బిజెపి-టిడిపిలకు చెందిన మంత్రులు రాజీనామాలకు సిద్ధపడటంతో ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి. పార్టీల మధ్య రాజకీయ వ్యవహరంలో మార్పులు వస్తున్నా ప్రజల సమస్యల విషయంలో మాత్రం మార్పు వచ్చే పరిస్థితులు కనబడటంలేదు. కేంద్ర విత్త మంత్రి ప్రకటనతో తాము కేంద్రం నుంచి వైదొలుగుతున్నామంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం విచిత్రంగా ఉంది. ఎందుకంటే అరణ్ జైట్లి ఇలాంటి ప్రకటన చేయడం ఇది మొదటి సారికాదు. పార్లమెంట్ లోపలా, బయటా అనేక సార్లు ఆయన ఈ విషయం స్పష్టంగా ప్రకటించినారు. లోక్ సభలో ఒక సారి, రాజ్యసభలో కే వీ పీ ప్రవేటు బిల్లు సందర్బంగా మరో సారి చాలా స్పష్టంగా వెల్లడించినారు. మరి ఈ రోజు ఏమి మార్పు వచ్చిందని రాజకీయాలలో అలజడి వస్తుంది. కేవలం నాడు ఎన్నికలు లేవు నేడు ఎన్నికలు వస్తున్నాయి. అంతే.
హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చినపుడు అంగీకరించి నేడు ఎందుకు విభేదిస్తున్నారో అర్థం కావడం లేదు. హోదా విషయంలో బిజెపి 2014 లో ఒకసారి నేడు మరో సారి ప్రజలను తప్పుదోవ పట్టించింది. అందుకు బిజెపి కి రాజకీయ గుణపాఠం అనుభవించాల్సిందే. కానీ కేంద్రం హోదా ఇవ్వమని స్పష్టంగా తెలిపిన తర్వాత కూడా హక్కుగా విలువైన విభజన చట్టం 2014 ను అమలు చేయించుకోవడం చాలా కీలకం. విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే ఒక్క రాయలసీమ కే ఒక్క లక్షకోట్లు 10 సంవత్సరాలలో వచ్చే అవకాశం ఉంది హక్కుగా ఉన్న చట్టాన్ని అమలు చేయించుకోవడం కనీస బాధ్యత. మరో వైపు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా అభిమాని స్థాయి దాటడం లేదు. ఏది ఏమైనా 2014 లో సమైక్యవాద ఉద్యమం , నేడు జరిగుతున్న హోదా ఉద్యమాలతో నాడు నేడు పార్టీల రాజకీయ హోదా మారుతుందే తప్ప, ప్రజల జీవిత హోదా మాత్రం మారడం లేదు.