కేసిఆర్ సర్కారుకు దిమ్మతిరిగే షాక్

తెలంగాణ సర్కారుకు అనూహ్యమైన షాక్ తగిలింది. ఉమ్మడి హైకోర్టులో కేసిఆర్ సర్కారుకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. గతంలోనూ ఇలాంటి తీర్పులు వచ్చినా.. ఈ తీర్పు మాత్రం పెద్ద ఎదురు దెబ్బగా చెబుతున్నారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపారేసింది.

తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపారేసింది. మార్చి 14వ తేదీన స్పీకర్ మధుసూదనాచారి ఈ ఇద్దరు సభ్యులపై వేటు వేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించారని, అందుకే వారి సభ్యత్వాలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకున్నది.

తమ సభ్యత్వ రద్దును హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ చాలెంజ్ చేశారు. తమ సభ్యత్వాలను ఏకపక్షంగా రద్దు చేశారని కోర్టుకు విన్నవించారు. దీంతో అన్ని కోణాల్లో విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ సర్కారుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ వెలువరించిన రాజపత్రం (తెలంగాణ గెజిట్) ను రరద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

వారిద్దరి అసెంబ్లీ సభ్యత్వాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. వారు ఏమైనా సభలో అమర్యాదగా ప్రవర్తించినా, అనుచితంగా వ్యవహరించినా.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కానీ సభ్యత్వ రద్దు మాత్రం చెల్లుబాటు కాదని వెల్లడించింది.

హైకోర్టు తీర్పుతో తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడింది. ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలను హైకోర్టుకు సమర్పించలేకపోయింది తెలంగాణ సర్కారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనేకసార్లు హైకోర్టులో తెలంగాణ సర్కారు మొట్టికాయలు తిన్న దాఖలాలున్నాయి. అంతేకాదు ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేసిన కారణంగానే రాజీనామా చేసి బాధ్యతలనుంచి తప్పుకున్నారన్న విమర్శలు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు హెడ్ ఫోన్లు విసిరిన వీడియోలతోపాటు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైన వీడియోలు కోర్టుకు సమర్పిస్తామని అడ్వొకెట్ జనరల్ ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆ విషయంలో సర్కారు సీరియస్ అయింది. ఆ వీడియోలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో మనస్థాపంతోనే ప్రకాష్ రెడ్డి రాజీనామా చేశారు. తదనంతరం  ఈ కేసు విచారణలో సర్కారు పదే పదే విమర్శలపాలైంది.

తుదకు ఈ కేసులో సర్కారుకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడింది. చరిత్రలో ఇలాంటి తీర్పు రాలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కామెంట్ చేశారు. ధౌర్జన్యం చేసిన వారికి చెంపపెట్టు అని ఆయన కామెంట్ చేశారు. అసెంబ్లీలో ఏదిపడితే అది చేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోవని తేలిపోయిందన్నారు. న్యాయస్థానం 175 పేజీల తీర్పును వెలువరించిందన్నారు. సభ్యత్వ రద్దు అనేది తీవ్రమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజల విజయం ఇది అన్నారు.

సోషల్ మీడియాలో పంచ్ ల జోరు

హైకోర్టులో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో సోషల్ మీడియాలో సర్కారుపై పంచ్ లు వేస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. కోర్టు తీర్పుపై శ్రీకాంత్ దాసరి అనే యాక్టివిస్టు వేసిన పంచ్ కింద ఉంది చదవండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *