(తెలంగాణ నుంచి వచ్చి తిరుపతిలో సెటిలైన ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.)
(రాఘవ శర్మ)
తిరుపతి చంద్రగిరి మధ్యలో పెరుమాళ్ళపల్లె … రోడ్డు పక్క బాగా విస్తరించిన పెద్ద రావి చెట్టు… దాని చుట్టూ కట్టిన వెడల్పైన తిన్నె… తెల్లారే సరికల్లా తిన్నె పైన కూర్చుని మాట్లాడే ఆ పల్లె జనం. చాలా పొద్దు పోయే వరకు ఆ తిన్నె చుట్టూ ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. అది ఆ ఊ రి ప్రత్యేకత.
తెల తెల వారుతోంది. టెంపోలో పెరుమాళ్ళపల్లెకు వచ్చేశామ్. సామాను తీసుకుని ఇంట్లోకి వెళ్ళా మో లేదో, ఓ మహిళ గిన్నెతో పాలు తీసుకొచ్చింది. తల పై ఒక పక్కగా కొప్పు కట్టుకుని, ముఖమంతా నవ్వుతో, పరిచయం లేకపోయినా పలకరించింది.
ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకుంది. మా తమ్ముడిని చూసి ‘ అయ్యో రమ్మ మన అబ్బో డు స్కూలుకు పోతాండడా లేదా !? ‘ అని అడిగింది. ఈ పాలు ఎన్ని అంటే, ‘ పడి ‘ అని చెప్పింది. ‘ పడి ‘ అంటే అర్థం కాలేదు. అరలీటరు కంటే ఎక్కువ. అవి ఆవు పాలు. మా నాన్న ముందే కొంత సామాను తెచ్చి ఉంచాడు. మా అమ్మ వెంటనే ఫిల్టర్ వేసి అందరికీ కాఫీ ఇచ్చింది. ఆవు పాలతో కలిపిన కాఫీ తాగడం అదే తొలిసారి. ఎంత బాగుందో !నీళ్ళు అస్సలు కలప కుండా చిక్కని ఆవు పాలు తెచ్చింది. పెరుగు కూడా చాలా బాగుంది. ఆ ఊ ళ్లో ఉన్నంత కాలం ఆమే మాకు పాలు పోసింది.
ఇది కూడ చదవండి
తిరుపతి జ్ఞాపకాలు-1, వనపర్తితో ప్రారంభం
మాకు పాలు పోసిన ఆమె ఇల్లు మా వీధిలో, మాకు దగ్గరలోనే ఉంది. ఆమె కొడుకు సుబ్రమణ్యం కాసేపటికి మా ఇంటికి వచ్చాడు. గుండ్రటి ముఖం. కాస్త పొట్టిగా, బలంగా ఉండేవాడు. టెన్త్ పరీక్షలు రాశాడు. నా వయసు వాడే. వాళ్ళ అమ్మ లాగానే నవ్వుతో పలకరించాడు. నన్ను పరిచయం చేసుకున్నాడు. తనతో పాటు టెన్త్ రాసిన శంకర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. అతను కూడా పొట్టిగా, బలంగా, నిగనిగ లాడుతూ ఉండేవాడు. ఆ మూడు నెలల్లో ( 1973 జూన్ – ఆగస్టు ) మేం ముగ్గురం మంచి స్నేహితులం అయ్యాం. ఆ నాటి మా స్నేహం ఈ మధ్య వరకు కొన సాగి, జ్ఞాపకాల్లో ఇప్పుడు సజీవంగా మిగిలి పోయింది.
పెరుమాళ్ళ పల్లె ను ఆనుకుని ఉన్న పొలాలను చూపించారు. ఇద్దరికీ వ్యవసాయం ఉంది. పొలంలో చెరుకుగడలను తిన్నాం. చెరుకు రసం తీసి, పెద్ద పెద్ద బాండీలలో పోసి, కాచి బెల్లం తయారు చేసే పద్ధతిని చూపించారు. బెల్లం తయారీకి అమలాపురం తరువాత చిత్తూరు జిల్లానే ప్రసిద్ధి.
ఇక్కడి బెల్లం ముద్దలు తిరుపతి కళ్యాణం లడ్డూ అంత పెద్దగా ఉంటాయి. వ్యవసాయ బావులు గుండ్రంగా చుట్టూ ఇటుకలతో కట్టి ఉంటాయి. కాలువలు లేవు. అంతా బావుల కిందే వ్యవసాయం.
ఒక రోజు మధ్యాహ్నం శంకర్ రెడ్డి చెల్లెలు శకుంతల నెత్తి మీద పెద్ద గంప ఎత్తుకుని పొలంలోకి వెళుతోంది. గంపలో ఏమిటి అని అడిగాను. ‘సంగటి అనా… చేనులో లో కూలీల కోసం’ అని చెప్పింది. నేను కూడా వాళ్ళ పొలంలోకి వెళ్ళాను. కూలీలు అంతా చేతులు కడుక్కుని చెట్టుకింద కూర్చున్నారు. ఒక చేతిలో ఆకు వేసుకుని, పీచు తీసిన పెద్ద కొబ్బరి కాయ అంత సంగటి ముద్ద పెట్టుకుని, మధ్యలో గుంటలాగా చేసుకుని ఊరుబిండి వేసుకుని నంచుకుని తింటున్నారు.
సంగటిని, దాన్ని తినే విధానాన్ని చూడడం అదే తొలిసారి. అన్నం ఉడుకుతుండగా కాస్త ఉప్పువేసి, రాగి పిండి పోస్తూ పప్పు గుత్తితో కలుపుతారు. ఉడికించి, కాస్త చల్లారాక ముద్దలుగా చేస్తారు. అదే సంగటి. వేరు శెనగ పప్పు, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి చేసిన పచ్చడి నే ఊరుబిండి అంటారు.
శంకర్ రెడ్డి ఇంట్లోనే తొలిసారిగా సంగటి తిన్నాను. సంగటిలో సాంబారు కూడా వేసుకుంటారు. దానిలో కాస్త పెరుగు వేసుకుని, పిసరంత ఉప్పు కలుపుకుని తింటే అమోఘం. ఒక్క సంగటి ముద్ద తింటే చాలు కడుపు నిండి పోతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. గ్రామం చుట్టూ పచ్చటి పంట పొలాలు. ఇళ్లలో మంచి పశుసంపద. ఆ రోజుల్లో పెరుమాళ్ళ పల్లె అలా కళ కళ లాడి పోయేది.
ముగ్గురం ఒకే వయసు వాళ్ళం. నవ యవ్వనంలో కి అడుగిడు తున్న రోజులవి. స్నేహ గవాక్షాలుగా మారిన శంకర్ రెడ్డి, సుబ్రమణ్యం పెరుమాళ్ళ పల్లె పరిసరాలన్నీ నాకు చూపించాలని ఉత్సాహంగా ఉన్నారు. వేరే ప్రాంతం నుంచి ఎవరైనా తమ గ్రామానికి వస్తెే, వారి ని అక్కున చేర్చుకుని స్నేహం చేసే లక్షణం వారిది. అగ్రికల్చరల్ కాలేజ్ లో పని చేసే ఎల్. ఎస్. రావుతో కూడా మంచి స్నేహం చేశారు. ఆయన మంచి నాటక కర్త.
తిరుపతి చూడాలని ఒక రోజు ముగ్గురం సైకిళ్ళలో బయలు దేరాం. వెళ్లేటప్పుడు గాంధీపురం మీదుగా పుదిపట్ల వెళ్లాం. పుదిపట్లను ఆనుకు ని ఉన్న చేర్లోపల్లెను చూపించారు. ఈ రెండు గ్రామాల్లో చేనేతకు ప్రసిద్ధి. చేనేత కుటుంబానికి చెందిన శంకరయ్య వీళ్ళ క్లాస్ మేట్. అతన్ని పరిచయం చేశారు. తరువాత తాటి తోపులు వచ్చాయి. రోడ్డు పక్కనే లెక్కలేనన్ని ఎత్తైన తాటి చెట్లు ఉన్నాయి. శంకర్ రెడ్డి మితభాషి. సుబ్రమణ్యం ముఖంలో ఎప్పుడూ నవ్వు తాండవ మాడేది. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు. తాటి తోపులు గురించి ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పాడు.
‘ఎన్టీ రామారావు ఈ తాటి తోపులను కొనేసి సినిమా స్టూడియో కట్టాలనుకున్నాడు. యూనివర్సిటీ వాళ్ళు ఒప్పు కోలే ‘ అన్నాడు .
‘ ఎందుకు ఒప్పు కోలేదు ? ‘ అని అడిగాను.
‘ యూనివర్శి టీ పిలకాయలు సినిమా వాళ్ళ వెంటపడితే చదువులు పూడుస్తాయని.. ‘ అంటూ చెప్పేసాడు.
ఆప్పుడైతే అది నిజమేనని నమ్మేశాను అమాయకంగా.
‘ మనోడికి సినిమా జ్ఞానం జాస్తిలే ‘ అన్నాడు శంకర్ రెడ్డి.
‘ అట్లాగా ‘ అన్నాను.
‘ సుబ్రమణ్యం ఒక తూరి ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపోయినాడులే సినిమా వాళ్లందరినీ చూట్టానికి. అందరినీ చూసొచ్చినాడు ‘ అని చెప్పాడు శంకర్ రెడ్డి నవ్వుతూ చాలా గొప్పగా, కాస్త వ్యంగ్యంగా. ఆ మాట నా చెవిన పడేసరికి విజయగర్వంతో సుబ్రమణ్యం మరింత నవ్వు ముఖం పెట్టాడు.
‘ మద్రాసు ఎట్లా వెళ్ళావ్ ? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ‘ అని అడిగాను.
ఎడం చేత్తో కుడి చెయ్యి మధ్య వేలు ని పట్టుకుని ‘ హుషుక్ ‘ అని లాగాడు ఏదో సాహసం చేసినట్టు నవ్వుతూ. నాకు అర్థం కాలేదనుకుని శంకర్ రెడ్డి ‘ మనోడు చేతికి ఉన్న ఉంగరాన్ని యాభయి రూపాయలకు కుదువ పె ట్టి జల్సా చేసొచ్చినాడు లే ‘ అన్నాడు.
ఆ మాట వినేసరికి గుండె గుభేల్ మన్నది. ‘ తిరిగి వచ్చాక వాళ్ళ నాన్న చావ కొట్టుంటాడే ‘ అన్నా.
‘అదేం లేదు. తిరిగి వచ్చే సి నాడని సంతోషపడినారులే. ఉంగరం యాడ కుదువ పెట్టినావో చెప్పురా నాయనా అని బతిమాలి, వడ్డీతో కట్టి విడిపించుకుని వచ్చినారులే ‘ అంటూ శంకర్ రెడ్డి వివరించాడు. వాళ్ళ నాయన ఎంత మంచి వాడు అనుకున్నా.
‘ అదే మా నాన్న అయితే నా..!?’ అని చెప్పబోయి, వీళ్ళ కెందుకులే చెప్పడం నా పరువు పోతుంది’ అని మనసులోనే అనుకుని ఊరుకున్నా.
అగ్రి కల్చరల్ కాలేజ్ చూపించారు. కాలేజ్ ఎదురుగా దూరంగా పేరూరు బండను చూపించారు. అక్కడి నుంచే కాసి రాళ్ళు, రాతి కూసాలు వస్తాయని చెప్పారు.
ఆ పక్కనే వెటర్నరీ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ. అబ్బో ఎన్ని కాలేజీలో ! రైలు దిగి టెంపో లో వచ్చే టప్పుడు మా నాన్న చూపిస్తుంటే చీకట్లో ఈ కాలేజీలు ఏవీ కనిపించ లేదు. యూనివర్శి టీ లో రోడ్డు కిరువైపులా పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో!
కాలేజీ లన్నీ చూసి, యూనివర్సిటీ అందంతో మైమరచి, ఇంజినీరింగ్ కాలేజ్ గేట్ నుంచి సైకిళ్ళ పై మెయిన్ రోడ్డులోకి వస్తున్నాం. మెయిన్ రోడ్లో కి చూసుకోకుండా మలుపు తిరిగే సరికి వెనుక నుంచి వచ్చిన ఒక కారు నా సైకిల్ ను ఢీ కొంది. కింద పడి పోయా. సైకిల్ చక్రాలు రెండూ వంకర పోయాయి. నాకు దెబ్బలు తగల నందుకు మిత్రులిద్దరూ సంతోష పడ్డారు. సైకిల్ దేముంది ఇక్కడ బాగు చేయిద్దాము అన్నారు. నాకు దెబ్బలు తగిలినా పరవాలేదు కానీ, సైకిల్ దెబ్బతిన్నదని బాధ పడ్డాను మా నాన్న గుర్తు కొచ్చి. అప్పుడు సుబ్రమణ్యం వాళ్ళ నాన్న ఎంత మంచి వాడో అనిపించింది.
అష్ట వంకరలు తిరిగిన నా సైకిల్ ను షాపులో రిపేరు కిచ్చేసి ఇంటికి వచ్చేసాము. నిజానికి తప్పు నాదే . కానీ కారు నడిపిన డ్రై వర్ దే తప్పని సుబ్రమణ్యం, శంకర్ రెడ్డి ఇద్దరూ కలిసి మా నాన్నను శాంతింప చేశారు. హమ్మయ్యా.. అనుకున్నా
ఆ తరువాత ఒక రోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి శంకర రెడ్డి మాఇంటి కొచ్చి, ‘ శర్మ..తొందరగా ఫ్యాంట్ షర్ట్ వేసుకురా ‘ అన్నాడు. బట్ట లేసుకు ని సైకిల్ తీసుకుని రోడ్లో కొచ్చాను. శంకర్ రెడ్డి, సుబ్రమణ్యం తో పాటు పుదిపట్ల శంకరయ్యా మరో మిత్రుడు కూడా ఉన్నాడు. ‘ జ్యోతి కోటాయ్ లో శారద (1973) సినిమా అడ తా ఉం ది . పోదాం ‘ అన్నాడు సుబ్రహ్మణ్యం. ‘ కోటాయ్ ఏ మిటి కొట్టం లాగా!’ అనుకున్నా. సినిమా హాలుని ‘ కొటాయ్ ‘ అంటారని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకున్నా. టికెట్లు దొరకవేమో నని ఒకరంటే, దొరికినా న్యూస్ రీల్ పోతుంది తొందరగా తొక్కండి అని మరొకరు. సైకిల్ ఎంత వేగంగా తొక్కామో మాకే తెలియదు. టికట్లు దొరికాయి. హాలులోకి వెళ్ళి కూర్చున్నాం కానీ, న్యూస్ రీలే మొదలు కాలేదు. ఈ లోగా శంకర్ రెడ్డి కబుర్లు అందుకున్నాడు.
‘ తిరుపతిలో తొలీత బాలాజీ కోటాయ్ వచ్చినాదంట. మా నాయన ఆ సినిమాకు పోయినప్పుడు, సినిమాలో రైలు దూరం నుంచి చుక్ చుక్ చుక్ మంటూ వస్తా ఉందంట. దగ్గరికి వచ్చేస్తోందంట. ఒక రైతు భయపడి పోయి రైలు మనమీదకు వచ్చేస్తోంద ని హడావిడి చేసినాడంట. వీడేడ నుంచి వచ్చినాడురా నాయనా సినిమా చూడ నీయకుండ అంటూ అందరూ తిట్టుకున్నారంట ‘
అది విని నవ్వలేక చచ్చాం.
సినిమా కబుర్లు అంటే సుబ్రమణ్యానికి చచ్చే ఇష్టం. తను కూడా మరో కథ చెప్పాడు. ‘ మహావీర్ కోటాయ్ లో ఎన్టీయార్ సినిమా ఆడతా ఉందంట. నలుగురైదుగురు రౌడీలు కర్రలతో కొడుతుంటే హీరో ఒక్కడే వాళ్లందరినీ ఎదుర్కొంటున్నాడు . ప్రేక్షకుల లోంచి ఒక రైతు లేచి కర్ర తిప్పుతూ ఒక్కడిని పట్టుకుని నలుగురు కొట్టడం కాదురా! దమ్ముంటే నాతో రండిరా ‘ అంటూ అరిచాడంట. మళ్లీ మా అందరిలో నవ్వులు.. న్యూస్ రీల్ మొదలైంది. ‘ శారద ‘ సినిమా మొదలు కాక ముందు ఎంత నవ్వుకున్నామో ఆ సినిమా చూ స్తున్నంత సేపు శారద కష్టాలు చూసి బాధపడి పోయాం. సినిమా అయిపోయే సరికి మాట్లాడడానికి ఎవరికీ గొంతు పెగల లేదు. మనం అంతా ఫోటో తీయించుందాం అన్నాడు పుదిపట్ల శంక రయ్యా. వాడిపోయిన ముఖాలతో స్టూడియోకి వెళ్ళి ఫోటో తేయించుకున్నాం.
ఎడమ నుంచి శంకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, మధ్యలో నేను, నాకు కుడి పక్కన ఒక మిత్రుడు ( పేరు గుర్తు లేదు ) ఆ చివరన పు ది పట్ల శంకరయ్య. నలబై ఏడేళ్ల నాటి స్నేహ జ్ఞాపకం గా ఈ ఫోటో ఇప్పటికీ మిగిలింది.
( సశేషం)
(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)