిత్య రంగాలలో నిష్ణాతులు.. ఆకాశవాణి మాజీ సంచాలకులు బాలాంత్రపు రజనీకాంతరావు (99) కన్నుమూశారు.
‘రజని’ గా పిలవబడే రజనీకాంతారావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించారు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన “కవిరాజహంస” బాలాంత్రపు వెంకటరావుగారి కుమారులు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. వీరి తండ్రి ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపక, నిర్వాహకులు. తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం కల వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో కళకళలాడుతుండేది.
పిఠాపురంలో పెరిగారు. బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తిసంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. కాకినాడలోపి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. రజని 1937-1940 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) లో ఎం.ఏ. తెలుగు చదివారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.
1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు. (wikipedia నుంచి)