బస్సులు నడపడానికి జగన్ గ్రీన్ సిగ్నల్, త్వరలో ప్రకటన

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలనుంచి రావాలనుకుంటున్నవారికి బస్సులు నడపడంపై ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టింది.
ఈ నగరాలకు సర్వీసులు ప్రారంభించి దశలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఉండదు.
బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలుంటాయి. ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంటారు.  ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు తీసుకోవాలి. దీని వల్ల వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుంది.
కేంద్రం లాక్ డౌన్ మే 31 దాకా పొడిగిస్తూ  కొత్త మార్గదర్శక సూత్రాలను ప్రకటంచిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌–19పై  ముఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. అక్కడ  అంతర్రాష్ట్ర బస్ సర్వీసులన నడిపే విషయం చర్చకు వచ్చినపుడు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని,
బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోకూడా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు.
దీనిపై  వెంటనే విధివిధానాలు తయారుచేయాలని, సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపాలి, ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సు సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి తెలిపారు.  బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటన వెలువడుతుంది.
పెళ్ళిళ్ళ వంటి కార్యక్రమాల మీద ఆంక్షలు కేంద్ర నియమాలకు మేరకు కొనసాగుతాయి. పెళ్లిళ్లకు కేవలం 50 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక  రెస్టారెంట్లు పాక్షికంగా పనిచేస్తాయి. అక్కడ  కూర్చొని  భోంచేయడం నిషేధం. కాకపోతే,  రెస్టారెంట్ల నుంచి పార్శిల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, అక్కడ కూడా కూడా భౌతికదూరం పాటిస్తూ పార్శిల్ తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
కర్ఫ్యూ నియమంలో మార్పులేదు.  రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి  వెల్లడించారు. దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతిస్తారని ఆయన చెప్పారు.