లాక్ డౌన్లో పానీపూరీ మిస్ అవుతున్నారా?? మీకోసమే ఇది

(Vanaja Morla)
చాలామందికి మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది పానీపూరీ. నార్త్ నుండి వచ్చిందో, వెస్ట్ నుండి వచ్చిందో తెలియదు గాని, ఇప్పుడిది పక్కా హైదరాబాదీ అయి కూర్చుంది. హైదరాబాదీ లంతా పానీపూరీ ఫ్యాన్స్. మరో వింత ఏంటంటే, ఏ ఊరి కెళితే ఆ ఊరి సొంతం కావడం పానీపూరీ గొప్పదనం.
10 సంవత్సరాల క్రితం వరకు ఈ గోల్ గప్పా పెద్ద పెద్ద సిటీలలోనే దొరికేది. ఇప్పుడు చిన్న చిన్న టౌన్లలో కూడా పానీపూరీ బండ్లు వెలిసేందుకు కారణమిదే.
లాక్ డౌన్ సందర్భంగా పానీపూరి ప్రియులు వీటిని ఎంతగానో మిస్ అవుతున్నారు. వైన్ షాప్స్ ఒక్కటే కాదు పానీపూరి స్టాల్ల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి, ఎంత ఆదాయం వస్తుందో అంటూ నెటిజన్లు స్టేటస్ లు కూడా పెట్టేస్తున్నారు.
పానీపూరి మిస్ అవుతున్న పానీపూరి ప్రియులు ఏం బాధపడకండి. మీకోసం ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో మీ ముందుకు తీసుకొచ్చింది trendingtelugunews.com సరిగా రావేమో అని సందేహపడకండి. నేను మొదట్లో సంశయించాను,నాకు తయారు చేయడం రాదేఅని. అయితే,ధైర్యం చేసి మొదలుపెట్టాను, భయం భయం గానే. కాని ఆపరేషన్ సెక్సెస్. నేను కోరుకున్నట్లు , నాకు నచ్చినట్లు పానిపూరి తయారయింది. చాట్ కూడా అంతే. అందుకే సాహసం చేయరా ఢింబకా అని నేను అంటున్నాను. కరోనా లాక్ డౌన్ లో చిక్కుకుని దిక్కు తోచనపుడు పానీపూరీ చాట్ తయారు చేయడంల్ పర్ ఫెక్ట్ అయ్యాను.
లాక్ డౌన్ క్రమంగా ఎత్తేసే సూచనలు కనబడుతున్నాయ్. అపుడు మళ్లీ బతుకు బజారు పాలు, బండ్ల పాలు అవుతుంది. ఈ లోపు మీరు ఇంటిదగ్గర ఈ చిన్న ప్రయోగం చేసి పానీ పూర్ మాస్లర్లు కావాలి.  తప్పక సక్సెస్ అవుతారు. కరోనా తర్వాత  ముందు ముందు బయట బండ్లమీద తినడం మంచిదికాదని అంటున్నారు. అందువల్ల తొందరగా ఈ విద్య నేర్చుకోండి. భవిష్యత్తులో బాగా పనికొస్తుంది.
పూరి క్రిస్పీగా, పర్ఫెక్ట్ గా ఎలా చేస్తే వస్తుందో ఒకటికి రెండు సార్లు వివిధ స్టైల్స్ లో ట్రై చేసి… పర్ఫెక్ట్ గా వచ్చిన మెథడ్ ని చెబుతున్నాం. ముందుగా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం.
పూరీ తయారీ విధానం  
  1. ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ – 1 కప్పు
  2. మైదా – 2 టీ స్పూన్స్
  3. సాల్ట్ – 1/4 టీ స్పూన్
  4. నీళ్లు – సరిపడా
ముందుగా ఉప్మా రవ్వ, మైదా, ఉప్పుని చక్కగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు తీసుకుని వేడి చేసి, ఆ నీటిని కొద్దిగా కొద్దిగా పిండిలో పోసుకుంటూ స్పూనుతో కలుపుతూ వేడి చల్లారాక చేతితో చపాతీ పిండిలా మెత్తగా కలపండి. మరీ ఎక్కువసేపు కలపకండి. ఈ పిండి ఊరికే ముద్దలా అయిపోతుంది కాబట్టి మీ శ్రమంతా పెట్టి కండలు పిండేస్తూ కలపొద్దండోయ్.
అలా కలిపిన ముద్దని తడి క్లాత్ తో కప్పి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయ్యాక పిండి ముద్దని ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒకదానికి ఒకటి కలవకుండా మైదా పిండి చల్లుకుని పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా చిన్న సైజు పూరీలుగా చేసుకోండి. లేదా ఒకేసారి పెద్ద పూరి మాదిరి చేసుకుని గుండ్రంగా బిస్కెట్లు మాదిరి కట్ చేసుకోండి. ఇలా వత్తుకున్న పూరీలను ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన పరుచుకోండి(ఫ్యాన్ గాలికి పెట్టకండి). ఒక 10-12 నిముషాలు ఆరనివ్వండి.
ఈలోపు ఒక మందపాటి కడాయిలో నూనె వేడి చేసుకోండి. నూనె వేడయ్యాక మొదట చేసుకున్న పూరి నుండి మొదలు పెట్టి ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ పూరీ పొంగే వరకు గరిటతో వత్తుతూ ఉండండి. రెండువైపులా తిప్పుకుంటూ పూరి కలర్ మారే వరకు ఫ్రై చేయండి. ఇలా తయారుచేసుకున్న పూరీలను 2 గంటలు అయ్యాక ఏదైనా మూత ఉన్నడబ్బాలో భద్రపరుచుకుని అవసరం అయినప్పుడు వాడుకోండి.
టిప్ : ఉప్మా రవ్వ రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి బాగా సన్నగా ఉంటుంది, ఒకటి దీనిమీద కొంచం దొడ్డుగా ఉంటుంది. (గోధుమ రవ్వ కాదు సుమా!) బొంబాయి రవ్వలోనే రెండు రకాలు ఉంటాయి. వాటిలో దొడ్డుగా ఉన్నది పర్ఫెక్ట్ పూరీకి ఉత్తమం.
దాల్ తయారీ విధానం: 
  1. బఠానీ – 1 కప్
  2. పసుపు -1/4 టీ స్పూన్
  3. సాల్ట్-1 స్పూన్
  4. కారం – 1 స్పూన్
  5. నూనె – 2 టేబుల్ స్పూన్స్
  6. గరం మసాలా – 1/2 స్పూన్
  7. చాట్ మసాలా – 1/2 స్పూన్
  8. ఆమ్ చూర్ పొడి – 1/2 స్పూన్
  9. జిలకర పొడి – 1/2 టీ స్పూన్
  10. టొమాటో – 1
  11. కొత్తిమీర, పుదీనా – గార్నిష్ కి సరిపడా
బఠాణీలు 10-12 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటిలో పసుపు,  1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ లో 7-8 విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. అది కొంచెం వేడయ్యాక ఉడకబెట్టిన బఠానీలు, మిగిలిన నీటితో సహా వేసేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, కారం, మిగిలిన పొడులన్నీ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. వీటిలో ఏది లేకపోయినా నిరాశ చెందకండి. వేయకపోయినా పర్లేదు. చివరిగా టొమాటో, కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
పానీ తయారీ విధానం :
  1. కొత్తిమీర – గుప్పెడు
  2. పుదీనా – గుప్పెడు
  3. పచ్చి మిర్చి – 3 లేదా 4
  4. సాల్ట్ – 1/2 టీ స్పూన్
  5. నల్ల ఉప్పు – 1/2 టీ స్పూన్
  6. నీళ్లు – 4 కప్పులు
  7. చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం – పులుపుకి తగినంత
కొత్తిమీర, పుదీనా, పచ్చి మిర్చి, సాల్ట్ కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ లో కొద్దిగా వాటర్ కలుపుకుని మిగిలిన వాటర్ లోకి వడకట్టుకోవాలి. ఇలా రెండు సార్లు పుదీనా పేస్ట్ నుండి మొత్తం రసం వచ్చేవరకు ఫిల్టర్ చేసుకోవాలి. ఆ పానీలో నల్ల ఉప్పు, చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం కలుపుకోవాలి. అంతే… పానీ కంప్లీట్!
ఈ పానీ పూరి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.