అమరావతి కోసం సీమ ప్రజలను బానిసలుగా మార్చవద్దు :మాకిరెడ్డి

(మాకిరెడ్ది పురుషోత్తమ రెడ్డి)
బానిసలు వారి వారి కోసం బ్రతకరు తమ యజమాని ప్రయోజనాలే తమ ప్రయోజనంగా జీవిస్తారు పుస్తకాలలో చదువుకోవడం తప్ప నేరుగా చూసి ఎరగము. ఆ సమాజం అంతరించింది. రాజరికం , భూస్వామ్య వ్యవస్థ , పెట్టుబడి దారి విధానం , ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకు మించిన సమాజం కోసం వర్తమాన ప్రపంచంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా అక్కడక్కడ పాత వాసనలు అలానే ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలే నేడు రాయలసీమలో జరుగుతున్నాయి.
మూడు రాజధానుల ప్రకటనపై రాయలసీమలో జరగాల్సిన చర్చ ఏమిటి జరుగుతున్నదేమిటి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంబ్లీ వేదికగా మూడు రాజధానులు ఉంటే ఎలా ఉంటుంది అని ప్రభుత్వ ఆలోచనను తెలిపారు. వారి రాజకీయ ఉద్దేశ్యం వారికి ఉండవచ్చు అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా. ఈ సమయంలో నేడు జరగాల్సిన చర్చ మొత్తం మార్పులో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏమి కావాలని. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అందుకు భిన్నంగా సీమ ప్రజలను అమరావతి రాజధాని ప్రయోజనాల కోసం బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి కాకపోతే రాజధానిని మాకివ్వండి. అమరావతి కన్నా విశాఖ దూరం కనుక అమరావతి లేదంటే కర్ణాటక , తమిళనాడులో కలపండి లాంటి డిమాండ్లకు పూనుకున్నారు. ఈ వాదనల సారాంశం ఒక్కటే అది అమరావతిలొనే రాజధాని ఉండాలి. అదే బానిసలు చేసింది. తమ కోసం కాకుండా తమ యజమాని కోసం పనిచేయడం. నేడు సీమ ప్రజల్ని కూడా తమ ప్రాంతంకి ఏమి కావాలి అని అడగకుండా అమరావతి రాజధానిని అక్కడే ఉండాలి అని నేరుగా ఆ ప్రాంతంలో డిమాండు చేస్తూ రాయలసీమలో మాత్రం పరోక్షంగా మద్దతుగా మాట్లాడుతున్నారు.
రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటి నుంచో అమరావతి రాజకీయ బానిసలుగా ఉన్నారు. నేడు తమతో బాటు సీమ ప్రజల్ని కూడా బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో ఏమి అడిగితే గరిష్ట ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచించి అందుకు తమ ప్రజాప్రతినిధులు పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. రాయలసీమ ఆలోచనాపరులు , మేధావులు అలాంటి చైతన్యం ప్రజలలో తీసుకురావాలి.