రిషి కపూర్ ‘బాబీ’ హీరో ఎలా అయ్యాడంటే…

(Ahmed Sheriff)
1970 లో భారీ అంచనాలతో విడుదలైన రాజ్ కపూర్ సినిమా  “మేరా నాం జోకర్” బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా రాజ్ కపూర్ దృష్టి లో  ఒక కళాఖండం, తన జీవిత సర్వస్వం.
ఆ సినిమా పరాజయం తో  అతడు నిజంగానే తన సర్వస్వాన్ని కోల్పోయాడు. అందలం ఎక్కిస్తుందనుకున్న ఆ సినిమా అతణ్ణి వీధిలో నిలబెట్టింది.
అయితే “ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది” అన్న విషయం  రాజ్ కపూర్ పట్ల చాలా నిజాయితీ ప్రదర్శించింది. ఆ అయిడియా ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ మధ్య టీనేజ్ ప్రేమ కథ, దాని పర్యవసానమే “బాబీ” సినిమా. 1973 లో ఆ సినిమా విడుదలయింది.  తరువాత అది సినీ జగత్తులో ఒక చరిత్ర సృష్టించింది.
మేరా నాం జోకర్ పరాజయం తరువాత రాజ్ కపూర్ కృంగి పోయాడు. డబ్బూ, హోదా, పలుకు బడీ అన్నీ దిగజారి పోయాయి. ఆర్. కే. స్టూడియోస్ వణికిపోయింది.  అప్పుడు రాజ్ కపూర్ సినిమా ఆలోచనలు కళా ఖండాల్నించి,  కన్నె పిల్లల  ప్రేమ కథల వైపు మళ్ళాయి.
అంత వరకూ హిందీ సినిమా ప్రపంచం లో ని ప్రేమ కథలన్నీ ఒక స్త్రీ, ఒక పురుషుడి మధ్య జరిగేవి. 50 యేళ్ళ రాజ్ కపూర్, 60 యేళ్ళ కే ఏ అబ్బాస్ తో కలిసి    18 సంవత్సరాల ఒక అబ్బాయీ, 16 సంవత్సరాల ఒక అమ్మాయీ మధ్య జరిగే ఒక ప్రేమ కథ “బాబీ” ని సృష్టించడం ఒక విచిత్రమే.

ఇది కూడా చదవండి 

https://trendingtelugunews.com/english/features/why-rishi-remained-trapped-in-bobbys-romantic-young-man-image/

బాబీ ఒక రొమాంటిక్  సినిమా. ఈ సినిమాలో నటించడానికి అప్పట్లో వెలుగుతున్న రొమాంటిక్ హీరో  రాజెష్ ఖన్నా ఒక్కడే.  కానీ నాటి సూపర్ స్టార్   రాజేష్ ఖన్నా ని హీరో గా పెట్టి సినిమా తీసే స్తోమత రాజ్ కపూర్ వద్ద లేదు.   అదే రాజ్ కపూర్ కి కలిసొచ్చింది. గత్యంతరం లేని పరిస్తితుల్లో తన కొడుకు రిషి కపూర్ ని హీరో గా పెట్టి ఆ సినిమా తీద్దామనుకున్నాడు. అప్పటికి రిషికపూర్ కి ఉన్న సినిమా అనుభవం “మేరానాం జోకర్”  దే. ఆ సినిమాలో అతడు రాజ్ కపూర్ చిన్నప్పటి వేషం వేశాడు.అంతే. అయినా, గత్యంతరం లేక ఒక సాహసం చేయాల్సి వచ్చింది.
అయితే అప్పుడు రిషి కపూర్ బొద్దుగా వున్నాడు. ఆ రూపం ఒక స్మార్ట్ టీనేజ్ అబ్బాయిగా కుదరదు అనిపించి రాజ్ కపూర్ అతడ్ని స్లిం సెంటర్ కి పంపించి బరువు తగ్గ మన్నాడు. రిషి కపూర్ స్లిం సెంటర్ లో పరిచయమైన పార్సీ అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు. అతడి జీవితంలో నిజమైన ప్రేమ కథ మొదలయింది. ఇదో సైడ్ ట్రాక్.
ఒక పార్టీ లో చూసిన డింపుల్ కపాడియాని హీరొయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు రాజ్ కపూర్. అప్పట్లొ ఇంకో అమ్మాయి నీతూ సింగ్ కూడా ఈ పాత్ర కి పోటీ పడింది. అయితే హీరొయిన్ పాత్ర డింపుల్ నే వరించింది.  నీతూ సింగ్, బాబీ లో హీరొయిన్ పాత్రను పోగొట్టుకున్నా, రిషి కపూర్ నిజ జీవితం లో హీరొయిన్ గా పదవి ని పొంది, భార్య గా  సెటిల్ అయిపోయింది ఏడేళ్ల తర్వాత అతడ్ని పెళ్ళాడి. ఇది వేరే కథ.
బాబీ సినిమా షూటింగ్ సమయం లో రిషి కపూర్, డింపుల్ కపాడియా నిజంగా ప్రెమించుకున్నారా అన్నట్లు ఒకరి మీద ఒకరు పోటీ పడి నటించారు. ఈ విషయాన్ని కథలు గట్టి రాశాయి అప్పట్లొ కొన్ని సినీ పత్రికలు. పర్యవసానంగా రిషి కపూర్ జీవితం లో నించి పార్సీ అమ్మాయి నిష్క్రమించింది.
అప్పట్లో డింపుల్ కపాడియాను చూసి కుర్ర కారు తమ ప్రియురాలిని ఊహించుకుంటే, రిషి కపూర్ టీనేజ్ అమ్మాయిల మనసుల్లో ఒక ప్రియుడు ఎలా వుండాలి అనే ముద్రను గాఢంగా వేసాడు. బాబీ దాదాపు 45 సంవత్సరాలు తన హవా కొన సాగించింది. బాబీ డ్రెస్సులు, బాబీ సంగీతం ముఖ్యంగా “హం తుం ఎక్ కమరే మె బంద్ హో” అనే పాట, డైలాగులు, అప్పట్లో కొత్తగా వచ్చిన రాజ్ దూత్ మోటర్ సైకిలు (చిన్న చక్రాల మోడలు) , ప్రియురాలికి పిల్లల ద్వారా ప్రేమలేఖలు పంపడం, లైబ్రేరి లో కూర్చుని వున్న ప్రియురాలిని ఒక అద్దపు ముక్క తో ఎండను ప్రతిబింబించి దిస్టర్బ్ చేయడం,   అప్పటి యంగ్ జనరేషన్ హృదయాల్లో ప్రేమ ప్రతీకలు గా నిలిచి పోయాయి.
రిషి కపూర్ మొదటి సారి డింపుల్ ని కలిసినప్పుడు ఆమె లోపలించి వచ్చి వాకిలి తీసి నుదుటి మీద పడుతున్న వెంట్రుకలను చేత్తో వెనక్కి నెడుతుంది.అప్పుడు ఆమె చేతికున్న పిండి నుదుటికి అంటుకుంటుంది. ఆమె “జల్ది బోలో బాబా మెరా తేల్ జల్ రహాహై” (త్వరగా చెప్పు బాబూ నా నూనె మరుగుతోంది) అంటుంది. ఈ సీన్ చాలా ప్రాచుర్యం పొందింది. రాజ్ కపూర్ మొదటి సారి నర్గీస్ ను చూడటానికి వెళ్ళినపుడు ఇలాగే జరిగిందని ఆ సన్నివేశాన్నే రాజ్ కపూర్ బాబీ లో చిత్రీకరించాడని చెబుతారు.
ఈ సినిమాలో ” ముజ్ సే దోస్తీ కరోగే” (నాతో స్నేహం చేస్తావా?) అనే డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ వాక్యం పేరుతొ ఈ జనరేషన్ లో ఒక హింది సినిమా రావడం గమనించ దగ్గ విషయం.
ఇప్పటి తరానికి ఆమిర్ ఖాన్, జుహి చావ్లా (కయామత్ సె కయామత్ తక్), సల్మాన్ ఖాన్, భాగ్య శ్రీ (మైనే ప్యార్ కియా), వచ్చేంతవరకు దాదాపు 45 సంవత్సరాలు బాబీ ఒక గొప్ప ప్రేమ కథా చిత్రంగా కొన సాగింది అనడం లో సందేహం లేదు.
రాజ్ కపూర్ ఈ చిత్రానికి రెండు రకాల క్లైమాక్సులు చిత్రీకరించాడని చెబుతారు.  ఒకటి దుఖాంతం. దీన్లొ చివర వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. రెండొది సుఖాంతం. ఈ రెండింట్లో సినిమాను సుఖాంతం చేస్తేనే ప్రేక్షకులు సంతోషిస్తారని అనుకుని కథను సుఖాంతం చేసాడు. ఈ చిత్రం విడుదలకు ముందే డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది.
అనుకున్నట్లు మేరానాం జోకర్ విజయవంతం అయి వుంటే,
రాజేష్ ఖన్నా కు ఇవ్వగలిగినంత డబ్బు రాజ్ కపూర్ వద్ద వుండి వుంటే, రిషికపూర్ కాక వేరే హీరో ఎవరైన ఈ చిత్రం లో నటించి వుంటే, ఈ చిత్రానికి మామూలుగా రాజ్ కపూర్ సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ లు సంగీతమిచ్చి వుంటే, రాజ్ కపూర్ ఈ చిత్రాన్ని దుఖాంతంగా ముగించి వుంటే, ఈ చిత్రానికి ఇంత చరిత్ర వుండేది కాదేమో,  మనకొక ఆణిముత్యం రిషి కపూర్ దొరికేవాడు కాదేమో

 

(Ahmed Sheriff is a Hyderabad based poet and writer)