మద్రాసు టినగర్ వెనక ఉన్నతెలుగు వ్యక్తి , నాటి రాజకీయాల్లో ప్రధాన శక్తి

దేశం సోషల్ జస్టిస్ రాజకీయాలను బాగా పరిశీలిస్తున్నవాళ్లందరికి ఈ బుర్రమీసాల పెద్దాయన బొమ్మ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే, మద్రాసు రాజకీయాలను సోషల్ జస్టిస్ మళ్లించిన శక్తి ఆయన. మద్రాసు ప్రెశిడెన్సీ రాజకీయ చరిత్రలో ఆయన అధ్యాయం చాలా కీలకమయింది.
మద్రాసుపట్టణానికి (ఇపుడు చెన్నై) గుండెకాయ టి.నగర్. మద్రాసు కెళ్లిన వాళ్లకు టి.నగర్ కు వెళ్లకుంటే పని జరగదు. ఇక మద్రాసులో ఉన్నవాళ్లు వారానికో, నెలకో టినగర్ కు వెళ్లకుండా ఉండలేరు.  టి.నగర్ గొప్ప చిల్లర వ్యాపార కేంద్రం. ఇపుడు మాల్స్ సంస్కృ తివచ్చి రిటైల్ వ్యాపారం పెరిగినా టి నగర్ ప్రాముఖ్యం తగ్గలేదు. పైన ఉన్న బుర్రమీసాల పెద్దాయన ఫోటో  టి.నగర్ కు తెలుగు వాళ్లకు మద్రాసుతో ఉన్న అనుబంధం గుర్తు చేస్తుంది.
మద్రాసులో మూలమూలలా తెలుగు హిస్టరీ కనిపిస్తుంది. ఇపుడు క్రమంగా ఇది తెరమరుగవుతూ ఉంది.  నాటి తెలుగు వాళ్ల ఆనవాళ్లు ఒకటొకటే మాయమవుతున్నాయి. టి.నగర్ ఒక పెద్ద బిజినెస్ ఏరియా కాబట్టి దాన్నిచెరిపేయడ అంతసులభం కాదు.
ఇంతకీ టి.నగర్ కు తెలుగు వాళ్లకు ఉన్న అనుబంధం ఏమిటి?
నిజానికి టి.నగర్ అని అందరినోటా వినిపించినా ఇందులో  ఉన్న అక్షరం ‘టి’  అంటే ఏమిటో చాలా మందికి తెలియదు.  టి అంటే త్యాగరాయ .  టి.నగర్ అంటే పూర్తి త్యాగరాయ చెట్టి నగర్ .దీనిని టి. నగర్ గా కుదించేశారు. పిట్టి త్యాగరాయచెట్టి అనే ఒక చేనేత కార్మికుడు, చేనేత వస్త్రాల వ్యాపారి, ఇండస్ట్రియలిస్టు, నాటి బ్రాహ్మణాధిక్య వ్యతిరేక రాజకీయ నాయకుడు. ఆయన జ్ఞాపకార్థం ఈ కాలనీ అభివృద్ధి చేస్తున్నపుడు పానగల్ రాజా నాయకత్వంలోని జస్టిస్ పార్టీ ఈ కొత్త కాలనీకి ‘త్యాగరాయచెట్టి నగర్’ అని పేరు పెట్టారు.
 ఎవరీ పిట్టి త్యాగరాయ చెట్టి?
 త్యాగరాయచెట్టి తెలుగు దేవాంగ చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన  కుటుంబ సభ్యులు మొదట్లో మగ్గాలు నేస్తూ బతికారు. తర్వాత  వారు చర్మాల వ్యాపారంతో పాటు అనేక చిల్లర మల్లర వ్యాపారాలు చేసి విజయవంతమయ్యారు.
 ఇలా ఆంధ్రప్రాంతం నుంచి ఎపుడో వలస వెళ్లిన చేనేత కుటుంబంలో  త్యాగరాయ చెట్టి 1885లో జన్మించాడు.  మద్రాసుయూనివర్శిటీ నుంచి  1976లో బిఎ పూర్తి చేశారు.  ఆ యూనివర్శిటీ నుంచి డిగ్రీ అందుకున్న తొలితరం కుర్రవాళ్లలో ఆయన ఒకరు. చదువు తర్వాత ఆయన కుటుంబ వ్యాపారంలోకి దిగారు. టెక్స్ టైల్స్, చర్మ వ్యాపారం ప్రధానంగా ఏర్పాటుచేశారు. ఈ రెండింటిలో విజయవంతయ్యారు. ఆయన విపరీతంగా దాతృత్వ కార్యకలాపాలుచేప్టటారు రాజకీయాల్లో లేనపుడు పేదవాళ్లకు  మద్రాసు వాషర్ మెన్ పేటలో పాఠశాల ఏర్పాటుచేశారు. ఇక్కడ ఉచితంగా విద్య అందించడమేకాదు, హాస్టలు వసతి ఏర్పాటు చేసి బోజనం కూడా పెట్టేవారు.మద్రాసులో ఇదే మొదటి ప్రయివేటు బోర్డింగ్ స్కూలు (1897). తర్వాత ఇదే స్కూలు (North Madras Hindu Secondary School) సర్ త్యాగయరాయ కాలేజ్ (1950) అయింది. ఆయన రాజకీయాల్లో ప్రవేశించి పదవిలోకి వచ్చాక మద్రాసుప్రెశిడెన్సీలో మొట్టమొదటి సారిగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు.
బ్రిటిష్ కాలంల్ మద్రాసు రాజకీయాల గురించి మాట్లాడుకున్నపుడు త్యాగరాయ చెట్టి పేరు లేకుండా మాట్లాడుకోలేం. మద్రాసు రాజకీయాలను ఆయన అంతగా ప్రభావితం చేశారు.  ఇక్కడ ఇంకోమాట చెప్పుకోవాలి. ఆమాటకొస్తే తెలుగు వాళ్ల  ప్రమేయం లేకుండా మద్రాసు రాజకీయాలు లేవు. ద్రవిడ రాజకీయాలకు బాట వేసినవారిలో తెలుగు వాళ్లే ప్రధానమయిన వాళ్లు.
అపుడు ఇపుడు ఎపుడూ కూడా రాజకీయాలంటే ఏమిటి?  డామినేషన్ లేదా పెత్తనం. ఆ రోజు రాజకీయాల్లో బ్రాహ్మణుల డామినేషేన్ (బ్రాహ్మణాధిక్యం) ఎక్కువయింది. వీళ్లు అధికారంలో ఉన్నంత బ్రాహ్మణేతరలకు ప్రభుత్వం లో చోటు దక్కదని భావించి ఆయన చట్ట సభల్లో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కావాలని వాదించారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చారు. అంతేకాదు, ఆ తాత్విక భావజాలంతోనే రాజకీయాల్లో పాల్గొన్నారు.
ఇలా రోజు తమిళ  విశిష్ట  రాజకీయాలకు, సోషల్ జస్టిస్ రాజకీయాలకు  పునాది వేసిన వ్యక్తుల్లో ఆధ్యుడు పిట్టి త్యాగరాయ చెట్టి.
 త్యాగరాయ చెట్టికి  మద్రాసు నగర పాలనలో పాలు పంచుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే ముఖ్యమంత్రి పదవిని కూడా తిరస్కరించారు. ఆయన సోషల్ జస్టిస్ రాజకీయాలవైపు మళ్లేందుకు ఎన్నికల్లో పరాజయమే కారణం.
 1916 లో మద్రాసు లోకల్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆ రోజు నగర రాజకీయాల్లో  త్యాగరాయచెట్టి ఒక ప్రముఖుడు. బాగా పేరున్న వైద్యడు టిఎమ్ నాయర్ ఆయన మొదటి ప్రత్యర్థి . మరొక ప్రత్యర్థి పానగల్ రాజా. ఈ ఎన్నికల్లో చెట్టి ఓడిపోయారు. అంతేకాదు, ఆయన ప్రత్యర్థి నాయర్ కూడా  ఓడిపోయారు. పానగల్ రాజా కూడా ఓడిపోయారు.
మరి గెలిచిందెవరు?
వీళ్లందరిని ఓడించింది బ్రాహ్మణ అభ్యర్థులు. ఇందులో ఏదో ‘రాజకీయం’ ఉందని త్యాగరాయచెట్టి అనుమానించారు. అదే అనుమానం  నాయర్ కు కూడా వచ్చింది.  బ్రాహ్మణేతరులు విడివిడిగా ఉంటే రాజకీయాలని డామినేట్ చేస్తున్న బ్రాహ్మణులను ఎదిరించలేరని కొంతమంది వీళ్లిద్దరిని కలిపేందుకు ప్రయత్నం చేశారు. దీనితో ప్రత్యర్థులిద్దరు ఏకమయ్యారు. వీరితో నటేష ముదలియార్ అనే నాయకుడు కూడ తోడయ్యారు. అట్టడుగు వర్గాలకు ఉచిత విద్య అందించడం వాళ్ల ప్రధాన కార్యక్రమం అయింది. చెట్టి లాగే ముదలియార్ కూడా ద్రవిడియన్ హోం పేరుతో ఒక హాస్టల్ నడిపారు.
వాళ్ల ఇద్దరి కలయిక  మద్రాసు ప్రెశిడెన్సీ రాజకీయాలను కొత్త మలుపుతిప్పింది. ఇప్పటికి తమిళనాడు రాజకీయాలు త్యాగరాయ చెట్టి, నాయర్ లు వేసిన పునాది మీద నిలబడే ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో బ్రాహ్మణేతరులకు భాగస్వామ్యం ఉండాలన్న అవసరాన్ని గుర్తించిన రాజకీయాలే వీళ్ల రాజకీయాలు.
చెట్టి, నాయర్ లు ఇద్దరు కలసి బ్రాహ్మణేతరులతో  సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ (South Indian Liberal Federation)ను ఏర్పాటు చేశారు. ఇదే ఒక జాయింట్ స్టాక్ కంపెనీ కూడా అయింది.  ఒక్కొక్క షేర్  వందరుపాయల ధరతో 640 షేర్లు విడుదల చేశారు. ఈడబ్బుతో ఒక ప్రింటింగ్ ప్రెస్ కొన్నారు. జస్టిస్ (Justice) అనే న్యూస్ పేపర్ ప్రారంభించారు. దీనితో పాటు తమిళంలో ద్రవిడియన్ , తెలుగు లో ఆంధ్ర ప్రకాశిని అనే పత్రికలు ప్రచురించారు. తర్వాత వాళ్లు ఏర్పాటు చేసిన  పార్టీయే జస్టిస్ పార్టీ (Justice Party) (నవంబర్ 20,1916). జస్టిస్ పత్రికకు నాయర్ మొదటి సంపాదకుడయితే, సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ కు చెట్టి అధ్యక్షుడయ్యారు. 1925లో చనిపోయే దాకా ఆయనే ఈ పదవిలో కొనసాగారు.
మద్రాసు లోని త్యాగరాయ చెట్టి నివాసమే ఈ సంస్థ నాయకుల మీటింగ్ హాల్.  1916లోనే  చెట్టి, తన మిత్రులతో కలసి The Non Brahmin Manifesto విడుదల చేశారు. కాంగ్రెస్ రాజకీయాలలో బ్రాహణ పెత్తనం కొనసాగుతున్నందున, ఆ పార్టీలో తమకు న్యాయం జరగదని భావించి చెట్టి అండ్ కో బ్రిటిష్ ప్రభుత్వ అనుకూల విధానం అవలంభించినా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం బ్రాహ్మాణాధిపత్యంలో ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
త్యాగరాయ చెట్టి మద్రాసు నివాసం Picture Credits: The Hindu
అందుకే ప్రాంతీయ అసెంబ్లీలలో కులాలవారిగా బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. మాంటెగు కమిషన్ కు వినతిపత్రాలు సమర్పించారు. ఇది  నాటి మద్రాసు  రాజకీయాలలో చాలా స్పష్టమయిన బ్రాహిణ్, నాన్ బ్రాహ్మిణ్ పోలరైజేషన్ కు దారి తీసింది.
దీనితో కాంగ్రెస్ పార్టీ లోని బ్రాహ్మణేతరులు అప్రమత్తమయ్యారు.   పెరియార్ ఇవి రామసామి, తిరువారూర్ వృత్తాచల కల్యాణ సుందరం తదితరులు మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ ప్రారంభించారు. అయితే, ఒరిజినల్ బ్రాహ్మణేతరుల ఐక్యతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ లోని బ్రాహ్మణులు ఏర్పాటేచేసిన సంస్థ అని త్యాగరాయచెట్టి తదితరులు ఈ సంస్థను  అనుమానించారు.
జస్టిస్ పార్టీ వారి  బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక రాజకీయాలు మరొక 1920లో చరిత్ర సృష్టించాయి.
మద్రాస్ ప్రెశిడెన్సీకి  జరిగిన ఎన్నికల్లో  కౌన్సిల్ లోని 98 స్థానాల్లో జస్టిస్ పార్టీకి 63 స్థానాలు వచ్చాయి.  ఫస్టు మనిస్టర్ (First Minister) గా బాధ్యతలు స్వీకరించి, ప్రభుత్వం ఏర్పాటుచేయాలని  మద్రాసు గవర్నర్  త్యాగరాయ చెట్టిని ఆహ్వానించారు. అయితే, చెట్టి తిరస్కరించారు.ముఖ్యమంత్రి అనే పదవి అపుడు లేదు. దీనిని ఫస్ట్ మినిస్టర్ అనే వాళ్లు. గాంధీజీ ధోరణిని కూడా ఆయన వ్యతిరేకించారు.
చెన్నై రిప్పన్ బిల్డింగుల్ సర్ త్యాగరాయ చెట్టి విగ్రహం
చెట్టి మద్రాసు నగర రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చారు. మద్రాసు కార్పొరేషన్ అధ్యకుడి(1919-1923) గా అభివృద్ధి మీదే ఆయన దృష్టి నిలిపారు. మద్రాసును మహానగరంగా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దారు.
1921లో  ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (Prince Of Wales) మద్రాసు పర్యటన  జరిగింది.కాంగ్రెస్ దీనిని బహిష్కరించింది. గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపు నిచ్చారు. అయినా సరే, త్యాగరాయచెట్టి కార్పొరేషన్ చెయిర్మన్ గా స్వాగతోపన్యాసం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిమీద పడి బీభత్సం సృష్టించారు. ఇంటినుంచి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. 1921 లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్ హుడ్ బహూకరించింది. అప్పటినుంచి ఆయన సర్ అయాయారు. 1909లోనే  రావు బహదూర్  గుర్తింపు వచ్చింది.

ఆయన మద్రాసు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నపుడు మొదటిసారి పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారు. మొదటి భోజనం థౌజండ్ లైట్స్ ఏరియాలోని స్కూలులో   ప్రారంభించారు. మద్రాసు ప్రెశిడెన్సీలో మొదటి మధ్యాహ్న భోజనపథకం ఇదే. ఆరోజుల్లో కూడా ఇది బెస్ట్ అని పేరొచ్చింది. మధ్యాహ్నభోజన పథకం  సోషల్ జస్టిస్ ఉధ్యమంలో భాగంగా వచ్చింది. దానిని సర్వాజనీనం చేసేందుకు వందేళ్లు పట్టింది.
1925 ఏప్రిల్ 28న త్యాగరాయ చెట్టి చనిపోయారు.
ఆయన మరణం తర్వాత,  మద్రాసు పట్టణంలో ఒక కొత్తకాలనీ నిర్మాణం మొదలుపెట్టింది. త్యాగరాయచెట్టి సేవలకు గుర్తింపుగా ఆ కాలనీకి త్యాయరాయచెట్టి నగర్ అని జస్టిస్ ప్రార్టీ ప్రభుత్వం నామకరణం చేసింది.
బ్రాహ్మణేతరులే అయినా,రాజాలు, జిమిందాలు ఎక్కువగా ఉన్న జస్టిస్ పార్టీ క్రమంగా ప్రాముఖ్యం కోల్పోయింది. ఈ ఖా
ళీని పెరియార్ నాయకత్వంలోని ద్రవిడ కళగం (DK)నింపింది, సాంఘిక న్యాయం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది.