Home Features జగన్ కు కోర్టులో ఎదురు దెబ్బలెందుకు తగుల్తున్నాయ్ ?: విశ్లేషణ

జగన్ కు కోర్టులో ఎదురు దెబ్బలెందుకు తగుల్తున్నాయ్ ?: విశ్లేషణ

647
0
(వి.శంకరయ్య)
ఒక్కో సారి అనిపిస్తోంటుంది, ఈ దేశంలో కోర్టులే
లేకుంటే పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను నేల పాలు చేసే వారని.
రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సర్వోన్నత న్యాయ స్థానం కల్పించుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. గత ఆరేడేడు ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి కోర్టులు ఊపిరి పోసిన సందర్భాలు అనేకం. కుక్క మూతి పిందెలు లాంటి పాలకులు అధికారంలోని కొస్తే వచ్చే ప్రమాదం గమనం లోనికి తీసుకున్న రాజ్యాంగ నిర్మాతలు ఎవరి బాధ్యతలు ఏమీటో రాజ్యాంగంలో స్పష్టంగా పొందు పర్చారు.
కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఏ పార్టీ కైనా ప్రజలు తిరుగు లేని విధంగా మెజారిటీ ఇచ్చినా వారు రాజ్యాంగ నిబంధనలకు లోబడి వ్యవహరించక తప్పదు. ఉదాహరణకు నక్సలైట్లు ఈ రాజ్యాంగం బూటకమని అడవుల బాట పట్టారు. కాని స్వాతంత్య్ర వచ్చినప్పటి నుండి కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కొందరు ఏవేవో కుంటి సాకులతో రాజ్యాంగ విలువలను మంట గల్పుతున్నారు.అట్టి వారికి కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి.
అయినా భారత దేశంలో న్యాయ వ్యవస్థ మలినం కాకుండా తన విధి నిర్వర్తించుతున్నది కాబట్టి సరిపోయింది.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఈ రోజు శుక్రవారం ఒక్క రోజే రాష్ట్ర హైకోర్టు కీలక మైన మూడు తీర్పులు ఇచ్చింది. అందులో రెండు కేసులు సూమోటోగా తీసుకున్నా అందులో ఒకటి కోర్టు ధిక్కరణ కేసు. మూడు కేసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుండటమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినవి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే రోజు మూడు తీర్పులు రావడం గమనార్హం.

Like this article, please share it to a friend!

ఈ అవాంఛనీయ పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లోపు ముందో పునరాలోచించుకోవలసిన అవసరముంది. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఎదుర్కొనని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎందుకు సంభవించుతుందో రాష్ట్ర ప్రభుత్వాధినేతలు రాజ్యాంగ నిపుణులతో సంప్రతించడం ఆత్యవసరం. తమలో ఎక్కడనైనా లోప ముంటే సరి చేసుకోవడం మంచిది.
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు అద్దే అంశంపై హైకోర్టు తీర్పు చెప్పింది. తుదకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కినా అదే తీర్పు వచ్చింది. తిరిగి జీవో జారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని వుంటే ఈ రోజు హైకోర్టు- కోర్టు ధిక్కరణ కేసు అదీ సూమోటోగా నమోదు చేసేది కాదు. రంగులు అద్దే అంశం రాజకీయ పరమైనదైనా రేపు అధికారులు కోర్టు ముందు నిలబడవలసి వస్తోంది.
రాష్ట్రం మొత్తం మీద సంచలనం సృష్టించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి హైకోర్టు అప్పగించడం రాష్ట్ర పోలీసు ప్రతిష్టకు దెబ్బ తగిలే విధంగా వుంది. రాష్ట్ర పోలీసులు సమర్పించిన రిపోర్టుకు మేజిస్ట్రేట్ నమోదు చేసిన రిపోర్టుకు తేడా వుందని ప్రభుత్వం రిపోర్టు నమ్మదగినదిగా లేదని హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మైనవి. ఫలితంగా విశాఖ పోలీసులు మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించి మొత్తం వ్యవహారం సిబిఐకి హైకోర్టు అప్పగించింది.
ఎందుకో ఏమో గాని ఇటీవల కాలంలో రాష్ట్రంలో పోలీసులు టార్గెట్ అవుతున్నారు. మరీ విశాఖ పోలీసుల పరిస్థితి దిగ జారింది. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సరిగా వ్యవహరించ లేదని హైకోర్టు చెబితే డిజిపి అంగీకరించ వలసి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంశంలో ఇదే పరిస్థితి ఎదురౌతోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయ రంగు పులుము కున్న ఎబి వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ఈ రోజు హైకోర్టు కొట్టి వేసింది.వెంటనే విధుల్లో చేర్చుకోవాలని పైగా సస్పెన్షన్ కాలంలో జీత భత్యాలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. పైగా గతంలో క్యాట్ ఇచ్చిన ఆర్థర్ ను కూడా పక్కన బెట్టింది.
ప్రభుత్వం కార్యాలయలకు రంగుల అద్దే కేసు ఒక మారు సుప్రీంకోర్టు వరకు వెళ్లి వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం చేయగలగిందేమీ వుండదు. మిగిలిన రెండు కేసుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అసలు సమస్య అదికాదు. ప్రభుత్వం గైకొంటున్న ప్రతి విధాన సంబంధమైన అంశం కోర్టుల్లో నలుగు తోంది. ఇలా ఎంత కాలం నెట్టుకొస్తారు. ప్రభుత్వం వేపు నుండి కూడా తమలో ఎక్కడైనా లోప ముందో తరచి చూడ వలసి వుంది
పులి మీద పుట్ర లాగా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ప్రకటించితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక అటుంచి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ట్రిబ్యునల్ లేవ నెత్తిన అంశాలు రాజకీయ పరిపాలనా పరమైనవి కావు. సాంకేతిక పరమైనవి. ఇవి ఇబ్బంది కరమెనవే.
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
(విశాలాంధ్ర సౌజన్యంతో)