తిరుమల ఆలయం మీద దాడులను తిప్పి కొట్టింది బ్రిటిష్ సేనలే
(జింకా నాగరాజు)
మొగలు సామ్రాజ్యం పతనమయ్యాక 1753లో మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి సైన్యంతో తిరుమల శ్రీవారి ఆలయం మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు.
దక్షిణ భారదేశంలో బాగా పేరున్న ఆలయం కాబట్టి, ఈ ఆలయ సంపదను దోచుకునేందుకు ముస్లిం ముష్కరులే కాదు, మరాఠా హిందూ రాజులు కూడా ప్రయత్నించారు.
అయితే, చిత్రమేంటే, ఆలయ సంపదను, పవిత్రను, సంప్రదాయాలను కాపాడింది కూడ ముస్లింలే. ముస్లింపాలకులెపుడూ ఆలయ నిర్వహణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇదే నాన్ ఇంట్ ఫియరెన్స్ (non-interference) విధానాన్ని తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఈస్టిండియా కంపెనీ వారు కూడా పాటించారు.
చివరకు తిరుమల ఆలయంలో ప్రభుత్వం జోక్యం ఏరూపంలో కూడా ఉండరాదని ఈస్టిండియా కంపెనీ వాళ్లు తిరుపతి తాశీల్దారు ప్రమేయం కూడా తీసేశారు.అపుడు తాశీల్దారే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ . కాకపోతే, ఈవొ అనే వారు కాదు.
హిందూ విశ్వాసాలలో ఎలాంటి జోక్యం వద్దని కంపెనీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం.
ఈస్టిండియా కంపెనీ గవర్నర్లు ఇంగ్లండు బోర్డు సమావేశంలో ఆలయ పాలనను చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుని, ఆలయాన్ని సర్వస్వతంత్రం చేశారు.(ఇపుడు ఆలయం ప్రభుత్వాలు మారేకొద్ది రాజకీయమవుతూ ఉంది).
నిజానికి ఇపుడు గత 20 సంవత్సరాలుగా తిరుమల మీద వచ్చినన్ని ఆరోపణలు,రాజకీయ జోక్యం గోల్కొండ సుల్తానుల కాలంలో గాని, అర్కాట్ నవాబుల కాలంలో గాని, చివరకు క్రైస్తవులైన ఈస్టిండియా కంపెనీ కాలంలో గాని రాలేదు.
కమాల్ నుంచి ఆలయ గుత్తేదారులను రక్షించే బాధ్యతను ఈస్టిండియా కంపెనీ తీసుకుంది. కమాల్ దాడి సమాచారం అందగానే తిరుపతికి సైన్యాన్ని పంపించింది.
ఈ సైన్యం కమాల్ తిరుపతిలోకి ప్రవేశించకుండా ఆ రోజు తరిమేసింది. అయితే, కమాల్ తన ప్రయత్నం వదల్లేదు. మరుసటి రోజు మరింత కట్టుదిట్టంగా తిరుపతి మీద దాడికి వచ్చాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ సైనికాధికారి ఎన్ సైన్ హోల్ట్ (Ensign Holt) ఈ యుద్దంలో చనిపోయాడు.
తిరుమల కోసం ప్రాణత్యాగం చేసిన ఈస్టిండియాకంపెనీ సైనికాధికారిగా హోల్ట్ మిగిలిపోయాడు. తర్వాత ఒగిల్వై (Ogilvie) ఈ యుద్దం కొనసాగించాడు. ఈ యుద్ధంలో కమాల్ కూర్చున్న ఏనుగు చనిపోయింది. కమాల్ ను బ్రిటిష్ సైనికులు పట్టుకున్నారు. అక్కడిక్కడే ఉరి తీశారు.
1757లో ఆర్కాట్ నవాబు ముహమ్మద్ అలీ సోదరుడు నజీబుల్లా సోదరుడి మీద తిరుగుబాటు చేశాడు. ఆయనకూ చాలా కాలంగా తిరుమల ఆలయం మీద కన్నుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా బ్రహోత్సవాల రోజున వేలాది మంది భక్తులు తిరుపతి వస్తారు. భారీగా కానుకలు సమర్పిస్తారు. కాబట్టి బ్రహ్మోత్సవాల సమయం ఆలయం మీద దాడి చేసేందుకు అనుకూలమనుకున్నాడు.
అయితే, ఈ సమాచారం తెలుసుకున్న మద్రాసు కంపెనీ ప్రభుత్వం వెంటనే సైనికులను పంపించి నజీబుల్లా కుట్రను వమ్ముచేసింది. పారిపోతూ, దారిలో ఎదురయిన తిరుపత్రి యాత్రికులను బెదిరించి వాళ్లు బ్రహ్మోత్సవాలకు వెళ్లకుండా నజీబుల్లా చెదరగొట్టి పిచ్చి ఆనందం పొందాడు. దీనితో ఆలయం రాబడిని అడ్డుకున్నారని, బ్రహ్మోత్సవాల జోరు తగ్గించానని సంతోషించాడు.
Robert Orme తన “ History of Military Transactions of the British in Hindustan” లో తిరుపతి ఆలయం మీద జరిగిన దాడుల గురించి చాలా బాగా వివరించారు.
“ This temple, one of the most famous in the Deccan, is situated on the top of the mountain. The feast of the God to whom it is dedicated is annually celebrated in September and offerings made by the concourse of pilgrims, who arrive from all parts to assist it, amount to so great a sum that the Brahmins, besides what they reserved to themselves, pay the Government an annual revenue of 60,000 pagodas or £24,000 sterling. This revenue the Nabob assigned to the English in part of expenses they had incurred in the war, as neither Brahmins nor the pilgrims are solicitous as to whom the money is paid, provided the feast goes on without interruption.”
1758 లో నజీబుల్లా రెండోసారి తిరుమల మీద దాడికి ప్రయత్నించారు ఈ సారి ఫ్రెంచ్ సాయం తీసుకున్నాడు. మొరాసిన్ (Moracin) అనే ఫ్రెంచ్ సైనికాధికారి బ్రహ్మోత్సవాల రోజున ఆలయం మీద దాడిచేసే ప్రయత్నం చేశాడు.
మొరాసిన్ నెల్లూరు నుంచి వెంకటగిరి మీదుగా కొండలు,అడవుల్లోనుంచి బ్రహ్మోత్సవాలకు ముందే తిరుమల కొండ మీద దాడి చేయాలనుకున్నాడు. చంద్రగిరి నవాబు అబ్దుల్ వహాబ్ కూడా ఆయనకు సహకరించాడు.
1758 అక్టోబర్ 5న వారు ఆలయాన్ని సమీపించారు. ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాలు 25 రోజులు జరగేవి. ఈ సైనికులు కొండమీదకు చేరుకున్నారు. కాని, ఈ సైనికులెవరూ యాత్రికులు జోలికి రాలేదు. కాకపోతే హిందూ గుత్తేదారులను లొంగదీసుకున్నారు. బ్రిటిష్ గవర్నమెంటుకు ఇచ్చే రెంటు డబ్బులను తీసుకుని వెళ్లిపోయారు.
1759 లో ఫ్రెంచ్ వాళ్లు మద్రాసు ఆక్రమించుకునే క్రమంలో ఉన్నపుడు మరాఠా సేనాపతి గోపాలరావు తిరుమల కొండ మీద దాడి చేయాలనుకున్నాడు.
మరాఠా సైన్యం వచ్చి చంద్రగిరి దామలచెరువు దగ్గిర మకాం వేసింది. వీళ్లు మొదట ఫ్రెంచ్ వాళ్ల స్నేహం కోరారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్లు సాయం చేస్తామన్నారు. అయితే వాళ్లూ మరాఠాల అభ్యర్థనని తిరస్కరించారు. దీనితో నిరాశ చెందిన గోపాలరావు తిరుమల కొండను తానే చుట్టుముట్టాలని నిర్ణయించారు. దాడిచేయండని సైనికులను ఆదేశించాడు.
సైన్యం తిరుపతిని పట్టుకుంది. అయితే, ఈ దాడిని గోపాలరావు కొనసాగించలేకపోయాడు.
అపుడు మరొకసంఘటన జరిగింది.
ఉన్న ఫలానా రమ్మని, పూనా కు రవాలని, ఆయన బాస్ మరాఠా రాజ పాలకుడు బాజీరావ్ నుంచి ఆయనకు వర్తమానం వచ్చింది. నారాయణ శాస్త్రి అనే సేనాపతి కి కొంతసైన్యాన్ని అప్పగించి గోపాలరావు పూనా బయలు దేరాడు.
అబ్దుల్ వహాబ్ ని కూడా చంద్రగిరి వెళ్లిపొమ్మన్నాడు. అయితే వహాబ్ ఎదురితిరిగాడు. గోపాల రావు అక్కడి నుంచి కదలగానే మరాఠాలను తన ఏరియా నుంచి వహాబ్ తరిమేశాడు. బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపాడు.ఆలయానికి చెందిన ఆదాయంలోతనకు కొంత వాటా ఇవ్వాలనికోరాడు. వాళ్లు అంగీకరించారు.
దీనితో నారాయణ శాస్త్రి పారిపోయి కరకంబాడి వద్ద గుడారమేసుకున్నాడు. మాతల్వార్ అనే పాలెగాడి సైన్యం సాయం తీసుకుని జూన్ 30న తిరుమల ఆలయం మీద దాడిచేయబోయాడు. ఆలయాన్ని చుట్టుముట్టాడు.
అయితే, బ్రిటిష్ సైనలు బలంగా ఉండడంతో మరింత సైన్యం పంపాలని మాతల్వార్ ని కోరాడు. ఈ సైనికులు వచ్చాక జూలై 9న తెల్లవారుజామున 4గంటలపుడు తిరుమల ఆలయం మీద దాడి చేశాడు.
ఇక్కడ పోరాటం కొన్ని రోజుల పాటు సాగింది. రక్తపాతం జరిగింది. బ్రిటిష్ వారు దిగువ తిరుపతికి అదనపు బలగాలు పంపించారు. ఈ లోపు తిరుమల కొండ నారాయణ శాస్త్రి అదుపులోకి వెళ్లింది. కింది తిరుపతి ఇంగ్లీష్ వారి చేతిలో ఉంది. వీరికి తోడు మేజర్ క్యాలియవుడ్ (Major Calliaud) నాయకత్వంలో మరింత సైన్యం వచ్చి చేరింది.
ఈ సైన్యం కరకంబాడి మీద దాడి చేసి వూరిని తగులబెట్టింది. స్థానిక పాలెగాడు కూడా ఈ గొడవలో చనిపోయాడు. తర్వాత తిరుమల కొండమీదికి ఇంగ్లీష్ సేనలు వెళ్లాయి.ఇక లాభం లేదనుకుని నారాయణ శాస్త్రి కరకంబాడికి పారిపోయాడు.
బ్రిటిష్ సైన్యం మరొకసారి కరకంబాడి మీద దాడిచేసింది. ఇది విజయవంతమయినా Ensign Wilcox తీవ్రంగా గాయపడ్డాడు.
సోదరుడు అబ్దుల్ వహాబ్ ఆగడాలు భరిచంలేక 1782లో కర్నాటక నవాబ్ హైదర్ అలీ చంద్రగిరిని తన అదీనంలోకి తీసుకున్నాడు. సోదరుడయినా సరే ఆయన్ని శ్రీరంగపట్టణం జైలుకు పంపాడు. దీనితో ఈ ముష్కరులనుంచి తిరుమలకు ఆలయానికి ఉన్న చివరి బెడద తీరిపోయింది.
ఆతర్వాత తిరుమల మీద దాడులెేవీ జరగలేదు. తిరుమల ఆలయానికి సంబంధించి మరొక కొత్త అధ్యాయం మొదలయింది.
హైదర్ అలీ కూడా ఆలయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.1782 నుంచి 84 దాకా అనికల నర్సయ్య అనే వ్యక్తిని ఆలయ నిర్వాహకుడిగా నియమించాడు. తర్వాత అపుడపుడు చుట్టుపక్కల పాలెగాళ్లు బ్రిటిష్ వాళ్లతో విబేధించి గొడవపడినా, ఆలయ కార్యకలాపాలకు ఎపుడూ అంతరాయం కలగించలేదు.
భిన్న విశ్వాసాల వాళ్లు పాలకులుగా వచ్చినా, ఆలయం మీద చాలా గౌరవంతో ఉన్నారని, భక్తుల విశ్వాసాలనుదెబ్బతీసే విధంగా ఎపుడూ ప్రర్తించలేదని ఆకాలపు చరిత్ర కారుడు ఓర్మ్ రాశాడు.
అంతేకాదు, ఆలయ సంప్రదాయాలను జాగ్రత్తగా పాటించారని కూడా ఆయన రాశారు. ఆలయాన్ని కాపాడేదుకు ఇంగ్లీష్ సైనికులు ప్రాణాలు కూడా పొగట్టుకున్నారు. మహమ్మదీయు సామంతులు కొండమీదకు వెళ్కుండా బ్రిటిష్ సైన్యాలు బాగా కాపాడాయి. ఇతర మతాల మీద ఈ నిషేధమేమిటని ఒక దశలో ఒర్మ్ కూడా ఆశ్చర్యపోయాడు.
“ The young English Ensigns in charge of the troops, risked their own lives and the lives of their men and tamely suffered defeat and loss of revenues, rather than allow Europeans, Muhammadans and the prohibited castes of Hindus to get up the mountain, even though they felt that these prohibitions were unreasonable,”అని
ఒకనాటి తిరుపతి తాశీల్దార్, చరిత్రకారుడు, పరిశోధకుడు శ్రీనివాసరావు ఈస్టిండియా కంపెనీ ఆలయపరిరక్షణ ఎలా చేసిందో Tirupati Sri Venkateswara Balaji (Origin, Significance &History of the shrine) లో చెపారు.
ఈ సంఘటనలన్నీ ఈ రోజుల్లో చీటికి మాటికి తిరుమల పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న నేటిపాలకుకు గుణపాఠం కావాలని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
2000 సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయి ఉన్న అనుబంధాన్ని ఈ ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటున్న ఈ నాటి హిందూపాలకులకు కనువిప్పు కలిగించాలి అని శ్రీనివాసరావు 1949లోనే వ్యాఖ్యానించారు.
హైదర్ అలీ కాలంలో కంపెనీ ప్రభుత్వంతో ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. ఆయన తర్వాత వచ్చిన కుమారుడు ముహమ్మద్ అలీ 1795లో చనిపోయాడు. అలీ కుమారుడు ఉమ్దుత్ ఉల్ ఉమారా అర్కాట్ సింహాసనం వారసుడయ్యాడు. అపుడు 1792 నాటి ఒప్పందాన్ని బ్రిటిష్ వాళ్లు మార్చిరాయాలనుకున్నారు. ఉమ్దుద్ దీనికి అంగీకరించలేదు.
1799లో నాలుగో మైసూర్ బ్రిటిష్ వాళ్లకు, కర్నాటక నవాబులకు మధ్య యుద్ధం జరిగింది. అపుడు బ్రిటిష్ వాళ్లు అర్కాట్ నవాబు మీద కప్పం కోసం మరింత వత్తిడి పెంచారు. దానికి తోడు నవాబు ఉమ్దుద్, మైసూర్ గవర్నమెంట్ తో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా కలసి కుట్ర చేస్తున్నారడనేందుకు కొన్ని ఉత్తరాలు బయటపడ్డాయి. బ్రిటిష్ వాళ్లకు బాగా కోపమొచ్చింది. అప్పటికే అర్కాటు నవాబు మంచాన పడ్డాడు. పోరాడే శక్తి లేదు. సంధికి అంగీకరించాడు. ఆయితే, ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలోపు ఆయన చనిపోయాడు.
సింహాసనం వారసత్వం తీసుకున్న కుమారుడు అలీ హుసేన్ ఈ ఒప్పందలోని షరుతులను తిరస్కరించాడు.దీనితో కంపెనీ ప్రభుత్వానికిమళ్లీ కోపం వచ్చింది. హుసేన్ ను తొలగించి నవాబు సోదరుడు అజిమ్ ఉల్ ఉమారాను నవాబుగా ప్రకటించారు.
ఆయన 1801లో బ్రిటిష్ వాళ్లిచ్చే స్టయిఫండ్ తీసుకుని రాజ్యాన్ని బ్రిటిష్ కు అప్పగించాడు. అలా కర్నాటక సింహాసనం పూర్తిగా తూర్పు ఇండియా కంపెనీ అదీనంలోకి వచ్చింది. దీనితో పాటు తిరుమల,తిరుపతి ప్రాంతం పూర్తిగా ఇంగ్లీష్ పాలనలోకి వచ్చింది.
చంద్రగిరి రాజు గోడౌన్లు కట్టుకోవాడానికి కొంత భూభాగం (మద్రాసు) అంతకు ముందు వందేళ్ల కిందట కొంత భూభాగం అప్పగించాడు. 1801లో అర్కాట్ నవాబు రాజ్యమంతా అప్పగించాడు.
అయితే, అధికార మార్పిడి తర్వాత ఈస్టిండియా కంపెనీ వాళ్లు ఆలయ పాలనను ఆధునికీకరించే చర్యలు తీసుకున్నారు తప్ప ఆలయ మర్యాదలకు భంగం కల్గించలేదు. ఆలయ పాలన కోసం చిత్తూరు కమిషనర్ గా ఉండిన బ్రూస్ ఒక నియమావళి రూపొందించాడు.ఇందులో 42 నియమాలున్నాయి. బ్రూస్ కోడ్ అంటే ఇదే. తిరుమల ఆలయ పాలన లో బ్రూస్ కోడ్ చాలా కీలకప్రాత వహించింది.
ఇపుడు స్వతంత్రం వచ్చాక, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాక తిరుమల ఆలయం ఎన్నివివాదాలు ఎదుర్కొంటున్నదో అందరికి తెలిసిందే.
(జింకా నాగరాజు,జర్నలిస్టు, హైదరాబాద్)
Like this story? Share it with a friend!
2 thoughts on “తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…”
Comments are closed.