(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
మూడు రాజధానుల ప్రతిపాదనపై తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలలో సదస్సు జరిగింది. 2014 లో నాటి ప్రభుత్వం జీఓ 120 ని అమలు చేయడం వల్ల రాయలసీమ జిల్లాల విద్యార్థులకు దక్కాల్సిన లోకల్ రిజర్వేషన్లు దక్కలేదు
ఫలితంగా సీమ విద్యార్థులు నష్టపోయిన నేపధ్యంలో రాయలసీమ ఉద్యమం జరగడం మరో వైపు తల్లిదండ్రులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీఓను రద్దు చేసేలా చేసింది.
అలా రాయలసీమ ఉద్యమం సాధించిన తొలి విజయంగా పద్మావతి మెడికల్ కళాశాల చరిత్రలో నిలిచింది. అలాంటి కళాశాలలో మూడు రాజధానుల ప్రతిపాదనలో రాయలసీమ ప్రయోజనాలపై సదస్సు జరగడం సంతోషాన్ని కలిగిస్తుంది.
ఈ సదస్సులో నాతో బాటు ప్రొఫెసర్ జయచంద్రా రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ కు హైకోర్టు తోబాటు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తిరుపతికి ఉన్న సహజ వనరులను ఉపయోగానికి ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి అమరావతి సమస్య వెళ్లిన అంశంపై కూడా చర్చ జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిని కొనసాగించాలని అక్కడి రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని హెగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. దీనితో ఎదో జరిగిపోతున్నట్లు మళ్ళీ ప్రచారం జరుగుతోంది.
