Home Features సారా కొట్టు నుంచి సివిల్స్ కి… రాజేంద్ర భరూద్ సివిల్స్ విజయ యాత్ర

సారా కొట్టు నుంచి సివిల్స్ కి… రాజేంద్ర భరూద్ సివిల్స్ విజయ యాత్ర

267
0
తల్లితో రాజేంద్ర భరూద్ IAS
డాక్టర్ రాజేంద్ర భరూద్ మహారాష్ట్ర ట్రైబల్ బెల్ట్ లోని సక్రీ తాలూకా సమోడ్ గ్రామంలో ఒక ఆదివాసీ గిరిజన కుటుంబంలో జన్మించాడు. ఒక భిల్ గిరిజన తెగకు చెందిన వ్యక్తి.
రాజేంద్ర  పుట్టకముందే అతని తండ్రి చనిపోయాడు. కటిక పేదరికంలో గడిపిన పరిస్థితి. తండ్రి జీవితంఎలా సాగిందో కూడా తెలియదు. అసలు తండ్రెలా వుంటాడో  తెలియదు, గుర్తు పెట్టుకోలేనంత చిన్నవయసులోనే తండ్రి చనిపోయాడు. భూమి లేదు,ఆస్తి లేదు. ఉన్నదంతా ఇప్పపూల సారా దుకాణమే. గిరిజన ప్రాంతంలో బాగా వెనకబడిన గ్రామంలో, నిరుపేద కుటుంబంలో  రాజేంద్ర జనవరి 7, 1988 న  జన్మించాడు.
 వాళ్ల కుటుంబం చెరకు గడ్డితో చేసిన గుడిసెలో నివసించేది. అది వాళ్ల అమ్మ మనసు రాయిని చేసింది. మనసులో రెబెల్ గా మారింది.  పరిస్థితిపై ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోలేదు. తన పిల్లలను ఈ పేదరికం, సారాదుకాణం నుంచి బయటపడేయాలనుకుంది.  ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. వారిని ఉన్నతిలోకి తేవటమే ఆమె లక్ష్యంగా సారా  దుకాణం లో పనిచేయడం ప్రారంభించింది.
“అమ్మ ఇప్ప పూలా సారా తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. ఆ  గిరిజన ప్రాంతంలో ఇది నిషేధం కాదు. అందుకే ఇంట్లోనే అమ్మ ఇప్పపూల తో సారా తయారు చేసి కుండల్లో భద్రపరిచి అమ్మేది. ఆ ప్రాంతంలో  సారా తాగే వాళ్లంతా ఆ ఇంటి కొచ్చి సారా తాగి నాలుగు కాసులిచ్చే వాళ్లు. సారా తో పాటే అమ్మ స్నాక్స్ కూడా తయారు చేసేది. అవి కూడా వాళ్లకొనేవాళ్లు. అమ్మ ఎపుడూ ఈ పని లో బిజీగా ఉండేది,’ అని తన గతం గురించి రాజేంద్ర విలేకరులతో చెప్పాడు.
“నేను చిన్నపుడు ఒక్కొక్క సారి ఏడ్చేవాడినట. అలావుంటే అంగడెల నడుస్తుంది? అపుడు అమ్మ ఏంచేసేదో తెలుసా? అప్పుడు నా ఏడుపు మానిపించేందుకు ఇప్పపూల సారా నాలుగు చుక్కలు నా నోట్లో వేసేది.అంతే, నేను మత్తుగా, అల్లరి చేయకుండా నిద్రపోయే వాడిని. అలా అమ్మ సారా దుకాణం ఇంట్లోనే సజావుగా నడిచేది. దానితో అమ్మ జీవితాన్ని లాక్కొచ్చింది. వ్యాపార సమయంలో ఆమె కస్టమర్లను  ఇబ్బంది పెట్టలేదు. పెద్దయ్యాక, కస్టమర్ల కోసం నేనూ వేరుశెనగ వుండల వంటి  స్నాక్స్ తయారు చేస్తూ సహకరించేవాడిని”.
’అమ్మ  ఒక పట్టుదల ఉన్న మహిళ. సారా అమ్ముతూనే  ముగ్గురు పిల్లలు పాఠశాలకు వెళ్ళేలా చూసుకుంది. ఈ సారా తయారుచేయడంలో మాయి( ఆయన అమ్మని మాయ్ అని పిలుస్తాడు,)కి  అమ్మమ్మ తోడుండేది. వాళ్లిద్దరు కలసి ఈ సారా  దుకాణం నడిపేవాళ్లు. రోజుకు నూర్రూపాయల దాకా గిట్టేది. అదే జీవితానికి అదరువు. ఈ డబ్బుతోనే ముగ్గురి పిల్లలను చదివించారు, ఆ ఇంటి ఆడవాళ్లిద్దరు. ఆ డబ్బుతోనే ఒకడు కలెక్టర్ అయ్యాడు”.
Rajendra Bharud as the district collector/facebook timeline
రాజేంద్ర, చెల్లెలు జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లేవాళ్లు.సోదరుడు అక్కడే ఉన్న గిరిజన పాఠశాలలో చదివేవాడు. ఆ రోజుల్లో తనకు పెన్నులు పుస్తకాలు  కొనడానికి డబ్బుండేది కాదు. అయితే, చదువుకోవడంలో ఏదో  ఆనందం కనిపించింది.అందుకే చదువు నిరాటంకంగా సాగింది.
 ఆ ప్రాంతంలో  వీరి తెగ  నుంచే కాదు, గ్రామం నుండి కూడా పాఠశాలకు వెళ్ళిన మొదటి పిల్లలు వీరే. బాగా వెనకబడిన గిరిజన ప్రాంతం కాబట్టి గ్రామంలో విద్యకు ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతా పేదలే.
ఒకసారి, పరీక్షల సమయంలో చదువుకుంటుంటే ఒక కస్టమర్ తనకు కొంత వేరుశెనగ ముద్ద తెమ్మని అడిగాడు.రాజేంద్ర నిర్మొహమాటంగా నిరాకరించాడు.. ‘నువ్వేదో డాక్టరో లేదా ఇంజనీర్ అవుతున్నట్లున్నావ్ ‘ అని ఆయన్ని చూసి నవ్వుతూ ఎగతాళి చేసాడు.

Like this story? Please share it with a friend!

రాజేంద్ర లోలోపలే చాలా బాధపడ్డాడు తాను డాక్టరో ఇంజనీరో ఎందుక్కాకూడదు, అపుడే ఆలోచన వచ్చింది.
అమ్మలో నాచదువు మీద  విశ్వాసం నాకు సంకల్పానికి చాలా బలాన్నించిందని రాజంద్ర చెప్పేవాడు.
అయిదో తరగతిలో ఉన్నపుడే రాజేంద్రలో అసాధారణమయిన తెలివితేటలను  టీచర్లు గుర్తించారు. ఒక టీచర్ ఇంటి దాాకా వచ్చి, ‘రాజేంద్ర చాలా తెలివయినపిల్లవాడు. పైచదువులకు ఎక్కడయినా మంచి స్కూలు కుపంపించు అని సలహా ఇచ్చి వెళ్లాడు.’
మొత్తానికి హైస్కూలు చదవుకు  రాజేంద్ర జవహర్ నవోదయ విద్యాలయంలో  అడ్మిషన్ వచ్చింది. అది సిబిఎస్ ఇ సిలబస్. ఆ స్కూలు  150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కల్కువా తాలూకాలో ఉంటుంది.
గ్రామీణప్రాంతాల్లోని తెలివైన పిల్లలందరికి అపుడా స్కూలు కేంద్రం. అక్కడ చదువు భోజనం, వసతి అన్నీ ఉచితం. నవోదయ పాఠశాలలో చేరడం రాజేంద్ర జీవితంలోకొత్త మలుపు. రెసిడెన్షియల్ స్కూలులో చేరేందుకు వెళ్లేపుటు మాయి బాగా ఏడ్చింది.పిల్లలిద్దరిని తీసుకుని తనని పాఠశాలలో వదలడానికి అంతావచ్చారు. వాళ్లకి కష్టమైన ఏడుస్తూనే నేనా పాఠశాలలో ఉండిపోడానికి సిద్ధపడ్డారు.
‘సెలవుల్లో ఇంటికొచ్చినపుడల్లా నేను అమ్మకి సహకరించేవాడిని. అమ్మ నాకెపుడు ఇప్ప సారా కాచే పని పెట్టలేదు. కాకుంటే కస్టమర్లకు సారా అందించే పని చేసేవాడిని.’
అమ్మమ్మతో రాజేంద్ర భరూద్
నవోదయ పాఠశాల లో చేరడం బాగా పనిచేసింది. అక్కడ మ్యాథ్స్ సైన్స్లో ఎపుడూ రాజేంద్రే టాప్. టెన్స్ బోర్డుపరీక్ష్లలో టాప్ వచ్చాడు. 12 వ తరగతిలో 97% వచ్చింది. దీనితో మెరిట్ మీద ముంబైలోని  సేథ్  జిఎస్ మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందాడు. దాంతో పాటు అనేక స్కాలర్‌షిప్‌లు వచ్చాయి.
రాజేంద్ర  హాస్టల్ ఫీజులను జాగ్రత్తగా చూసి ఖర్చు చేసే వాడు. అక్కడ వూర్లో…పిల్లల  భవిష్యత్తు కోసం  ఇంటిదగ్గర అమ్మ మద్యం వ్యాపారం కొనసాగించింది.  అదే జీవనాధారం.
చదువు కొనసాగిస్తూ, యుపిఎస్సి పరీక్షలకు కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు రాజేంద్ర. కాబట్టి ఎంబిబిఎస్ చివరి సంవత్సరంలో, ఇంటర్న్ షిప్ ఉన్నప్పుడే 2 పరీక్షలకు చదువుకున్నాడు.
అమ్మ విషయానికొస్తే, అతను డాక్టర్ కావడానికి చదువుతున్నానని మాత్రమే తెలుసు, ఆమెకు మరేమి తెలియదు.
యుపిఎస్సి అంటే ఏమిటి, ఆ పరీక్షను ఎందుకు చదువుతారు? అది  మన కుటంబానికి ఎలా సహాయపడుతుంది వంటి ప్రశ్నలు ఆమె అర్థం కానివి.
తాను  కలెక్టర్ కావాలనే కోరిక రాజేంద్రలో బాగా పెరిగి పెద్దదయింది. అందుకే డాక్టర్ కోర్స్ , సివిల్స్ ప్రిపరేషన్ చెట్టపట్టాలేసుకుని సాగాయి.ఇలా రెండు పరీక్షలకు ఒకసారి ప్రిపేర్ కావడం చాలా కష్టం. అందునా ఒకటి సివిల్స్ అయినపుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే, రాజేంద్రను దృఢ చిత్తం నడిపించింది. అందుకే కష్టమనే మాట మెదడులోకెక్కకుండా రెండుపరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. రెండింటిలో విజేత అయ్యాడు.
అంటే డాక్టర్  కోర్సు ముగిసే నాటికి రాజేంద్ర  ఒక చేతిలో  MBBS డిగ్రీ మరొక చేతిలో సివిల్స్ రిజల్ట్స్ తో బయటపడ్డాడు.
2012 లో రాజేంద్ర మొదటి దఫా సివిల్స్ లో ఐఆర్ ఎస్ (IRS)కు ఎంపికయ్యాడు. ఢిల్లీ దగ్గిర ఫరీదాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే, దీనితో  సంతృప్తి చెందని రాజేంద్ర 2013లో మరొక సారి సివిల్స్ రాశాడు. ఈ సారి ఇంకా మంచి ర్యాంకు సాధించాడు. ఐఎఎస్ కు ఎంపిక కావడమేకాదు,ఏకంగా మహారాష్ట్ర క్యాడర్ కే వచ్చాడు.
రాజేంద్ర ఈ ఘనిజయంతో చిన్న గ్రామానికి ఇంటికి తిరిగి రాగానే, ఆయన్ని అభనందించడానికి, తమ ఇంటికి ఆహ్వానించడానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు.రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు అందరూ ఆయన్ను అభినందించడానికి వచ్చారు.
అక్కడేం జరుగుతున్నదో అమ్మకు మొదట  అర్థం కాలేదు. మొదట తాను డాక్టర్ అయ్యానని మాత్రమే ఆమెతో చెప్పాడు. ఆమె నిజంగా సంతోషంచింది. ఎందుకంటే, ఆమె కల కూడా అదే.  అయితే, ఇంకేం, డాక్టర్ గా పనిమొదలుపెట్టు, అని అమాయకంగా వత్తిడి తెచ్చింది.
అపుడు ఆయన రహస్యం బయటపెట్టాడు
తానిపుడు  డాక్టర్ కాదు,  కలెక్టర్  అయ్యానని,  డాక్టర్ పని చేయడం సాధ్యం కాదు, అంతకంటె పెద్ద పనులు చేయాలని చెప్పాడు.
ఈ పరిణామం అమ్మకేకాదు, ఆవూర్లో వాళ్లెవరికి ఒక తాయానా అర్థం కాలే. అయితే, ‘మా రాజు’ పెద్ద మనిషిగా మారాడని కలెక్టర్‌గా మారాడని అతికష్టమ్మీద అర్థం చేసుకున్నారు.
Until my results were announced, my mother was under the impression that her son was a doctor. When I told her I am going to become a collector, she did not know what it meant. For that matter, no one in my village knew who was a collector. As the word spread about my clearing the Civils, neighbors approached me and congratulated me for becoming a ‘conductor’: Rajendra Bharud
రాజేంద్ర ఇప్పుడు మహారాష్ట్ర నందూర్‌బార్ జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పోస్ట్ చేస్తున్నాడు.  అమ్మ ఇప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఇక్కడ చాలా చేయవలసి ఉంది.
తాను వచ్చింది  ఆదివాసీ, గిరిజన జనాభా ఉన్న చాలా వెనుకబడిన జిల్లా. మరియు వారి అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే పనిలో రాజేంద్ర నిమగ్నమై ఉన్నాడు.
రాజేంద్ర మాటల్లో…
“నా మార్గంలో అన్నీ అడ్డంకులు ఉన్నప్పటికీ నేను ఇక్కడకు ఎలా చేరుకున్నాను అని చాలా సార్లు నన్ను ప్రశ్నించుకున్నాను. నాజీవితం బాల్యం నుండే  ఒక పోరాటం. రోజుకు రెండుసార్లు తినడం గొప్ప విషయం.నా చిన్నపుడు  ఆట బొమ్మలంటే మామిడి గింజలు లేదా కర్రలు. నదిలో ఈత కొట్టడం, కొండలు ఎక్కడం లాంటి ఆటలతో మా బాల్యాన్ని గడిచింది.అదే నన్ను శారీరకంగా, మానసికంగా బలవంతుణ్ణి చేసింది.నా బలం – నా అమ్మే, మావూరి ప్రజలు. అందరూ సమానంగా పేదవారు.వారు కూడా మనలాగే ఆకలితో ఉన్నారు, వారు కూడా అదే ఆటలు ఆడారు.కాబట్టి పేద అనే భావన నన్ను నిజంగా తాకలేదు”.
“నేను చదువు కోసం ముంబై వచ్చేవరకు   జీవితంలో ఏదో తేడా ఉందన్న విషయం తెలియదు.  నేనూ ఎప్పుడూ గతాన్ని అవాంఛనీయంగా చూల్లేదు. నా  అ(దుర)దృష్టాన్ని శపించలేదు. నేను గ్రహించినదంతా నా పరిస్థితి  మారేందుకు , నేనే ఏం చేయాల్సిందేమిటి అనే. నేను కష్టపడి చదివాను. వ్యాయామం చేశాను, అధ్యయనం చేశాను. సాధారణంగా పిల్లలు లేదా యువకులు బాల్యంలో  పొందే చాలా విషయాలు నాకెపుడు అందుబాటులో  లేవు. అయితే నేనెపుడే వాటి గురించి బాధపల్లేదు, అలోచించలేదు.  కాని ఇప్పుడు నాకు లభించిన వాటిని చూసుకుని గర్వపడతాను”.