Home Breaking వివాదాలు ముద్దాడే నెల్లూరు ఆనం కు ఏమైందబ్బా ?

వివాదాలు ముద్దాడే నెల్లూరు ఆనం కు ఏమైందబ్బా ?

461
0

నెల్లూరు ఆనం కు ఏమైందబ్బా?

నెల్లూరు జిల్లాలో ఆనం వివేకానందరెడ్డి పేరు తెలియని వారు ఉండరు. ఆనం వివేకా అనగానే ఎవరికైనా ఒల్లు జలదరింపు తప్పదు. ఎందుకంటే ఆయన మాట, యాస, భాష అన్నీ అవతలివాళ్లను భయపెట్టేలా ఉంటాయి. బాధపెట్టేలా ఉంటాయి. కోపగించుకునేలా ఉంటాయి. రగిలిపోయేలా ఉంటాయి. నిత్యం వివాదాలను ముద్దాడే రాజకీయ నేతల జాబితాలో ఆనం వివేకా ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనం చేసిన కామెంట్స్ తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించాయి. అప్పట్లో సమైక్యవాదులను సైతం అంతే స్థాయిలో తన వాగ్దాటితో ఆనం కదిలించారు. తన రాజకీయ జీవితమంతా వివాదాలతో నడిచినా.. మొక్కఓని దీక్షతో రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.  

ఆనం వివేకానందరెడ్డి. ఎంతటివారినైనా గడగడలాడించగల నోటి మాట, గంభీరమైన వ్యవహార శైలి ఉన్న ఆనం నేడు ఆసుపత్రిలో ఉండడం అందరినీ బాధకు గురిచేస్తున్నది. ఇంతకూ ఆనం కు ఏమైందబ్బా అని నెల్లూరు వాళ్లే కాదు.. రెండు రాష్ట్రాల జనాలంతా చర్చించుకుంటున్నారు. మరి ఆనం వివేకానందరెడ్డి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ఆయన కోలుకుంటున్నారని చెబుతున్నారు. గంభీరంగా పులిలా ఉన్న వ్యక్తి మాయదారి క్యాన్సర్ కారణంగా బక్కచిక్కిపోయారు. రెండు రోజుల క్రితం ఆనం వివేకాను ఆంధ్రప్రదేశ్ సిఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆనం కు ట్రీట్ మెంట్ నడుస్తోందని డాక్టర్లు వివరించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి కుదుట పడి మామూలు మనిషి కావడానికి మరికొంత కాలం పట్టొచ్చని అంటున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితిపై గోప్యత పాటిస్తున్నారు. గతంలో వైసిపి ఎమ్మెల్యే రోజా మీద ఆనం తీవ్రమైన వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో రోజా ఆనం వివేకా మీద పరువు నష్టం దావా వేసింది. ఆ కేసులో విచారణకు రావాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. అయితే ఆనం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, కోర్టుకు రాలేనని రాతపూర్వకంగా ఆనం తెలియజేశారట. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఆమె చెప్పడంతో అందరికీ తెలిసింది. అయితే ఆనం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా అని ఆయన అభిమానులు, సహచరులు ఆందోళన చెందుతున్నారు.

 ఉమ్మడి రాష్ట్రంలో ఆనం సోదరులు హవా చెలాయించారు. వైఎస్ కేబినెట్ లో ఆనం రామనారాయణరెడ్డి ఫైనాన్స్ మంత్రిగా ఉన్నారు. వివేకానందరెడ్డి మాత్రం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ జరిగిందంటే చాలు అటు ఎమ్మెల్యేలు, ఇటు మీడియావాళ్ళు, సెక్యూరిటీ వాళ్లు, అసెంబ్లీ స్టాఫ్ అందరూ ఎదురుచూసేది ఆనం వివేకా కోసమే. ఎందుకంటే ఆయన రోజొక స్టయిల్ తో అసెంబ్లీకి వచ్చి హల్ చల్ చేయడం అలవాటు. ఒకరోజు కిర్రు చెప్పులు వేసుకుని అసెంబ్లీకి వచ్చేవారు. అదేమంటే.. ఇలాంటి చెప్పులు ఎన్టీఆర్ కు ఇష్టం. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ను. అప్పట్లో నేను ఆయనకు కుట్టించి ఇచ్చాను. ఇప్పుడు నేను కూడా వేసుకున్నాను అనేవారు. ఇంకోరోజు అచ్చమైన పంచె కట్టుకుని స్టయిల్ గా నడుస్తూ అసెంబ్లీలో హల్ చల్ చేసేవారు. ఇంకోరోజు జెమ్స్ బాండ్ డ్రెస్ లో వచ్చేవారు. మరోరోజు జుట్టుకు కొత్త రకం రంగులు వేసుకుని కనబడేవారు. నిత్యం మీడియా ఇంటెన్షన్ ను, సభ్యుల ఇంటెన్షన్ ను ఎట్రాక్ట్ చేయడంలో ఆనం ను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసందర్భాల్లో వెరైటీ విషయాలు ఏం లేవనుకుంటుండగానే.. సడన్ గా అసెంబ్లీ ఆవరణలోనే సిగరేట్ ముట్టించి మీడియా వాళ్లకు కనబడేలా తాగేవారు. తెల్లారి అసెంబ్లీలో సిగరేట్ తాగిన ఆనం అని పత్రికల్లో వచ్చేది. అలా రావాలన్నది ఆయన ఆకాంక్ష. కొన్నిసార్లు చేతికి పెద్ద పెద్ద కడియాలు పెట్టుకుని వచ్చేవారు. లాబీల్లో పొడవైన సుట్టలు తెచ్చి తాగేవారు. సిగరెట్ ను సగం విరిచి తాగడం చేసేవారు. ఏదేమైనా ఆయన గురించి ప్రతిరోజు పత్రికలు, మీడియాలో ఉండేలా ప్లాన్ చేసుకునేవారు ఆనం.

ఇక మహిళా ఎమ్మెల్యేలకు ఆనం వివేకా అంటే గుండెల్లో గుబులు పుట్టేది. ఎంతటి మాటకారి నాయకురాలైనా సరే ఆనం వారిని ఆటపట్టించేవారు. ఇక నన్నపనేని రాజకుమారి ఆనంకు ఎదరైతే.. వారి సంభాషణ వినేందుకు లాబీల్లో ఉండే రిపోర్టర్లంతా అక్కడే చేరేవారు. నియోజకవర్గంలో సైతం తన గురించి పాజిటివ్ గా కానీ.. నెగిటివ్ గా కానీ.. ప్రతిరోజు ఆయన మీద పేపర్లో వార్త రావాల్సిందే అనేవారు. కొన్ని పత్రికా రిపోర్టర్లు ఆయన మీద వార్తలు రాయకపోతే వారిని పిలిపించి తన మీద వార్తలు రాయమని ఆర్డర్ వేసేవారు. రోజు మీ గురించి భజన వార్తలు రాయాలంటే మాకు సాధ్యం కాదుగదా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. నా గురించి రోజు పాజిటీవ్ వార్తలే రాయమని ఎవరన్నారు? నెగిటివ్ కూడా రాయండి. ఏదో ఒకటి కానీ.. నామీద రోజు వార్త రావాలి అనేవారు. మీకు నెగిటివ్ వార్తలు దొరకకపోతే నాకు ఫోన్ చేయండి.. నా గురించి నేనే నెగిటివ్ వార్తలు ఇస్తాను అనేవారని నెల్లూరు జిల్లా సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ చెప్పుకుంటారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిపోయారు. కానీ వారిద్దరికీ టిడిపిలో గొప్పగా ఆదరణ లేదన్న ప్రచారం కూడా ఉంది. ఆనం వివేకా తొందరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అందరూ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here