Home Breaking ఆ శాఖ ఉద్యోగులపై కేసిఆర్ కన్నెర్ర

ఆ శాఖ ఉద్యోగులపై కేసిఆర్ కన్నెర్ర

385
1
SHARE

ముందస్తు ఎన్నికలు ముగిసిపోయి పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణ సిఎం కేసిఆర్ రాష్ట్రంలోని ఒక శాఖ ఉద్యోగులపై కన్నెర్రజేశారు. ఆ శాఖ ఉద్యోగుల భరతం పడతానని హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ల సంగతేంటో తేలుస్తానని స్పష్టం చేశారు. ఇంతకూ పార్లమెంటు ఎన్నికల వేళ కేసిఆర్ అంతగా కన్నెర్రజేసిన శాఖ ఏమిటి? అసలు ఎందుకు ఆ శాఖ మీద కేసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు అనుకుంటున్నారా? చదవండి మరి.

తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు. ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక మజిలీలు ఉన్నాయి. అన్నీ ఆయన  అనుకున్నట్లు జరిగితే అతి సమీప కాలంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టినా ఆశ్చర్యం లేకపోలేదు. బుధవారం జరిగిన పరిణామాలు చూస్తుంటే కేసిఆర్ తెలంగాణలోని రెవెన్యూ ఉద్యోగుల తీరు పట్ల తీవ్రాతి తీవ్రమైన కోపంతో ఉన్నట్లు కనబడుతున్నది.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న నానుడి ఉన్నట్లు కేసిఆర్ అనుమతి లేనిదే ప్రగతి భవన్ లోకి చీమ కూడా దూరలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు చివరకు మంత్రులు కూడా కేసిఆర్ కనుసైగ లేకపోతే ప్రగతిభవన్ లో కాలు పెట్టలేరు. అధికారిక భవనమైనా అక్కడకు వెళ్లడం కష్టం. ఇక ప్రగతి భవన్ లోకి సామాన్య మానవులను రానీయడంలేదని, వాళ్ల బాధలు, కష్టాల గురించి పట్టించుకోవడంలేదని ఒకవైపు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో బుధవారం ఓ యువకుడి సమస్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు.

మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియోను చూసిన వెంటనే కేసీఆర్ స్పందించారు. సిఎం ఆఫీసు నుంచి నేరుగా శరత్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ రైతు భూమిని విఆర్ఓ వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించారని రైతు శరత్ కేసిఆర్ కు వివరించారు.

మాటల మధ్యలో సిఎం కేసిఆర్ రెవెన్యూ ఉద్యోగుల మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విఆర్ఓ మీద కోపం ప్రదర్శించారు. విఆర్ఓ గాడు అంటూ నోరు జారారు. మొత్తం విఆర్ఓ వ్యవస్థ దరిధ్రంగా పాడైందని సీరియస్ అయ్యారు. అంతేకాదు ‘‘రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెకు దిగుతారట… వాళ్లు సమ్మెకు ఉపాయాలు చేస్తున్నారు… ధరణి అనే వెబ్ సైట్ తీసుకువస్తుంటే అడ్డంపడుతున్నరు… ధరణి వెబ్ సైట్ వస్తే రెవెన్యూ ఉద్యోగులకు అసలు పనేం ఉంటది… అందుకే వాళ్లు ఇలా చేస్తున్నరు… పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే నేను శ్రీకారం చుడుతున్న. జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయిత. మొత్తం రెడీ చేసి పెట్టిన. రేపు యాక్షన్ మొదలు పెట్టగానే… ధర్నాలు చేస్తరు. సమ్మెలు చేస్తరు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ మొత్తం సమ్మెకు పోతది. జూన్ తర్వాత కఠినాతి కఠినంగా చర్యలు ఉంటాయి.’’ అని కేసిఆర్ రైతు శరత్ తో వివరించారు.

ముందస్తు ఎన్నికల్లో 88 స్థానాలతోపాటు బోనస్ గా మరో 12 స్థానాలను గులాబీ ఖాతాలో వేసుకుని ఊపుమీదున్న కేసిఆర్ సడెన్ గా సామాన్య రైతు సమస్యను ఫేస్ బుక్ లో చూసి స్పందించి క్షణాల మీద సమస్య పరిష్కారం చేయడం, ఆ రైతుకు ఫోన్ చేసి మాట్లాడడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉన్నఫలంగా కేసిఆర్ ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారబ్బా అన్న చర్చలు ఊపందుకున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం ఉన్నప్పుడు రైతుకు ఫోన్ చేసి మాట్లాడిన తీరును రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ నాయకులు.

అంతేకాదు ముందస్తు అసెంబ్లీలో దుమ్మురేపిన టిఆర్ఎస్ శాసనమండలి ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ పార్టీ పరోక్ష మద్దతుతో పోటీ చేసిన వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. శాసనమండలిలో టిఆర్ఎస్ చీఫ్ విప్ గా ఉన్న పాతూరి సుధాకర్ రెడ్డి ఘోర పరాజయం చవి చూశారు. చదువుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు అంతా టిఆర్ఎస్ సర్కారు వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న ఇంప్రెషన్ కలిగేలా మంగళవారం వెలువడిన ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా పడుతుందేమో అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

ఇలాంటి సమయంలో కేసిఆర్ ఒక సామాన్య రైతుకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడడం… ఆ రైతుకు రైతుబంధు కింద రావాల్సిన డబ్బు ఇప్పించడం, విఆర్ఓ ను సస్పెండ్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతేకాదు పనిలోపనిగా రెవన్యూ ఉద్యోగుల మీద గరం గరం అయ్యారు కూడా.

ఏది ఏమైనా కేసిఆర్ చేసిన ఫోన్ సామాన్య రైతుకే కావొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశమైందనే చెప్పాలి. శాసనమండలి ఫలితాలను మరుగునపరిచేందుకే అనే విమర్శలు వస్తే రావొచ్చు కానీ… సమస్యలతో సతమతమవుతున్న అన్నదాతకు ఇది ఒక వరం గానే భావిస్తున్నారు. ఇలాగే సోషల్ మీడియాలో సమస్యలను లేవనెత్తే వారిని గురించి కూడా దృష్టి పెట్టాలని బాధిత జనాలు కోరుతున్నారు.

దీనికి మూలమైన వార్త కింద ఉంది చదవండి

సోషల్ మీడియాలో సమస్య చెప్పిన యువకుడు.. స్పందించిన సీఎం కేసీఆర్

 

 

హాట్ న్యూస్ : వీడియో చూడండి…

కాంగ్రెస్ అంజన్ కుమార్ మీటింగ్ లో డిష్యూం డిష్యూం (వీడియో)

Comments are closed.