తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో టెన్షన్ టెన్షన్

పార్లమెంటు ఎన్నికల తొలి విడత పూర్తయింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఎన్నికలు తొలి విడతలోనే జరిగాయి. ఎపిలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగినందున పార్లమెంటుకే ఇప్పుడు జరిగాయి. ఆంధ్రాలో హింస జరిగింది. రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద దాడి జరిగిందని టిడిపి వర్గాలు ఆరోపించాయి. కోడెల పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నందుకే ఆయనను బయటకు రప్పించి తరిమికొట్టామని వైసిపి వర్గాలు అంటున్నాయి.
ఇక తెలంగాణలో  ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో చూపిన ఓటరు చైతన్యం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో చూపలేకపోయారు. గత ఎన్నికల కంటే ఈసారి పది శాతానికి పైగా ఓటింగ్ తగ్గింది. పట్టణాలు, నగరాల ఓటర్లు గతంలాగే నిరాసక్తత చూపారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులంతా ఎవరికెన్ని సీట్లు వస్తాయన్న లెక్కల్లో తలమునకలయ్యారు. ఏ సీటు ఎవరికి వస్తుంది? ఏ వర్గం ఎవరికి ఓట్లేశారు? అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఎవరికి వారే తమదే విజయం అంటే తమదే గెలుపు అని పైకి ధీమాతో ఉన్పప్పటికీ లోలోన గజగజ వనికిపోతున్నారు. రకరకాల సర్వేలను బేరీజు వేసుకుని అంచనాలు వేస్తున్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికలు తెలుగునేల మీద చాలామంది నేతల లెక్కలు సెటిల్ చేయబోతున్నాయన్నది జగమెరిగిన సత్యమే. పాత నాయకత్వమే కొనసాగుతుందా? లేదంటే కొత్త నాయకత్వానికి జనాలు బాధ్యతలు అప్పగించారా అన్నది ఈ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. మే 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు టెన్షన్ తప్పేలా లేదు.

ఇవీ ఆంధ్రా లెక్కలు

ఎపి రాజకీయాలను పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రానికి 9ఏళ్ల పాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లపాుట సిఎంగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే మరోసారి ఎపికి సిఎం అవుతారు. ఒకవేళ ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటా అన్నది తేలాల్సి ఉంది. ఓడిపోయే పరిస్థితే ఉంటే రాష్ట్ర రాజకీయాలను తనయుడు లోకేష్ కు అప్పగించి జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారా? లేదంటే ఎపిలో ప్రతిపక్ష పాత్ర పోశిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుటివరకు టిడిపి యువనేత లోకేష్ తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. కానీ 2019 తర్వాత తన సమర్థతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా లోకేష్ మీద రాజకీయ భారం ఎక్కువగానే ఉంటుంది. లోకేష్ భాష మెరుగుపడకపోతే రాజకీయ కెరీర్ ప్రమాదంలో పడే చాన్స్ ఉంది.
చంద్రబాబు నాయుడు తన సహచరుడు, ప్రత్యర్థి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డితో సుదీర్ఘకాలం తలపడ్డారు. ఇప్పుడు ఐదేళ్లుగా వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డితో తలపడ్డారు. అయితే ప్రతిపక్షంలో ఉండి తలపడడం వేరు, అధికార పక్షంలో ఉండి తలపడడం వేరు. రేపు ఒకవేళ వైసిపి అధికారంలోకి వస్తే జగన్ సిఎం అవుతారు. అప్పుడు తండ్రితో పోరాడిన చంద్రబాబు రేపు కొడుకు జగన్ తోనూ పోరాడతారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ రేపు కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ మేజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తే చంద్రబాబు సేవలు జాతీయ రాజకీయాలకు పెద్దగా అక్కరకు రాకపోవచ్చు. అప్పుడు చంద్రబాబు రాష్ట్రానికే పరిమితం అవుతారా అన్నది కూడా చూడాలి. లేదంటే సంకీర్ణ ప్రభుత్వాలు తెర మీదకు వస్తే మాత్రం చంద్రబాబు రాష్ట్రంలో అధికారం రాకపోయినా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే చాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశవ్యాప్తంగా చంద్రబాబుకు ఫాలోయింగ్ ఉండడం వంటివి ఆయనకు పనికొస్తాయి.
ఇక ఎపిలో వైసిపి అధినేత జగన్ పరిస్థితి కూడా తేలనుంది. వైసిపి అధికారంలోకి వస్తే జగన్ అల్టిమేట్ గా సిఎం అవుతారు. కానీ అధికారం రాకపోతే మాత్రం మరో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అధికారం రాకపోయినా గట్టి ప్రతిపక్షంగా వైసిపి ఉంటుందా? జగన్ కు ఉన్న మొండితనం, చంద్రబాబుపై ఉన్న కసి, సిఎం పీఠం పై ఉన్న మమకారం ఇవన్నీ బేరీజు వేస్తే జగన్ కచ్చితంగా ప్రతిపక్ష పాత్రలో రాజకీయ పోరాటం కొనసాగించే అవకాశాలే కనబడుతున్నాయి.

ఇక ఆంధ్రాలో ఉన్న మరో నాయకుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ గానే కనబడుతున్నారు. ప్రజారాజ్యం స్థాపించిన సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఆ తర్వాత ప్రజారాజ్యం దుకాణం మూతపడిన తర్వాత కొంతకాలానికి జనసేన అనే పార్టీని స్థాపించుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేయకుండా టిడిపి, బిజెపికి కూటమికి మద్దతు పలికారు. తీరా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్న ప్రచారం ఉంది. సినిమాల్లో పవన్ కు ఇంకా క్రేజ్ ఉన్నది. మరి రానున్న ఐదేళ్ల కోసం రాజకీయాల్లోనే కంటిన్యూ చేస్తారా? లేదంటే సినిమాల్లోకి తిరిగి వెళ్లిపోెతారా? లేదంటే సినిమాలు, రాజకీయాలు రెండూ నడుపుతారా అన్నది తేలాల్సి ఉంది.

తెలంగాణ లెక్కలు ఇలా ఉంటాయేమో?

తెలంగాణ విషయానికి వస్త ఈ ఎన్నికలు సిఎం కేసిఆర్, ఆయన తనయుడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కు ప్రతిష్టాత్మకంగానే భావించాలి. సారు, కారు 16 నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. అందులో ఒక్కటి తగ్గినా వారి లెక్క తప్పినట్లే. టిఆర్ఎస్ కనీసం పది సీట్లు సాధిస్తే మెరుగైన రీతిలోనే ఆ పార్టీ ఉంటుంది. అదే సమయంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే పరిస్థితే ఉంటే వెనువెంటనే కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టే చాన్స్ ఉంది. అప్పుడు తెలంగాణకు కేటిఆర్ ను సిఎం చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేసిఆర్ అయితే ప్రధాని లేదంటే రాష్ట్రపతి లాంటి పెద్ద పోస్టు తీసుకుని మరో ఐదేళ్లపాటు దేశంలో కీలక నేతగా చెలామణి అవుతారు. ఒకవేళ కాంగ్రెస్, బిజెపి మంచి మెజార్టీతో ప్రభుత్వంలోకి వస్తే కేసిఆర్ కు జాతీయ రాజకీయాల్లో స్కోప్ ఉండదు. అప్పుడు ఆయన మరో ఐదేళ్లపాటు సిఎంగానే కొనసాగుతూ పార్టీలో కేటిఆర్ ను బలోపేతం చేసే చాన్స్ ఉంది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగానే కనబడుతున్నది. 2019 ఎన్నికలు ఆ పార్టీలో సుమారు డజన్ మంది సిఎం అభ్యర్థులకు రాజకీయ విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది.  మరికొంత మంది కాంగ్రెస్ లీడర్ల ప్రతిష్ట మసకబారే చాన్స్ కూడా ఉంది. ఇంకొందరు రాజకీయాలకు దూరమయ్యే చాన్స్ ఉంది.
ఒకవేళ తెలంగాణలో 10 సీట్లకంటే తక్కువగా టిఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీ ఐదారు గెలిచినా తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీ టిఆర్ఎస్ మీద పోరాటం చేసే చాన్స్ ఉంది. అదేకాకుండా కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా కానీ, పొత్తులో భాగంగా కానీ అధికారంలోకి వస్తే ఇక ఇక్కడ ఆ పార్టీకి సావులేదు. టిఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
కాంగ్రెస్ లో అంతో ఇంతో ఫ్యూచర్ ఉన్న నాయకుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి బ్రదర్స్, దాసోజు శ్రవణ్ లాంటివాళ్లు రాజకీయ పోరాటం చేసే అవకాశముంది.

ఇక టిఆర్ఎస్ లో కేసిఆర్, కేటిఆర్ తో సమానమై బలమున్న నేతగా హరీష్ రావు ఉన్నారు. ఆయనను కొంతకాలంగా టిఆర్ఎస్ లో దూరం పెడుతున్నారు. మరి 2019 ఎన్నికల ఫలితాలే హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశించే చాన్సెస్ ఉన్నాయి. టిఆర్ఎస్ 10 పైన సీట్లు గెలిచి కేంద్రంలో సంకీర్ణం వస్తే హరీష్ రావు పరిస్థితి మరింత ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఒకవేళ కేంద్రంలో ఏదైనా పార్టీ సింగిల్ గా అధికారంలోకి వస్తే హరీష్ వర్గానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది.

ఏది ఏమైనా 2019 ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా లెక్కలు సరిచేయడం మాత్రం ఖాయం.
రచయిత : ఎ. సంజయ్, హైదరాబాద్.
(ఈ ఆర్టికల్ లోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

 

ఈ వీడియో వార్త చూడండి…

https://trendingtelugunews.com/thunder-shock-at-ghatkeswar-pertol-bunk/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *