ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రూాలింగ్ వైసిపి చెవులకు ఇంపైన ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి రాజధాని గురించి చేసినచాలా ఆసక్తిరెకెత్తించే ప్రకటన చేయడం ఆశ్చర్యం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, అని ఆయన అన్నారు.
వీర్రాజు దారెటు?
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను నియమించగానే చాలా మంది ఆయన ఏ లైన్ తీసుకుంటారని చర్చించడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో చంద్రబాబు వ్యతిరేకవర్గంలో ఉన్నారు. దీనర్థం వైసిపితో పేచీలేని మనిషిఅనే అర్థం. చివరకు ఎన్ డి ఎతో చంద్రబాబు కు మంచి సంబంధాలున్నరోజుల్లో ఆయన తన ఢిల్లీ పలుకుబడి ఉపయోగించి ఈ షైటింగ్ బ్రిగేడ్ నోరు మూయించారని చెబుతారు. ఇందులో సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరిసాంబశివరావు, తర్వాత కన్నా లక్ష్మినారాయణ వుండేవారు. ఈ విషయాలను ఎవరూ మర్చిపోలేరు.
మొదట్లో కన్నాకూడా పచ్చి యాంటి చంద్రబాబే. బిజెపి అధ్యక్షుడయిన కొత్త లో ఆయన బిజెపి టిడిపిలతో సమానంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో బిజెపి పరాజయం తర్వాత, తెలుగుదేశం పరాజయం తర్వాత రాజకీయ వ్యూహం మార్చుకున్నారు. తనకసిని చంద్రబాబు మీది నుంచి ముఖ్యమంత్రి జగన్ మీదకు మళ్లించారు. దీనితో అంతా ఇక బిజెపి,జనసేన, తెలుగుదేాశాలు కలసి 2014 నాటిలా పొత్తు పెట్టుకుంటాయని అనుకున్నారు. దీనితో కన్నా మీద వైసిసి వాళ్ల పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. కన్నా లక్ష్మినారాయణ తెలుగుదేశం నుంచి డబ్బు తీసుకున్నారని కూడా వైసిపి వాళ్లు ఆరోపణ చేశారు. అది వేరే విషయం. మొత్తానికి కన్నా, చాలా గట్టిగా వైసిపితో, జగన్ నాయకత్వంతో తలపడ్డారు. ఈ విషయంలో ఆయన తెలుగుదేశం పోటీ పడ్డారు. ఇలా ఆయన బిజెపిని ఒక ప్రతిపక్ష పార్టీగా నడిపిస్తున్నపుడు ఆయనను అధ్యక్షపదవినుంచి తప్పించి సోము వీర్రాజును అధ్యక్షుని చేశారు. చేసిన రెండురోజులకే ఆయన నుంచి వైసిపికి వీనులవిందైన ప్రకటన వచ్చింది. నిజానికి గతంలోొ బిజెపి జాతీయ ప్రతినిధి, రాజ్యసభ్యుడు జివిఎల్ నరసింహారావు ఇలాంటి ప్రకటనలు చేసి రాష్ట్రనాయకత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చారు. తర్వాత ఆయన ఆంధ్ర రావడం తగ్గించారు. ఇపుడు ఆయన మాట సోమువీర్రాజు నోట వినిపించింది.
సోము వీర్రాజు ఏమన్నారంటే…
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారు.
ఆ రోజులో చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు., ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నాం. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటాము
గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ అన్న మాటలివి.
‘రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక మేము సీరియస్గా ఉండబోతున్నాం. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగం. అయితే ఈ ఆటలో మేము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తాం. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు మేము భావిస్తున్నాం,’ అని సోము వీర్రాజు అన్నారు.
దీని అర్థమేమిటో కాంగ్రెస్ చెప్పింది
సోము వీర్రాజును చూస్తే చదవక ముందు కాకరకాయ చదివిన తర్వాత కికరకాయ సామెత గుర్తుకు వస్తుందని అమరావతి మహిళా జేఏసీ & కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు.
పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సోము వీర్రాజు గతంలో ఏం మాట్లాడమో గుర్తు లేకుండా మాట్లాడుతున్నారని, సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకర్తల కంటే వైసీపీ నాయకులే ఎక్కువ సంతోషపడుతున్నారని ఆమె అన్నారు.
అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం. ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకోండి మేము సహకారం అందిస్తామని బీజేపీ నేతలు చెప్పలేదా? అని ఆమె ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…
‘చంద్రబాబు ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చారని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రజలు కారా? వారివి ప్రజా సమస్యలు కావా? అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన లేఖను సోము వీర్రాజు వెనక్కి తీసుకుంటారా? అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మరచిపోయారా ? మీ చేతితో ప్రాణం పోసుకున్న అమరావతిని ముఖ్యమంత్రి జగన్ చంపాలని చూస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ?, అని అన్నారు.
ఇపుడు సోము వీర్రాజు పాలనలో బిజెపి ఎలా ఉంటుందో వూహించేందుకు హింట్ దొరికిందా?