టిటిడి బోర్డు లేక ఏడాదవుతూ ఉంది…

టిటిడి చరిత్రలో ముందు ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి.  పాలక మండలి లేదా అధికారుల కమిటి లేకుండా టిటిడి 10 నెలలుగా నడుస్తుండటం ఇదే మొదటి సారి. టిటిడి ఏర్పడి దాదాపు 86 సంవత్సరాలు అవుతుంది.టిటిడి ఏర్పాటు చేసిన ఉద్యదేశం గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నదని అనిపిస్తుంది.  తిరుమలకు సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూండటం, అంతే మొత్తంలో ముడుపులు  వస్తుండటం వలన, శ్రీవారి ఆలయ పాలనను  ప్రజాస్వామ్యపద్దతిలో నడిపించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం  టిటిడి ఏర్పాటుకు దారి తీసింది.

చిన్న, చిన్న ఘటనలు జరుగుతున్నా నాటి లక్ష్యంకు అనుగుణంగా టిటిడి నడుస్తూన్నది. నేడు దేశంలో ఏ ఆలయ వ్యవస్థ అయినా టిటిడి ని పరిశీలించి నిర్ణయాలు తీసుకునే స్దాయిలో టిటిడి కి ప్రతిష్ట పెరిగింది. ఇందులోటిటిడి పాలక, అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకం. కానీ 2017 ఏప్రిల్ లో పాలకమండలి వ్యవధి ముగిసింది. తక్షణం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసి టిటిడి పాలన సజావుగా,ప్రజాస్వామికంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలి.

అయితే,  రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోనే లేదు. పాలకమండలిని గాని, అధికారుల కమిటీని గానీ ఏర్పాటు చేయాలని టిటిడి రాజ్యాంగం సెక్షన్ 136 చెపుతున్నా ప్రభుత్వం కారణం చెప్పకుండా కాలయాపన చేస్తున్నది.

టిటిడి పాలక మండలి ని, ఛెయిర్మన్ ను  అదిగో నియమిస్తాం, ఇదిగో నియమిస్తాం అంటూ లీకులతో  ప్రచారం చేయించడం తప్ప ఒక్క అడుగుకూడా ముందుకు వేయడం లేదు.

మంత్రవర్గం స్థాయి హోదా ఉన్నటువంటి టిటిడి  చైర్మన్  పదవిని నియమించక పోవడానికి ఏదో బలమైన కారణం ఉన్నట్లే ఉంది. ఈ పదవిని ఏర చూపి రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాధినేత ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగుతున్నది.

చిన్న రాష్ట్రాలతో సమానమైన బడ్టెట్ రూపకల్పన చేయాల్సి ఉన్న ముఖ్యమయిన పవిత్రమయిన వ్యవస్థకు ఇప్పటికి కూడా పాలకమండలిని నియమించకపోవడం బాధ్యాతా రాహిత్యం  అనిపించుకోదా? ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదో  ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *