తిరుపతి సమీపాన రాళ్లమడుగులో ట్రెకింగ్…

(భూమన్)

రాళ్ల మడుగు చాలా సుందరమయిన ప్రదేశం. తిరుపతికి దాదాపు 25 కిమిదూరాన ఉంటుంది. రేణిగుంట, కరకంబాడి, గ్రైండ్ వెల్ నార్టన్ పక్కనుంచి వెళ్లాలి. అక్కడే వాహనాలను ఆపేసి ఒక మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే రాళ్ల మడుగు వస్తుంది.

రాళ్ల మడుగు రాళ్ల కాలువ వెంబడి ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో వెళ్తే బ్రహ్మాండంగా నీళ్లు పారుతూ ఉంటాయి. దారి పొడుగునా మీకు అనేక కొలనులు, ఇరువైపులా ఎత్తయిన పచ్చని చెట్లతో నిండిన గుట్టలు కనిపిస్తుంటాయి.

వీటి మధ్య నడుచుకుంటూ పోతూ ఉంటే… ఇలాగే పోవాలనిపిస్తూ ఉంటుంది ఎంతదూరమయినా. ఈ ప్రాంతానికి చాలా పురాతత్వ ప్రాముఖ్యం ఉంది. రాబర్ట్ బ్రూస్ ఫూట్ (Robert Bruce Foote) వంటి వారు ఈ ప్రాంతమంతా కలియదిరిగి ఇక్కడ పురాతన మానవుడు నివసించిన ఆనవాళ్లు, ఆధారాలు అంటే రాతి పనిముట్లు, ఇతర అవశేషాలు కనుగొన్నారు.

ఈ రాళ్ల కాలువే పారి పారి  మల్లెమడుగుకు చేరుతుంది. మల్లెమడుగు (కింది పోస్టు) గురించి తెలుసు కదా, అక్కడే ఎపుడో 1953లోనే ఒక చిన్నతరహా నీటి ప్రాజక్టు కట్టారు. అదొక వింత.

గత వారం దాని గురించి వివరంగా చెప్పాను. రాళ్ల కాలువ వెంబడి పెద్ద పెద్ద గుండ్లు పేర్చి వుంటాయి. వీటితో ఈ ప్రాంత  సహజ ప్రకృతి సౌందర్యం ఇనుమడించింది. ఇక్కడ ప్రవహిస్తున్న సెలయేరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా కలుషితంగా కాకుండా ప్రవహిస్తున్న సెలయేర్లు మనకు కనిపించడం అరుదు.

వీటన్నింటిని దాటుకుంటూనే మేం రాళ్ల మడుగు చేరుకున్నాం.దీన్నొక ఆర్కియాలాజికల్  పార్క్ అనొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించే వాళ్ళకి అదిమ మానవులు వాడిన రాతిపని ముట్లు కూడా కనిపిస్తాయి. వేల సంవత్సరాలు  ఈ నీళ్ల ప్రవాహంలో ఉంటూ నునుపు దేలిన కొండరాళ్లు వేల సంఖ్యలో చూడవచ్చు. అందుకే ఇది రాళ్లమడుగు అయింది. దీనిని సౌందర్యాన్ని అంతా ఒక సారి చూడాలి. దానికితోడు ఇది తిరుపతికి చాలా దగ్గిర కూడా.  తిరుపతి వస్తున్నపుడు శ్రీవారిని దర్శించి హడావిడిగా వెళ్లి పోయే ప్రయత్నం చేయవద్దు. తీరుబడిగా తిరుపడికి రండి. ఒక రెండు రోజులుండండి. తిరుపతి చుట్టూరు, శేషాచలం కొండల్లో లెక్కలేనన్ని తీర్థాలు, మడుగులు, కోనాలు ఉన్నాయి. ఒక్కొక్క సారి ఒక్క ప్రదేశాన్ని సందర్శించి వెళ్లండి. అపుడే మీ తిరపత్రి యాత్ర మరుపురాని అనుభవం అవుతుంది.

రాళ్ల మడుగు లాంటి ప్రదేశాలలో తిరుగాడుతున్నపు డ ఇలాంటి సహజ సంపదను కాపాడుకోవాలనే ఒక తపన బలపడుతుంది. ఇంకా ఇలాంటి కొండల్లో లోయల్లో కాలువలు, మడుగుల మధ్య తిరిగి ప్రకృతిలో మమేకం కావాలనిపిస్తూంది.  కావాలంటే ఒక్కసారి రాళ్ల మడుగు సందర్శించండి, ఆ అనుభూతిని మీరే స్వయంగా తనివితీరా పొందుతారు.

(భూమన్, రచయిత, వక్త, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి)

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/travel/a-trek-to-mallemadugu-near-tirupati-beautiful-minor-irrigation-project/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *