రాయికోడ్ వీరభద్రేశ్వర స్వామి చరిత్ర ఇదీ

(జూకంటి ప్రసాద్)
ఘనంగా ప్రారంభమైన వీరభద్రేశ్వర స్వామి జాతర.. రాయికోడ్ లో శతాబ్దాల నాటి ఆలయ చరిత్ర తెలుసుకుందాం.
కర్ణాటక, మహారాష్ట్రలో ప్రతిష్టించాల్సిన విగ్రహం రాయికోడ్ లోనే ఆగిపోయింది ఎందుకు?
ఆధ్యాత్మికతకు చరిత్ర తోడైతే ఆ వైభవం చెప్పక్కర్లేదు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామంలోని అత్యంత పూరాతనమైన శైవ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. శతాబ్దాల చరిత్రతో భక్తుల కోరికలను తీరుస్తున్న వీరభద్రుడి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయ చరిత్ర, ఎక్కడో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రతిష్టించాల్సిన వీరభద్ర, భద్రకాళీ విగ్రహలు రాయికోడ్ లోనే ఎందుకు వెలిశాయో.. తెలుకుకోవాలంటే ఈ స్టోరీ చదవండి…

ఆలయ చరిత్ర…
రాయికోడ్ లో వెలిసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ నేపథ్యం భక్తులను ఆశ్చర్యంలోకి నెడుతుంది. సుమారు 14, 15వ శతాబ్ధంలోని కాకతీయ, విజయ నగర కాలం నాటి విశ్వాసాల ఆధారాల ప్రకారం… వీరభద్రేశ్వర స్వామి, భద్రకాళీ విగ్రహాలను కర్ణాటక, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ప్రతిష్టించాలని అక్కడి భక్తులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ విగ్రహాలను రాయలసీమ ప్రాంతం నుంచి తరలిస్తుండగా మార్గమధ్యలో రాయికోడ్ లోని మల్లికార్జున దేవాలయం వద్ద గల చెట్టుకింద సేదతీరారు. తిరిగి మరునాడు ప్రయాణం మొదలు పెట్టగా విగ్రహం ఎంతకు కదలలేదు. దీంతో ఆశ్చర్యపోయిన భక్తులు మరో రోజు వేచి చూశారు. రెండో రోజు విగ్రహాన్ని తరలి0చే భక్తులకు గజ్జెల సవ్వడితో కలలో ప్రత్యక్షమై ఇదే నాకు సరైన స్ధలం.. నేను ఇక్కడే స్వయంభవుగా వెలుగొందుతాను అని చెప్పాడట. దీంతో ఈ ఆలయం ఇక్కడ వెలిసిందని పండితులు చెబుతున్నారు.

108 శక్తి పీఠాల్లో భద్రకాళీ ఒకరుగా స్కంద పురాణం, మత్స్య పురాణంలో వివరించినట్లు ఆలయ చరిత్ర ఉంది.
ఏక శిల విగ్రహ విశిష్టత…
రోజుకు మూడు రూపాల్లో దర్శనమిచ్చే వీరభద్రుడు.. భద్రకాళీ సమేతగా 6.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఏకశిలపై ఎటువంటి ఆధారం లేకుండా ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. పురాతన శిలా సౌందర్యంతో స్వామి వారు ఉదయం బాల వీరభద్రుడిగా, మధ్యాహ్నం యువ వీరభద్రుడిగా, సాయంత్రం వృద్ద వీరభద్రుడిగా భక్తులకు దర్శనమిస్తూ పూజలందుకుంటున్నాడు.

మూడు రకాల నీటితో అమృత గుండం…
ఆలయ ప్రాంగణంలో ఉన్న గుండానికి ఓ ప్రత్యేకత ఉంది. గుండంలోని తూర్పు దిశగా ఉన్న నీరు తీయ్యగా, ఉత్తర దిక్కు ఉన్న నీరు చప్పగా, దక్షిణ దిక్కున ఉన్న నీరు ఉప్పు రుచిలో ఉంటాయని వీర భద్రస్వామి ఆలయ అర్చకులు శివకుమార్ తెలిపారు.
ఘనంగా జాతర ఉత్సవాలు…
ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయిన ఉత్సవాలు ఏప్రిల్ 28వ తేది వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వీరభద్రుడి దర్శనం కోసం వస్తుంటారు. 24న పల్లకి సేవ, అగ్ని గుండం, వీరభద్రుడికి అభిషేకం, భద్రకాళీ అమ్మవారికి కుంకుమార్చన, వీరభద్రుడి కళ్యాణోత్సవం, సాయంత్రం రథోత్సవం స్థానికంగా ఉన్న భసవేస్వర దేవాలయానికి చేరుకుంటుంది. అక్కడ భజన కార్యక్రమం. చివరి రోజైన 28న బసవేశ్వర ఆలయం నుంచి వీరభద్రేశ్వర ఆలయం వరకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లను చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *