శ్రీ‌వారి మెట్టు – మహద్వారం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-3)

(తెలంగాణ నుంచి వచ్చి తిరుపతిలో సెటిలైన  ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.)
(రాఘవ శర్మ)
మా ఇంట్లో అంతా తిరుమ‌ల వెళ్ళాలనుకున్నారు. ‘ శ్రీ‌వారి మెట్టు చాలా దగ్గర దారి’ అన్నాడు మా పక్కింట్లో ఉండే ‘ మంగలి శెట్టి’. ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు. ఆయ్యన్ని అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. పెళ్ళిళ్ళు, ఇతర శుభ కార్యాలకు సన్నాయి వాయించేవాడు. ప్రతి సాయంత్రం వరండాలో కూర్చుని సన్నాయితో అన్నమయ్య కీర్తనలను వినిపిస్తుంటే తన్మయులై పోయే వాళ్ళం. అన్నమయ్య కీర్తనలను నేను తొలిసారిగా విన్నది ఆ సన్నాయి నాదంలోనే. సుబ్రమణ్యం, శంకర్ రెడ్డిని కూడా మాతో కొండకు రమ్మన్నాం.
ఓ రోజు సాయంత్రం పెరుమాళ్ళ పల్లె నుంచి కొండకు బయలుదేరాం. పొలాల గుండా దగ్గర దారిలో శ్రీవారి మెట్టుకు నడక మొదలు పెట్టాం. కొంత దూరం వెళ్ళాక అంతా దట్టమైన అడవి. మధ్యలో సన్నని నడకదారి. కాసేపట్లో అక్కడికి చేరుకున్నాం. చీకటి పడక ముందే తిరుమల చేరుకోవాలి. శ్రీవారి మెట్టు వద్ద ఒకే ఒక్క టీ ‘ అంగడి ‘ . ఈ దారిలో కొండకు నడుచుకుంటూ వెళ్లే వాళ్లంతా ఇక్కడే సైకిళ్లు పెడతారు. చీకటి పడే లోపు టీ అంగడి మూసేస్తారు. ఈ లోగా దిగే వాళ్ళు దిగి సైకిళ్లు తీసుకుని వెళ్ళిపోతారు. చీకటి పడితే ఆ దారిలో ఎవ్వరూ కనిపించరు.చిరుతల భయం.
శ్రీవారి మెట్టు నుంచి కనిపిస్తూ కనువిందు చేస్తున్న తిరుమల కొండ
నడక మొదలు పెట్టాం. చెట్ల మధ్య నుంచి సన్నగా సూర్యకిరణాలు వాలుతున్నాయి. ఎదురుగా ఎత్తైన పచ్చని కొండ. సూర్యుడు పడమటి దిక్కుకు పయనమయ్యాడు. శ్రీవారి మెట్టు చేరే వరకు దారంతా బండలు పరిచి ఉన్నాయి. నడిచి నడిచి అవి నునుపు తేలాయి. నడిచే బండల పైన పేర్లు చెక్కా రు, కొన్ని తెలుగులోనూ, కొన్ని తమిళంలోనూ… ‘ ఈ బండలన్నీ మా మాపెరుమాళ్ళ పల్లె వాళ్లే వేశారు ‘ అన్నాడు మంగలి శెట్టి. నిజంగా అతనొక మాటల పుట్ట. దారి పొడవునా ఏదో ఒకటి మాట్లాడుతుండబట్టి అలుపు లేకుండా ఎక్క గలుగుతున్నాం.
శ్రీవారి మెట్టు నడకడారిలో రెండవ సత్రం దాటాక ఒకప్పటి మెట్లు
‘ తిరుమల కొండపైన ఉన్న పెరుమాళ్ (దేవుడు ) తో మా ఊ రికి బలే సంబంధం . అందుకే పెరుమాళ్ళ పల్లె అన్న పేరు వచ్చింది. వందల ఏళ్ల నుంచి ఈ బంధం కొనసాగుతోంది. మా ఊరినుంచే పాలు, పెరుగు, కూరగాయలు కొండ పైకి ఈ దారి లోనే తీసుకు వెళుతుంటారు. మధ్యలో చిన్న చిన్న రాతి కూసాలు నాటి వాటిపైన ఒక బండ పరిచారు, బరువులు ఎత్తుకుని వెళ్లే వాళ్లు మధ్యలో వాటిని దింపుకుని సేద దీర డానికి. కొండపైన పని చేసే వాళ్ళలో ఎక్కువ మంది మాపెరుమాళ్ళ పల్లె వాళ్లే . పొద్దున్నే ఈ దారిలో కొండ ఎక్కి, డ్యూటీ అయిపోయాక సాయంత్రం ఈ దారిలోనే దిగి వస్తారు.’ అన్నాడు శంకర్ రెడ్డి.

‘ మా చిన్నాయన వెంకట రెడ్డి కొండ పైన క్యూ ఇన్స్పెక్టర్. మిగతా అంతా వాహన బేరర్ల వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.’ అని చెప్పాడు.
‘ వాహన బేరర్ లు అంటే ? ‘ అని ప్రశ్నించాను.
‘ శ్రీ వారి వాహనాలు మోసే వాళ్ళు. ఆ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసునా!? మూట బియ్యం ఒక్క సారిగా ఎత్తాలి. మా ఊరులో వాహన బేరర్ లు చాలా మంది ఉన్నారులే ‘ అని వివరించాడు.
మొదటి మండపం వచ్చింది. కాసేపు కూర్చుని మళ్లీ నడక మొదలు పెట్టాం. ఒక్కొక్క మలుపు దగ్గర కమ్మేసిన దట్టమైన చెట్లతో ఒక్కో అందం సంతరించుకుంది.
చుట్టూ దట్టమైన అడవి. మధ్యలో నడక దారి. అస్తమించక ముందే ఇక్కడ సూర్యుడు చెట్ల మాటుకు వెళ్ళి పోయాడు. పక్షులు గూళ్లకు చేరే సమయం. కిల కిల రావాలు మొదలయ్యాయి.
పాలు, పెరుగు, కూరగాయలు అమ్మడానికి వెళ్ళిన వాళ్ళు, డ్యూటీ పూర్తి అయిన టీటీడీ ఉద్యోగులు ఒకరొకరు కొండ దిగుతున్నారు. వాళ్ళు దిగడమే కాదు, మంగలి శెట్టి ఎక్కడం కూడా తమాషాగా ఉంది. నిటారుగా కాకుండా, మెలికలు మెలికలు గా దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఎందుకిలా అని అడిగాను.
‘ నేరుగా ఎక్కి నా, నేరుగా దిగినా మోకాళ్ళ పైన ఎక్కువ బరువు పడి నొప్పి పుడతాయి. తొందరగా అరుగుతాయి. తొం దరగా అలిసి పోతాం. మెలికలు గా ఎక్కితే తేలిగ్గా ఉంటుంది ‘ ఎంతో అనుభవం ఉన్న ఎముకల డాక్టర్ లాగా మంగలి శెట్టి ఒక మంచి మాట చెప్పాడు.
ఆ తరువాత ఎక్కడ మెట్లు ఎక్కినా ఆ మెలికలనే అనుసరించాను. కాసేపటికి రెండవ మండపం కూడా వచ్చింది. ఇక్కడికి తేలిగ్గా రాగలిగాం.
‘ ఇప్పటి కి సగం దూరం వచ్చినాము ‘ అన్నాడు సుబ్రమణ్యం.
అదొక పెద్ద మలుపు. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఒక రాతి పై దేవుడి పాదాలు చెక్కి ఉన్నాయి. అక్కడ వరకు నడక సాఫీగానే సాగింది. అక్కడి నుంచి మెట్లు బాగా వేశారు, కానీ కాస్త నిటారుగా ఉన్నాయి.
మరి కాస్త పైకి ఎక్కి వెనుతిరిగి చూసాం. మహాద్భుతమైన దృశ్యం.
శ్రీవారి మెట్టు దారిలో సగం దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే నడిచి వచ్చిన దారి
చాలా దూరంగా ఉన్న శ్రీనివాస మంగాపురం గాలి గోపురం చిన్నగా కనిపిస్తోంది. అక్కడి నుంచి భూదేవి తలపైన తీసిన పాపిడి లాగా మేం నడిచి వచ్చిన దారి. ఇరువైపులా కొండలపైన దట్టంగా అలుముకున్న పచ్చని చెట్లు. పైకి ఎక్కిన కొద్ది ప్రకృతి కనువిందు చేస్తోంది. ఈ శ్రీవారి మెట్టు దారి అంతా రెండున్నర కిలోమీటర్లే. కొండ మెట్లలో ఎన్ని మలుపులో! మధ్యలో మరొక బండ పైన దేవుడి రూపాలు చెక్కి ఉన్నాయి. ఆ బండ పైకి ఎక్కి చూస్తే… రివ్వున వీస్తున్న చల్లని గాలి, ఒక మనోహర దృశ్యం. ఆ కొండగాలి కి చెమట పట్టిన శరీరం చల్లబడి పోయింది.

ఇవి కూడా చదవండి
*స్నేహ గవాక్షం పెరుమాళ్ళపల్లె (తిరుపతి జ్ఞాపకాలు-2)
*వనపర్తితో ప్రారంభం (తిరుపతి జ్ఞాపకాలు-1)

మరి కాస్త దూరం నడిచే సరికి తిరుమల దరిదాపులకు  వచ్చేస్తున్నాం. ‘
‘ ఇక్కడి నుంచి మరొక వంద మెట్లే ‘ అన్నాడు మంగలి శెట్టి.
అక్కడి వరకు రాతి మెట్లు కాగా, ఆ వంద మెట్లకు సిమెంట్ చేశారు.
‘ సిమెంటు ఎందుకు చేశారో తెలుసా ‘ అన్నాడు.
ఎందుకు చేశారో చెప్పమన్నా.
“శ్రీ కృష్ణ దేవరాయలు తెనాలి రామలింగడి తో కలిసి ఈ మెట్ల దారిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. కింద నుంచి పైకి ఎక్కే లోపు నన్ను నవ్వించాలి. నన్ను నవ్వించక పోతే నీ కు శిక్ష విధిస్తా అన్నాడంట. పాపం, ఎన్ని జోకులు వేసినా శ్రీకృష్ణ దేవరాయలు నవ్వ కుండా మూతి మూసుకు కూర్చున్నాడంట. రామలింగడి కి ఏం చేయాలో తోచ లేదు. మెట్లు ఎక్కిన కొద్దీ బీపీ పెరగతా ఉందంట. ఇంక వంద మెట్లే ఉన్నాయి.’ మహా రాజా నవ్వక పోయావనుకో అంటూ ……ఒక కుళ్ళు జోక్ చెప్పి నాడంట. కృష్ణ దేవరాయలు నవ్వక తప్పలే. నవ్వే సి నాడు,” అంటూ ఆ సమయంలో తానక్క డే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షిలాగా చెప్పేసాడు.
మేం కూడా నవ్వకుండా ఉండలేక పోయాం. పామరులలో ఇలాటి కల్పిత గాథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. కేవలం నవ్వు కోడానికి తప్ప వీటికి ఎలాంటి ప్రామాణికత కానీ, ప్రాధాన్యత కానీ లేదు.
కొండ కొసకు చేరాం. ఎదురుగా పురాతనమైన రాతి మండపం. ఎంతో అందంగా చెక్కారు ! దాన్ని ఎన్ని శతాబ్దాల క్రితం నిర్మించారో ! కాసేపు ఆ మండపంలో కూర్చుని సేద దీరాము.
చీకటికి చోటివ్వ డానికి వెలుతురు నిదానంగా వెళ్ళి పోతోంది. మంగలి శెట్టి తన సన్నాయి పలుకుబడితో ఉచిత సత్రంలో గదులు తీసుకుని దర్శనానికి బయలు దేరాం.
మహ ద్వారం నుంచి మంగలి శెట్టి మమ్మల్ని గుడి లోపలికి తీసుకెళ్ళాడు. వీఐ పీ లకు తప్ప మహ ద్వార ప్రవేశం సామాన్యులకు సాధ్యం కాదు. ఇప్పుడైతే పీఠాధి పతులు, ముఖ్య మంత్రి, ప్రధాని, రాష్ట్రపతి, టీ టీ డీ చైర్మన్, మాజీ చైర్మన్, ఈ వో వంటి కొద్ది మంది వీ వీ ఐ పీ లకు మాత్రమే మహ ద్వార ప్రవేశం . ఆ రోజుల్లో కొండ పైన పలుకు బడికి పెరుమాళ్ళ పల్లా మజాకా! పన్నెండు మందిమి మహద్వారం గుండా వెళుతుంటే కొందరు క్యూ నిర్వాహకులు అనుమానంగా, ఆశ్చర్యంగా చూశారు ‘ అంతా మనోళ్లే ‘ అన్నాడు మంగలి శెట్టి.
ఎవరూ అభ్యంతరం చెప్ప లేదు. నేరుగా దర్శనం చేసుకుని వచ్చేసాం.
దర్శనం చేసుకుని బైటికి వచ్చామో లేదో మాడ వీధుల్లో ఉత్సవ మూర్తుల ఊ రేగింపు జరుగుతోంది. పెద్ద వాహనం పైన దేవుడిని కూర్చో బెట్టి వాహన బోయీలు మోసుకు వెళుతున్నారు.
వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అయినా లావాటి పల్లకీ కొయ్యలను భుజం పైన మొయ్యలేక మొయ్యలేక మోస్తున్నారు.
వాహనం పైన ఉత్సవ విగ్రహాలతో పాటు ఇద్దరు పూజారులు కూడా నిలుచుని ఉన్నారు. తెల్లగా నిగనిగ లాడు తూ, జపాన్ లో మల్ల యుద్ధ వీరులు సుమోల లాగా ఉన్నారు. ఇది నన్నెప్పుడూ వెంటాడే దృశ్యం.
దశాబ్దాలు గడిచినా శ్రీవారి వాహన సేవ లు చూసినప్పుడల్లా నన్ను బాధించే దృశ్యం. వారి విశ్వాసాలు ఏమై నా కావచ్చు. ఇలాంటి లావాటి మనుషులను మోయలేక మోయలేక మో యాల్సి రావడం ఏ మిటి !? ఇదేం పద్ధతి. ఇదేం ఆచారం. ఆ ఇద్దరు పూజారులు వాహనం ముందు నడిచి రావచ్చు కదా! అలా చేస్తే కనీసం రెండు క్వింటాళ్ల బరువు తగ్గేది కదా!?

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)