(డాక్టర్. యస్. జతిన్ కుమార్ )
కరోనా వ్యతిరేక పోరాటంలో భారతదేశానికి చైనా అందించిన, అందిస్తున్న సహాయం గురించి చాలా మందికి తెలియదు. భారతదేశంలోని కొందరు చైనా వ్యతిరేక వ్యూహకర్తలు చైనా పట్ల శత్రుత్వంతో దాన్ని విస్మరిస్తున్నారు. చైనాను దూషించడానికి అప్రతిష్ట పాలు చేయడానికి తమ ప్రయత్నాలను వారు ఎన్నడూ నిలిపి వేయటం లేదు
న్యూఢిల్లీకి చెందిన ఒక భౌగోళిక వ్యూహకర్త బ్రహ్మ చెల్లానీ, ఇటీవల “గత ఏడాది భారతదేశం యొక్క “కఠినమైన కరోనా లాక్ డౌన్” ను సద్వినియోగం చేసుకుని “కీలక సరిహద్దు ప్రాంతాలలో దొంగతనంగా చొరబడటానికి చైనా ప్రయత్నించిందని, చైనా యొక్క “దురాక్రమణ” చైనాకే “స్వీయ-నష్టం”గా మారిందనీ, ఎందుకంటే ఇది “న్యూఢిల్లీని వాషింగ్టన్ కు మరింత దగ్గరగా నడిపిస్తోంది” అని, “చైనా తన అతిపెద్ద పొరుగుదేశాన్ని శాశ్వత శత్రువుగా చేసుకుంటోంది” అని ఒక వ్యాసంలో(నిక్కీ ఆసియా :జపాన్ ప్రచురణ ) పేర్కొన్నారు.
చైనాపై కొందరి అభిప్రాయాలు అసత్యాలు, వక్రీకరణలు, గుడ్డి వ్యతిరేకతల పై ఆధారపడి వుంటున్నాయి. చైనా, భారత్ల మధ్య సరిహద్దు నిర్దిష్టంగా నిర్ణయించ బడి లేదని, ఇరు దేశాలకు వారి వారి అవగాహనలు వున్నాయని తెలిసిందే. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఒక రాజకీయ పరిష్కారం చేసుకోవాల్సిన సమస్య అది. పరిష్కారం బదులు సంఘర్షణలకు దిగితే నష్టమే సంభవిస్తుంది. సరిహద్దుల వద్ద సాధారణంగా జరిగే సంఘటనలే, గత ఏడాది భారత పక్షం దూకుడు వల్ల చిలికి చిలికి గాలివానగా మారి, ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు పక్షాలు పూర్తి స్థాయి యుద్ధ సన్నాహాలు చేశాయి. ప్రాణనష్టమూ జరిగినది. చివరకు సంయమనం, యుద్ద నివారణ విజ్ఞత గెలుపొందాయి. అయితే కొందరు ఈ ఉద్రిక్తతలకు చైనాను బాధ్యురాలిని చేస్తున్నారు. వారు చైనాను ఎప్పటికీ శత్రువుగానే పరిగణిస్తున్నారు .
చైనా “భారత దేశాన్నిశాశ్వత శత్రువుగా” చూస్తున్నట్లయితే, సంయమనం పాటించి, సరిహద్దు సంఘర్షణల సమయంలో అది పదే పదే శాంతియుత పరిష్కారానికి ఎందుకు పిలుపునిచ్చింది? మన దేశాన్ని నాశనం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి యొక్క రెండవ దశలో పోరాడటానికి ఎందుకు తోడ్పడుతోంది? భారతదేశానికి అవసరమైన మద్దతు మరియు సహాయం అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేసిన మొదటి దేశాలలో చైనా ఒకటిగా ఎందుకు ఉంది?
భారతదేశం చేస్తున్న కరోనా పోరాటానికి చైనా సహకారం అందిస్తున్నదని గుర్తించటం సమంజసం. ఈ ఏప్రిల్ నుంచి చైనా 5,000కు పైగా వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్ జనరేటర్లు, 2.148 కోట్ల మాస్క్ లు, సుమారు 3,800 టన్నుల మందులను భారతదేశానికి సరఫరా చేసిందని చైనా లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సరఫరాలు భారతదేశంలోని అంటువ్యాధి వ్యతిరేక పరికరాలు, పదార్థాల కొరతను తగ్గించడానికి సహాయపడ్డాయి, ఏంతో మంది ప్రాణాలను కాపాడాయి.
“ చైనా దురాక్రమణ భారతదేశాన్ని అమెరికాకు దగ్గరగా నడిపిస్తోంది కనుక అది వారికి స్వీయనష్టం” అని అంటున్నారు. భారతదేశం అమెరికా మరియు పశ్చిమ దేశాలతో ముఠా కట్టటం, వారి వ్యూహాల కనుగుణంగా వ్యవహరించటం నేడు కొత్త దేమీ కాదు. ఇలా వారికి దగ్గరవ్వటం, భారతదేశం ఆశించిన విధంగా చైనాపై వ్యూహాత్మక ఒత్తిడినేమీ సృష్టించదు గానీ, భారతదేశం చైనావ్యతిరేక ఆయుధంగా అమెరికాకు ఉపయోగపడుతోంది. ఇలా అమెరికా రథానికి కట్టుబడి వుండటమే వినాశకరమైనది.
భారతదేశంలో పాండమిక్ వ్యాధి పెచ్చుమీరిన సందర్భంలో, అమెరికా అంత నమ్మదగిన మిత్ర దేశమేమీ కాదనీ, మన సంక్షోభాన్ని తన ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలో అమెరికాకు బాగా తెలుసనీ మరోసారి నిరూపణ అయ్యింది.
వ్యూహకర్తలు అని పిలువబడే కొందరికి భారతదేశపు ప్రాథమిక ప్రయోజనాలకు ఏది ముఖ్యమో తెలియదు. సామ్రాజ్య వాదుల వ్యూహాలలో పావులుగా నడవటమే వారికి తెలిసింది. దాని నే జాతీయత పేర ప్రచారం చేస్తున్నారు. వారు భారతీయ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చైనా గురించి ప్రతికూలంగా ప్రభావితం చేయటమే పనిగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం మన దగ్గర కోవిడ్ పరిస్థితి చాలా విషమంగా వుంది. లక్షలాది మంది రోగగ్రస్త మవుతున్నారు. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మౌలిక వసతులు, మందులు, ఆక్సిజన్ కొరతల తో అల్లాడుతున్నాము. ఇవన్నీ అత్యవసరంగ సమకూర్చుకోవలసి వున్నది. కోవిడ్-19 వ్యాక్సిన్ లు కూడా పెద్ద ఎత్తున సేకరించుకోవలసి వున్నది. ఈ వ్యాధి రెండవ వేవ్ లో తీవ్ర నష్టానికి, ఇబ్బందులకు గురిఅయ్యాము, కనీసం మూడవ వేవ్ నయినా నివారించటానికి,సమర్ధవంతంగా ఎదిరించటానికి సంసిద్ధం కావాలి
విదేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, కంపెనీలకు మోదీ యంత్రాంగం అధికారమిచ్చింది. కొన్ని రాష్ట్రాలు కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవటం ప్రారంభించాయి. అతి ఖరీదైన వ్యాక్సిన్ గల ఫైజర్ వంటి కంపెనీలు ఈ బిడ్ల కోసం ప్లాన్ చేశాయి. కానీ ఇప్పటివరకు, చైనా అభివృద్ధి చేసిన తక్కువ ఖరీదు అయిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి ఏ రాష్ట్రమూ సాహసించలేదు. ఎందుకంటే అలా చేయడం “రాజకీయ నిర్ణయం” గా పరిగణించబడుతోంది.
” వ్యాక్సిన్లను ఎక్కడి నుంచైనా సేకరించడంలో మాకు ఎలాంటి సమస్య లేదు. వ్యాక్సిన్ మా ప్రజలను రక్షించాలని మేము కోరుకుంటున్నాము. కానీ చైనా నుండి వ్యాక్సిన్ సేకరించడం ఒక రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం కేంద్రమే తీసుకోవాలి” అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. కోటి మోతాదుల వ్యాక్సిన్ల సేకరణ కోసం ప్రయత్నిస్తున్న, బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ చైనా వ్యాక్సిన్లను వ్యతిరేకించడానికే అన్నట్లు, “భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాలలోని కంపెనీల బిడ్ లు పరిగణించబడవు ” అనే షరతును చేర్చింది.
చైనా నుండి భారతదేశం వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తుందా లేదా అనేది “రాజకీయ నిర్ణయం” అయినప్పుడు, చైనా భారతదేశానికి వ్యాక్సిన్లను విక్రయిస్తుందా లేదా అనేది కూడా ఒక రాజకీయ నిర్ణయమే కదా! మన పాలకుల ఆరాజకీయ నిర్ణయం జాతీయ అనుకూల, ప్రజా అనుకూల వైఖరితో కాక పాశ్చాత్య పెట్టుబడిదారీ అనుకూలంగా వుంటున్నది. కానీ కోవిడ్-19 మహమ్మారి చెలరేగినప్పటి నుండి, చైనా యాంటీ వైరస్ పదార్థాలు, మందులు, పరికరాలు, సాధనాలు ఇండియాతో సహా అనేక దేశాలకు ఎగుమతులు చేస్తూనే వున్నది. ఈ విషయంలో ఆ దేశం మానవతావాదాన్ని అగ్రస్థానంలో ఉంచటం తో పాటు ఇది ఒక వ్యాపారం అని కూడా ప్రకటించింది. . అది రాజకీయాల ఆధారంగా ఎటువంటి వాణిజ్య నిషేధాలనీ విధించదు. చైనా, వాణిజ్య నైతికత మరియు నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. చైనా అనుసరించే ఈ వైఖరి అసాధారణమైనది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఈ విధానమె అనుసరిస్తున్నది. చైనా రాజకీయ నిర్ణయం విభేదాలను పక్కన బెట్టి విషాద సమయంలో సహకరించే ధోరణిలో వున్నది.
కొన్ని భారతీయ సంస్థలు, అధికార వర్గాలు, “బాయ్ కాట్ చైనా” అనే వైఖరితో వున్నా, చైనా తయారిదారులు ఎవ్వరూ కూడా తమ వ్యాక్సిన్లను లేక పరికరాలను భారతదేశానికి ఎగుమతి చెయ్యము అని ఎప్పుడూ అనలేదు. భారతదేశం యొక్క వ్యాక్సిన్ల ఎంపిక మాత్రం ఇప్పటికీ రాజకీయాలపై ఆధారపడి ఉంది.
“రాజకీయాలు ప్రతి దాన్ని నిర్ణయిస్తాయి” అనేది సాంస్కృతిక విప్లవం (1966-76) నాటి నుండి చైనా వారు ఉపయోగించే సాధారణ పదబంధం. అయితే మానవ జాతి ఎదుర్కొంటున్న నేటి విషాదాన్ని తొలగించటం లో రాజకీయాలకు అతీతంగా, ఒక సమిష్టి పూనిక తో పాండమిక్ ను అన్నీ దేశాలు కలిసి ఎదుర్కోవాలని చైనా అనేక సార్లు పిలుపునిచ్చింది. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకునే అమెరికా, భారతదేశాలు మాత్రం, ప్రజల ఇబ్బందులను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయి.
భారతదేశం చైనా నుండి చాలా ఆక్సీజనరేటర్లు మరియు వెంటిలేటర్లను దిగుమతి చేసుకుంది. బహుశా ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కావొచ్చు.”రాజకీయంగా సరైనది” కాదనుకుంటూనే చైనా నుండి పరికరాలను దిగుమతి చేశారు. కారణం ఇంత తక్కువ సమయంలో మన అవసరం మేరకు అన్ని పరికరాలు సమకూర్చే సమర్ధత చైనాకు తప్ప వేరేవరికీ లేదు. చాల పెద్ద సంఖ్యలో ఇంకా వాటికి ఆర్డరు ఇచ్చింది. అయితే ఇండియాటుడే లాoటి పత్రికలు ఇక్కడ “భారత ప్రజలు జీవన్మరణ పోరాటంలో వుంటే, చైనా కంపెనీలు ఈ విపత్కర స్థితిని తమ లాభాలకు మార్గంగా చేసుకున్నాయి, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల ధరలు 340 నుండి 460 డాలర్లకు పెంచి వేశాయి” అని రిపోర్టు చేశాయి. ఊహించని రీతిలో వచ్చిన భారత్ ఆర్డర్ల వల్ల ప్రపంచ మార్కెట్లలోనే ముడి వస్తువులు, వనరుల ధరలు పెరిగాయి. అందునా భారత్ లో వాడుతున్న కాంప్రెసరులు కూడా కొత్తగా తయారు చేయవలసి వస్తున్నది. మానవతా దృష్టితోనే ఆర్డర్లు అంగీకరించి ఓవర్ టైమ్ పని చేస్తున్నాము. అందువల్ల చైనా ఎగుమతుల ధరలు పెరిగాయి” అని వారు చెప్పారు. ఇవి ప్రయివేటు కంపెనీల మధ్య జరుగుతున్న వ్యాపార ఒప్పందాలు. అక్కడి ప్రభుత్వ సంస్థలు కానివి వున్నాయి, ఇవి ప్రపంచ వాణిజ్యంలో సహజంగా జరిగే పరిణామాలు. ధరల హెచ్చు, తగ్గులను, భారత వ్యతిరేకతగా చిత్రించటం, చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేలా, దురుద్దేశంతో దుష్ప్రచారం చేయటం తగునా?
అయితే, కోవిడ్-19 వ్యాక్సిన్లకు సంబంధించి మాత్రం న్యూఢిల్లీకి ఇంకా కొన్ని ఎంపికలు ఉన్నందు వల్లనేమో, వీటిని రాజకీయాలు శాసిస్తున్నాయి.
అయితే మానవ జీవితాలు ముఖ్యమైనవి, రాజకీయాలను మించి కాపాడుకోవలసినవి. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వవుంచే టీకాలనే కావలసినన్ని అందించలేని స్థితిలో, -70 సి వద్ద నిల్వ చేయాల్సిన ఫైజర్ వ్యాక్సిన్ల ద్వారా భారతీయ ప్రజలకు టీకాలు వేయవచ్చని ఆశించవచ్చునా? ఈ పరిస్థితులలో కోల్డ్ చైన్ నిర్వహించటం సాధ్యమేనా ?
చైనా వ్యాక్సిన్లు కూడా ఇప్పటికే కొరతలో ఉన్నాయి. తమ వ్యాక్సిన్లకు భారతీయ మార్కెట్ ఉండాలని చైనీయులు ఈ సమయంలో ఆలోచించక పోవచ్చు. కానీ మనకు సత్వరంగా కావలసిన, మన దేశ పరిస్థితులకు అనుకూలమైన వ్యాక్సిన్లు అందించగల సమర్ధత చైనావారికే వుందని మనం విస్మరించకూడదు. ప్రపంచ దేశాలకు మనం వ్యాక్సిన్ సప్లై చేసే బాధ్యతను తలకెత్తుకున్నాము కానీ అది పూర్తి చేయలేక పోతున్నాము, అంతేకాదు మనమే వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో 40 కోట్ల ప్రజలకు తమ వ్యాక్సిన్లు ఇవ్వటం పూర్తి చేయటమే కాక, 24 కోట్ల డోసులు ఎగుమతి చేసిన చైనా వనరును మనం ఉపయోగించుకోవద్దా? వారి సినో ఫర్మా300 కోట్ల డోసులు, సినోవాక్ 200 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యం సంతరించుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొంది దాదాపు 85 దేశాల వ్యాక్సినేషన్ కార్యక్రమం లో ఉపయోగపడుతున్న దేశం అది. టీకాల పంపిణీలో సమానత్వం, పేద దేశాలకు న్యాయమైన వాటా దక్కేలా ప్రయత్నిస్తున్న విధానం అనుసరిస్తోంది చైనా. వారి వ్యాక్సిన్లను రాజకీయ కారణాలతో తిరస్కరించటం విజ్ఞత అవుతుందా?
భారతదేశం,చైనా కలిసి, సంయుక్తంగా ఎదగవచ్చని చైనా భావిస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ 2014, 2019 లలో భారతదేశాన్ని సందర్శించినప్పుడు “చైనా మరియు భారతదేశం సంయుక్తంగా జాతీయ పునరుజ్జీవాన్ని సాధించాలని” పిలుపునిచ్చారు.
భారతదేశం లోని చైనా వ్యతిరేక వ్యూహకర్తలు మాత్రం చైనా పురోగతిని భారతదేశానికి సవాలుగానో, ప్రమాదంగానో చూస్తున్నారు. వారు చైనాతో ఘర్షణను ప్రేరేపిస్తున్నారు, చైనాను భారతదేశానికి శాశ్వత శత్రువుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సుహృద్భావం, మానవతావాదం మరియు అంతర్జాతీయ బాధ్యతగా చైనా, భారతదేశంలో అంటువ్యాధి పోరాటానికి అవసరమైన సహాయం,మద్దతును ప్రకటించింది. కానీ ఇది చైనా-భారత సంబంధాలలో ఏదైనా మెరుగుదలకు దారితీస్తుందా? అంటువ్యాధి పరిస్థితి మెరుగు పడక పోయినా, ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి తీవ్రమైనా, ప్రజలదృష్టిని మళ్లించడానికి చైనా సంబంధిత వ్యతిరేక అంశాలు మళ్ళీ రేకెత్తించబడతాయి. చైనా వ్యతిరేక ప్రచారంతో ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తారు అని గత అనుభవాలు చెబుతున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఎవరు ఎవరిని శత్రువుగా భావిస్తున్నదీ అర్ధం అవుతుంది.
(డాక్టర్. యస్. జతిన్ కుమార్, సహాయ కార్యదర్శి, భారత-చైనా మిత్ర మండలి, తెలంగాణ )