Home Features ఇండియాలో మాంసాహారంలో తెలంగాణ నెంబర్ 1

ఇండియాలో మాంసాహారంలో తెలంగాణ నెంబర్ 1

111
0
(టిటిఎన్ డెస్క్)
భారతదేశమంటే శాకాహారదేశమనే భ్రమ చాలా మందిలో ఉంది. ఈ మధ్య యోగ, ఆయుర్వేదం, ప్రజల్లో పెరిగిపోతున్న భక్త్యా వేశం, ప్రకృతి వైద్యాల ప్రాచుర్యం చూస్తే అలా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. భారతదేశంలో ఎవో కొన్ని ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాలు తప్ప మాంసాహారులే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పుకుంటే భారతదేశం మాంసాహార దేశమనాల్సివస్తుంది.
కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జరిపిన సర్వేలలో వెల్లడయిన నేషనల్ హెల్త్ డేటా ప్రకారం 80 శాతం పురుషులు, 70 శాతం మంది మహిళలు భారతదేశంలో మాంసాహారులే.
రాష్ట్రాల వారీగా ఈ వ్యత్యాసాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.  బిజినెస్ టుడే లో వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ఉత్తరాది కంటే, దక్షిణ భారత, ఈశాన్య రాష్ట్రాలో మాంసాహారం మెండు. వీళ్లంతాపూటపూటకు మాంసాహారమే తీసుకుంటారని దీనర్థంకాదు. వీళ్లు పప్పుదినుసులు, కూరగాయలు, పాలపదార్థాలు కూడా తీసకుంటూంటారు. అయితే వీరంతా మాంసాహారాన్ని ఇష్టపడతారు. తరచు తింటూంటారు.
ఒక వారంలో తీసుకునే మాంసాహారం గురించి మాట్లాడుకుంటే కేరళ మహిళలు అత్యధికంగా మాంసాహారం తీసుకుంటారు. ఇక్కడి మహిళల్లో 98 శాతం మంది మాంసాహారులే. తర్వాతి స్థానం 85.7 శాతంతో గోవాది. అస్సాం మహిళల్లో మాంసాహారులు 80.4 శాతం. ఇక పురుషులకు సంబంధించి త్రిపురలో 94.8 శాతం మంది మాంసాహారులు. కేరళలో వీరి సంఖ్య 90.1 శాతం, గోవాలో 88 శాతం.
పురుషుల్లో మాంసాహారపు అలవాటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు పంజాబ్ (10 శాతం), రాజస్తాన్ (10.2 శాతం), హర్యానా (13 శాతం). ఇక మహిళల విషయానికొస్తే మాంసాహారం  పెద్దగా అలవాటు లేని రాష్ట్రాలు పంజాబ్ (4శాతం), హర్యానా (7.8 శాతం), రాజస్థాన్ (6 శాతం) లే.
ఈ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళలకంటే పురుషుల్లోనే మాంసాహారులెక్కువగా ఉన్నారు. పురుషుల్లో కూడా అవివాహితుల్లో మాంసాహారులెక్కువగా ఉన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణ ప్రాంతాలలో మాంసాహారం ఎక్కువ.
తెలంగాణ నెంబర్ 1
మరొక ఆసక్తి కరమయిన రిపోర్టు టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చింది. దేశంలో మాంసాహారులు ఎక్కువగా ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ 99 శాతం మంది మాంసాహారులు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే దీనిని వెల్లడించిందని టైమ్స్ పేర్కొంది. ఈ సర్వేలో 15 సంవత్సరాలు ఆపైన వయసున్న వారి ఆహారపుటలవాట్లను పరిశీలించారు. తెలంగాణలో పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులున్నారు.
ఇతర రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒదిషా,కేరళలో మాంసాహారులెక్కువ. అయితే, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలు శాకాహారానికి సంబంధించి టాప్ రాష్ట్రాలు. ఇక్కడ మరొక ఆసక్తి కరమయిన విషయమేమిటంటే, భారత దేశంలో 2004-2014 మధ్య దేశంలో మాంసాహారపు అలవాటు 75 శాతం నుంచి 71 శాతానికి పడిపోయిందని టైమ్స్ పేర్కొంది.
భారతదేశం శాకాహారం దేశం కాదు…
భారత దేశంలో మాంసాహారం గురించి ఒక సమగ్రమయిన అధ్యయాన్ని బాలమురళి నటరాజన్ (Willian Paterson University, New Jersey), సూరజ్ జేకాబ్ (Political Economist, Vidya Bhawan, Udaipur)చేపట్టారు. వీళ్లు ఎన్ ఎస్ ఎస్ వొ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే , ఇండియన్ హ్యూమన్ డెవెలప్ మెంట్ సర్వే లే డేటా ఆధారంగా భారత దేశంలో ఆహారపుటలవాట్లను స్డడీ చేసి అనేక భ్రమలను పటాపంచలు చేశారు.
వీళ్ల అధ్యయన పత్రం ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది. వీరి స్టడీ ప్రకారం, భారతదేశంలో శాకాహారుల సంఖ్య 30 శాతం మంచిలేదు. ఇంకా కరెక్టుగా చెబితే 20 శాతానికి దగ్గరలో ఉంటుంది.
ఇక బీఫ్ తినడం అనేది ప్రచారం లో ఉన్న దానికంటే ఎక్కువగా ఉంది. కనీసం 7శాతం భారతీయులు బీఫ్ తింటారు. కరెక్టుగా లెక్కిస్తే వీళ్ల సంఖ్య 15 శాతం దాకా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలోని మెగా సిటీలలో , నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 19.83 శాతం మంది మాత్రమే శాకాహారులు. పెద్ద నగరాలలో శాకాహారాలు 29.05 శాతమే. చిన్న పట్టణాలలో26.86 శాతం. ఇంకా చిన్న పట్టణాలలో 18.11 శాతం. గ్రామీణ ప్రాంతాలలో శాకాహారులు 25.30 శాతం ఉన్నారు. ఎన్ ఎస్ ఎస్ ఒ (NSSO) ఎంపిక చేసుకున్న 17 పెద్ద రాష్ట్రాలలో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళలో శాకాహారులు అయిదు శాతంలోపే ఉండటం బాల్ మురళి,సూరజ్ గుర్తించారు. ఇక హర్యానా, రాజస్థాన్, పంజాబ్ లలో శాకాహారులు చాలా ఎక్కువ. వారు 75 శాతం పైబడేఉన్నారు. ఆరురాష్ట్రాలలో శాకాహారులు 20 శాతం లోపే ఉన్నారు.
మామూలుగా చెన్నై వెజిటేరియన్ భోజనానికి పేరని అంటుంటారు. బాల్ మురళీ, సూరజల్ అధ్యయనం ఇది తప్పని తెల్చింది. అలాగే పంజాబ్ చికెన్ టిక్కా, ఢిల్లీ కెబాబ్ లకు పేరని చెబుతుంటారు. ఈ అధ్యయనంల్ ఇవన్నీ తలకిందులయ్యాయి. చెన్నై ప్రధానంగా మాంసాహార నగరం. ఢిల్లీలో శాకాహారం ఎక్కువ. అదే విధంగా పంజాబ్ శాకాహార రాష్ట్రం.
మన నగరాలలో శాకాహార జనాభా ఇది…
ఇండోర్ – 49 శాతం
మీరట్ – 36 శాతం
ఢిల్లీ -30 శాతం
నాగపూర్ – 22 శాతం
ముంబై – 18 శాతం
హైదరాబాద్ – 11 శాతం
చెన్నై – 6 శాతం
కోల్ కతా -4 శాతం

 

(featured Picture source Wikimedia)