చంద్రబాబు భయపడుతున్నది లోకే ష్ గురించేనా?
గత రెండురోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ- తెలుగుదేశం ప్రముఖులతో పాటు కొంతమంది అధికారుల మీద సిబిఐ దాడులు చేస్తుందని. దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా,అంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో తెంచుకోవాలనుకున్నపటినుంచి కేంద్రం కేసులు, సిబిఐ దర్యాప్తుల గురించి మాట్లాడుతున్నారు. నిన్ననో మొన్ననో పార్టీ నేతలతో మాట్లాడుతూ కేంద్రంతో తగాదాపడుతున్నందున మోదీ ప్రభుత్వం సిబిఐ లేదా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ని లేదా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) ని రంగంలోకి దించే అవకాశం ఉందని, దీనికి సిద్ధంగా ఉండటమే కాకుండా జనం ముందు మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కూడ హెచ్చరిక చేశారు.
ఈ హెచ్చరికలన్నీ కూడా కూడా ఆయన లోకేష్ మీద సిబిఐ రైడ్ జరగవచ్చనే అనుమానంతో చేస్తున్నవేనని కొంతమంది తెలిసినవాళ్లు చెబుతున్నారు. అయితే, లోకేష్ మీద సిబిఐ,ఐటి, ఇడి దాడులు ఎందుకు జరుగుతాయి?
ఇక్కడ పవన్ కల్యాణ్ చేసిన ఒక ఆరోపణ నుంచి మనకు సమాధానం దొరుకుతుంది. మార్చి పద్నాలుగున జనసేన నాలుగోవార్షికోత్సవ సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేశ్ కరప్షన్ కింగ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ స్కామాంధ్ర కాకపోయినా, 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొడుకు లోకేష్ బాబు కరప్షన్ ఆంధ్ర గా మారిందనిఅన్నారు. అంతేకాదు, లోకేష్ కు చెన్నైకి చెందిన ఇసుక వ్యాపారి జె శేఖర్ రెడ్డితో సంబంధం ఉందని, అందుకే ప్రధాని మోదీ చంద్రబాబుకు అప్పాయంట్ ఇవ్వడం లేదని అన్నారు. 29 సార్లు తిరిగినా ప్రధాని దర్శనం కాకపోవడానికి కారణం ఇదే అన్నారు. శేఖర్ రెడ్డి ఇసుక వ్యాపారి. ఇందులో ఎక్కువ భాగం ఆయన చిత్తూరు జిల్లా నుంచి తరలించుకుపోతున్నారనే ఆరోపణ వినవస్తూ ఉంది. పేదల పేరు చెప్పి ఇసుక ‘ఉచితం’ అని ప్రభుత్వం ప్రకటించింది శేఖర్ రెడ్డి వంటి వాళ్ల కోసమే నని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఇసుక కాంట్రాక్టరే చిత్తూరు జిల్లాలో ఎందరి ప్రాణాలను తీసేశారో అందరికి తెలిసిందే.
ఇలాంటి శేఖర్ రెడ్డి ఇంట్లో నోట్ట రద్దు కాలంలో ఎన్ ఫోర్స్ మెంటు అధికారులు దాడులు జరిపి రు 96 కోట్ల పాత కరెన్సీని, 9.63 కోట్ల నిగనిగలాడే కొత్త కరెన్సీని (అన్ని రెండువేల నోట్లు), 127 కెజీ ల బంగారం (విలువ రు.36.29 కోట్లు)పట్టుకున్నారు. ఆ మరుసటి రోజే మరొక సారి దాడి చేస్తే మరొక రు. 24 కోట్లు (అన్నీ పళపళ లాడే కొత్త 2000 నోట్లు)దొరికాయి. ఆయన మీద ఆదాయపు పన్ను,వాళ్లు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరే ట్ వాళ్ల కేసులు పెట్టారు.శేఖర్ రెడ్డితో ఎంతో మంచి సంబంధం లేకుండా ఉంటే, ఆయనను తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిని ఎలా చేస్తుంది?
ఈ లెక్కన శేఖర్ రెడ్డి, లోకేష్ బాబు అనుబంధం, చంద్రబాబు నాయుడికి ప్రధాని అప్పాయంట్ మెంటు ఇవ్వకపోవడానికి కారణం గురించి పవన్ కి చాలా విషయాలు తెసినట్లున్నాయనుకోవాలి.
పవన్ చెప్పినట్లు, శేఖర్ రెడ్డితో టిడిపి యువరాజా వారికి సంబంధం వుంటే, ఈ దర్యాప్తులో భాగంగా ఆయన ఇంటి మీద సిబిఐ, ఐటి, లేదా ఇడి దాడులు జరగవచ్చు. ఆయనన్ను అరెస్టు చేయవచ్చు. ఇది కేంద్రం పరిధిలో వ్యవహారం. అందుకే చంద్రబాబు చీటికిమాటికి సిబిఐ దాడులు, కేసులు, కేంద్రం ప్రతీకార చర్య వంటి పదాలు ప్రయోగిస్తున్నారని ప్రభుత్వంలో ఉన్నవారే అనుమానిస్తున్నారు. ఇది ఆందోళనకరమయిన విషయమే. ఎందుకంటే, 2019 తర్వాత లోకేశ్ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నపుడు ఈ దాడులు, కేసులు మొదలయితే ఎలా?