వాళ్ల అమ్మమ్మ చేతి వంటలు అద్భుతంగా ఉంటాయి. పక్కా ఒరిజినల్ వంటలు.ఆధెంటిక్ సౌత్ ఇండియన్. దానికితోడు ఇద్దరు అత్తలు. వీళ్లంతా కలిస్తే కిచెన్ ఘుమఘుమలాడుతుంది. వీళ్ల పాకనైపుణ్యాలతో ఎదైనా మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే ఆలస్యం. మరుసటి రోజు పొద్దునే కంపెనీ బాస్ దగ్గరికి వెళ్లి, ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పేశాడు…
బాస్ ఆశ్చర్య పోయాడు. మంచి ఉద్యోగం వదలుకుంటానంటాడేంటి వీడు, పిచ్చా అని కసురుకున్నాడు బాస్. అతను వినలేదు. తన ప్లాన్ చెప్పాడు, అయితే, ఇంకేం “ సాహసం చేయరా, డింభకా” అని భుజం తట్టాడు. అంతే, మైసూర్ నుంచి FoodBox అనే ఫుడ్ క్యారియర్ సర్వీస్ మొదలయింది… సూపర్ హిట్ స్టోరీ అది…
అది 2015. మురళీ గుండన్న వయసు కేవలం 23 సంవత్సరాలు. పెద్దగా డబ్బున్న కుటుంబం కాదు. ఉద్యోగం చాలా అవసరం. అక్కడి ఎన్ ఐ ఇ లో బిటెక్ చేసి అప్పటికి జెఎస్ డబ్ల్యు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇంక పర్లేదు జీవితం సాఫీగా సాగుతుంది. పెళ్లి పెటాకులు, భార్య ఉద్యోగం… ఇక చాలు ఈ జీవితానికి…. అని మురళీ అనుకోలేదు.
‘ఏందీ ఉద్యోగం, చక్కగా ఏదైనా వ్యాపారం చేస్తే పోలా?’ అనుకున్నాడు. ఆలోచించాడు. ఫుడ్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చాడు. ఆదారిలో వెళ్లాలనుకున్నాడు. రెండో ఆలోచన పెట్టుకోలే. ఉద్యోగం మానేయానుకున్నాడు. అప్పటికి ఉద్యోగంలో చేరి కేవలం ఏడాది మాత్రమే అయింది.
ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నపుడు మురళీ మొదట మాట్లాడిందెవరితో తెలుసా? వాళ్ల అమ్మమ్మఇందిరమ్మతో. తర్వాత ఇద్దర అత్తలు, ఉషా, సంధ్యలను కలుపుకున్నాడు. తన వ్యాపారం గురించి చర్చించాడు. వాళ్లు మొదట్లో ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి ఇదేం వ్యాపారం, పూటకూళ్ల వ్యాప్యారం అని వాళ్లు విస్తుబోయారు. మొత్తానికి మురళీ వాళ్లని తన దార్లోకి తెచ్చుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం పనిచేసేందుకు ఒప్పించాడు. వ్యాపారం మొదలయింది. రుచికరమయిన, ఆథెంటిక్, సౌత్ ఇండియన్, హోం మేడ్ వంటకాలను క్యారియర్ తో సప్లయ్ చేయడమే వ్యాపారం.
NIE లో ఇంజనీరింగ్ చదివిన కుర్రవాడు 2015 డిసెంబర్ 3 నుంచి క్యారియర్ భోజనం సప్లై మొదలుపెట్టాడు.
పులావ్, పులిహోర,ఖీర్, పళ్లు… వీటితో మొదలయింది. మొదట నలభై మంది స్నేహితుల జాబితా తయారుచేసుకున్నాడు. వాళ్లలో అవసరమయిన వాళ్లరి సప్లై చేయడం. ఈ క్యారియర్ లను అందించడానికి ఇద్దరు స్నేహితులు సాయం తీసుకున్నాడు.
వీళ్ల కష్టం చూసి, ఒక మామ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అలాపుట్టింది పుడ్ బాక్స్ (FOOD BOX). పది క్యారియర్లతో ఫుడ్ బాక్స్ ఫుడ్ క్యారియర్ సర్వీసు ప్రారంభమయింది.
ఇంట్లో ఉన్న చిన్న గరాజ్ లో కిచెన్ మొదలయింది. ఒక తెలిసిన తాతగారి దగ్గిరనుంచి రెండు స్టవ్ లను అద్దెకు తీసుకున్నారు. అమ్మమ్మ, అత్తలు వంట చేస్తున్నారు. స్నేహితులు మంజు, వినయ్, కజిన్ స్కంగ క్యారియర్ లు మోసుకెళ్తున్నారు.
మార్కెటింగ్ ఎలా చేశారు?
మార్కెటింగ్ సింపుల్ గా మొదలుపెట్టారు. మొదట స్నేహితులు జాబితా తయారు చేసుకున్నారు. వాళ్లద్వారా మరికొన్ని అడ్రసులు సంపాదించారు. ఇరుగు పొరుగు, తర్వాత, కాలేజీలో జూనియర్లు, సీనియర్లు … ఆపైన మైసూరులో ఉండే సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల ఇళ్లకి పోవడం, తలుపుతట్టడం, తమ వంటల ప్రాశస్త్యాన్ని చెప్పడమే మార్కెటింగ్ … పది టిఫిన్ బాక్స్ లనుంచి చూస్తుండగానే మురళి వ్యాపారం వారినికి రెండు వేల బాక్స్ లకుపెరిగింది. వంటలకు సర్వత్రా మంచిపేరొచ్చింది. గ్రాండ్ మదర్ వంటచేస్తూన్నదనే వాస్తవం మార్కెటింగ్ కు బాగా తోడయింది.
బిజినెస్ పెరగడంతో అత్త ఉష 18 సంత్సరాలుగా చేస్తున్న తన ఉద్యోగాన్ని వదిలేసి ఇందులోనే స్థిరపడిపోయింది. ఆమె ఇపుడు కంపెనీ ఆపరేషన్స్ ఇన్ చార్జ్.
ఇప్పటికీ మురళీ వ్యాపారం మొదలయి అయిదేళ్ల యింది. పుడ్ బాక్స్ కూడా పెరిగి పెద్దదయింది. ఇపుడు 27 మంది ఉద్యోగులు వంటవాళ్లు ఉన్నారు. మైసూరు నుంచి పుడ్ బాక్స్ కు 30 వేల మంది రిజిస్టర్స్ యూజర్స్ తయారయ్యారు.
ఫుడ్ బాక్స్ అభిమానుల్లో ఇన్ ఫోసిస్ సంస్ధాపకుడు నారాయణ మూర్తి కూడా ఉన్నారు. నారాయణమూర్తి చాలా సార్లు తమ దగ్గిర నుంచి ఫుడ్ అర్డర్ చేశారని మురళీ గర్వంగా చెబుతాడు.
ఈ మధ్యలో ఫుడ్ బాక్స్ క్యారియర్ ఐటెమ్స్ కూడా పెరిగాయి. జొమాటో, స్విగ్గితో పోలిస్తే ఫుడ్ బ్యాక్స్ కారు చౌక. జొమాటో,స్విగ్గిలో ఒక పూర్తి భోజనం రు.400 అయితే, చక్కటి అమ్మమ్మ చేతివంటకం, శుచిగా, శుభ్రంగా ఉండే వంటలు కేవలం రు. 80లే.
ఇక్కడే మురళీ సక్సెస్ అయ్యాడు. క్వాలిటీ వంటలతో ఫుడ్ బ్యాక్స్ డాక్టర్ల ను కూడా బాగా ఆకట్టుకుంది. తన కస్టమర్లలో 30 శాతం మంది డాక్టర్లుండటమే దీనికి సాక్ష్యం అని మురళీ చెబుతున్నాడు. తనకున్న రిజస్టర్డ్ కస్టమర్లలో చాలా మంది రోజూ ఫుడ్ అర్డర్ చేస్తున్నారు. కొందరయితే మూడుపూటలా ఫుడ్ బాక్స్ క్యారియర్ తెప్పించుకుంటున్నారు.
ప్రతి శుక్రవారం, బుధవారం ఫుడ్ బాక్స్ ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే అందిస్తుంది. మిగతా రోజుల్లో కస్టమర్ల కోరికలను బట్టి మారుతూ ఉంటుంది. కస్టమర్ బేస్ పెరగడంతో సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు నార్త్ ఇండియన్ వంటకాలు మొదలయ్యాయి. మెల్లిగా చైనీస్ వంటకాలకు పాపులారిటీ పెరిగింది.
ఫుడ్ బాక్స్ దాదాపు జీరో ఇన్వెస్ట్ మెంటుతో మొదలయింది,సరుకులు కొనడం మినహా మరొక పెట్టుబడి లేదు. మొదట్లో ప్రాఫిట్ గురించి ఆలోచించలేదు. మొదటి ఆరునెలలు పాటు లాభం లేదు. ఇపుడు బిజినెస్ సంవత్సరానికి రు. 1.5 కోటికి చేరింది.
Like this story? Share it with a friend!