జగన్ మైలవరం సభలో కుట్రకోణం దాగి ఉంది -దేవినేని ఉమా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన జగన్ దేవినేని ఉమపై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. పోలీసులు టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని, గుంటనక్కలకు సెల్యూట్ చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు సీఆర్పీఎఫ్ పోలీసులపై దాడికి దిగడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన కింద ఉంది చదవండి.

నిన్న మైలవరంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ప్రవర్తించాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా వాళ్ళ సొంత రూట్లో వెళ్లి ప్రజలకు ఇబ్బందులు కల్గించారు. జగన్మోహన్ రెడ్డి తన తాగిన కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులు మీద దాడి చేయించారు.

పోలీసులు మీద రాళ్లు, చెప్పులు విసరడం వంటింవి చేస్తుంటే వాటిని పోలీసులు అడ్డుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో మైలవరంలో ఇలాంటి గొడవలు చూడలేదు. ఇలాంటి వాళ్ళకా మనం ఓటు వేయాల్సింది అని ప్రశ్నించారు ఉమా. లోటస్ పాండ్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్ని చేశారు.

మైలవరంలో నిన్న వాళ్ళు ప్రవర్తించిన తీరును సభ్యసమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఓడిపోతాం అనే భయంతో ఇలాంటి దాడులకు పాల్పడటం వారి అరాచకానికి నిదర్శనం. నిన్న అధికారులు సూచించిన దారిలో రాకుండా కార్యకర్తల మధ్యలో నుంచి వచ్చి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడి ఇలాంటి దాడులు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించారని ఉమా ఆరోపించారు.

జగన్ సభలో జనం లేరు అని అసహనంతో జనాలను రెచ్చగొట్టి మీడియా, పోలీసుల మీద దాడి చేయించారు. అధికారంలోకి రాకుండానే ఇలాంటి దాడులు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారంటూ నిలదీశారు. నిన్న జరిగిన దాడి ప్రజల పైన జరిగిన దాడి. జగన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఎలక్షన్ కమిషన్ నిన్న మైలవరం లో జరిగిన దాడి మీద వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమా.

పులివెందులకు నీళ్లు ఇచ్చాము అని, అతని అవినీతిని ప్రశ్నిస్తున్నామని జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సభా వేదిక పై నుంచి జగన్మోహన్ రెడ్డి దిగగానే అతని కార్యకర్తలు సీఆర్పీఎఫ్ పోలీసులు మీద దాడి చేశారు అంటే ఏదో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఉమా.

కేవలం నన్ను, చంద్రబాబు గారిని తిట్టడానికే జగన్ మైలవరం సభ పెట్టుకున్నారు కానీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేకపోయారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి, ఒక మానసిక రోగంతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రాకుండా కేసీఆర్ అడ్డుకుంటుంటే అలాంటి కేసీఆర్ మంచోడు అంటున్నాడు. కేసీఆర్, మోదీ గొప్పవారు అని జగన్ మాట్లాడుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపమని కేసీఆర్ కూతురు, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేస్తే జగన్ ఇంకా కేసీఆర్ ని సమర్థిస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రానికి, పోలవరానికి ఎలా సహకరిస్తారో దీని పైన ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. వైసీపీ కి వేసే ప్రతి ఓటు పోలవరానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులకు వేసినట్టే అని అన్నారు. ఈ వారం రోజులు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి, వైసీపీ నాయకులు ఇలాంటి దాడులు చేయడానికి చూస్తున్నారు అని హితవు పలికారు. ప్రజలందరూ అభివృద్ధికి ఓటు వేయాలి అని సూచించారు దేవినేని ఉమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *