Home Features ‘గండికోట పునరావాసంలో నిర్లక్ష్యమే  ముంపువాసుల పాలిట శాపం’ 

‘గండికోట పునరావాసంలో నిర్లక్ష్యమే  ముంపువాసుల పాలిట శాపం’ 

326
0
SHARE
(యనమల నాగిరెడ్డి) 
గండికోట రిజర్వాయర్ కు గత నాలుగు దశాబ్దాల నుండి ఎన్టీఆర్, చంద్రబాబు, వైస్సార్ ముఖ్యమంత్రులుగా పునాదిరాళ్ళువేశారు.  గండికోట జలాశయం కోసం భూములిచ్చిన రైతులకు2008 లోవైస్సార్ హయాంలో పరిహారం ఇచ్చారు. అప్పిటి నుండి పునరావాసం గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇపుడు వెంటనే కొందరికి డబ్బు ఇచ్చి ఖాళీచేయమంటున్నారు. పునరావాసమంటే చేతిలోడబ్బు  పెట్టి భాదితుల మెడపట్టి గెంటడం కాదు. అన్నివసతులు కల్పించి భాదితులు ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశంఇవ్వాలి. అపుడే పునరావాసం కల్పించినట్లు. ఈ విషయం అధికారులకు నాయకులకు తట్టినట్లు లేదు.
 “ఆత్రానికి అన్నం ఆకులో పెడతావా? బొకిలో పెడతావా?” అన్న సామెతను కడప జిల్లా అధికారులు పాలకపక్ష నాయకులు గండికోట ప్రాజెక్ట్ విషయంలో ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.   గండికోట ప్రాజెక్టులో వెంటనే నీళ్లు నిలపడానికి చేస్తున్న అధికారుల యత్నం, అందుకు తమదైన శైలిలో మద్దతు పలుకుతున్న అధికార పార్టీ నాయకుల వైఖరి, నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రతిపక్షాల ధోరణి ప్రజలను విస్మయ పరుస్తున్నది.
‘రాయలసీమకు నీళ్లు ప్రాథమికమైన అంశం’
‘‘రాయలసీమకు నీళ్లు అత్యవసరం. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఇది అందరి కల.  కానీ ఇప్పుడు సీమకు నీళ్లు వచ్చే సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అలా అని ముంపు ప్రాంతాల ప్రజలను రోడ్డున పడెయ్యలేం. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యుంటే బాగుండేది. ప్రభుత్వం రైతులతో మాట్లాడి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిఉందని’’  సీమ నీటిపారుదల నిపుణులు అంటున్నారు.
గండికోటలో  23 టీఎంసీ ల నీళ్లు నిలపాలన్న ప్రభుత్వ నిర్ణయం ముంపువాసులకు ఖేదం కలిగిస్తుండగా మిగిలిన మెట్ట ప్రాంతాలకు మోదం కలిగిస్తున్నది.  అధికారులు నీళ్లు నిలపడానికి చూపుతున్న శ్రద్ద ముంపువాసులకు నష్టపరిహారం చెల్లించి,  పునరావాసం కల్పించడంలో చూపడం లేదు.
వరదలొచ్చినపుడే సీమ ప్రాజెక్టులకు నీళ్లు- అందుకు సిద్ధం కాని అధికార గణం
శ్రీశైలంలో వరదలు వచ్చినపుడే రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా గగ్గోలు పెడుతున్నది. వరదలు వస్తే గండికోటకు తప్పకుండా నీళ్లు వస్తాయని అందరికీ ఆశ వుంది. మా ముఖ్యమంత్రి నీళ్లు తెస్తాడని డప్పు కొడుతున్న జిల్లా నాయకులు నీళ్లు నిల్వ చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించక పోవడం, అధికారులను అందుకు సన్నద్ధం చేయక పోవడమే  ప్రస్తుత స్థితికి కారణంగా చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
వీరికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉండిఉంటే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ముంపువాసుల కోసం గతంలో విడుదల చేసిన నిధులలో కొంత వెచ్చించి ముంపువాసుల పునరావాసానికి చర్యలు తీసుకుని ఉండవలసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, ప్రాజెక్ట్ రెండవ దశలో ముంపుకు గురవుతున్న వారిని తర్రలించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పక తప్పదు.
జిల్లా అధికారులు స్థానిక నాయకులను సంతృప్తి పరచడంలో మునిగితేలుతూ జిల్లాకు ప్రాణ ప్రదమైన గండికోటలో నీళ్లు నిలపాల్సి వస్తుందన్న వాస్తం మరచిపోయారు.  ఇక జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు అధికారులచేత “తమ ఓటర్లకు కావలసిన పనులు చేయించుకోవడంలోనూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామ జపం చేయడంలోనూ మునిగి తేలుతూ వర్షాలు వస్తే గండికోటలో నీళ్లు నిలపడం కోసం చేయవలసిన (చేయించవలసిన) పనులు పట్టించుకోలేదు”.  తీరా నీళ్లు వచ్చాక ఇళ్ళు ఖాళీ చేస్తారా? చస్తారా? అన్నట్లు ముంపువాసుల గొంతుపై కూర్చున్నారు. ఇదే చరిత్ర టీడీపీ హయాంలో  జరిగింది. ప్రస్తుతం జగన్ హయాంలో కూడా జరుగుతున్నది.
పునరావాస సహాయం
తాళ్లప్రొద్దుటూరులో మొత్తం 2,860 కుటుంబాలను పి.డి.ఎఫ్ (ప్రాజెక్ట్ డిస్ప్లేస్‌మెంట్ ఫామిలీస్)గా గుర్తించి అందులో  సెప్టెంబర్ 8 నాటికి 900 మందికి పునరావాస సహాయం (వన్ టైం సెటిల్మెంట్, ఆర్.ఆర్. ప్యాకేజ్) చేశారు .  వీరికి పునరావాస సహాయం కింద రూ. 10 లక్షలు, ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్) కింద నివాస స్థలంతో పాటు రూ. 7 లక్షలు ఇవ్వాల్సిఉంది. ఆగస్టు 23 న బాధితులకు డబ్బు ఇచ్చి, ఆగస్టు 30 నాటికి సహాయం పొందినవారు  ఊరు ఖాళీ చేయాలని అధికారులు  హుకుం జారీచేశారు. వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 10 లక్షలు తీసుకున్నవారు ఊరు ఖాళీ చేయాలని, ‘ఆర్ అండ్ ఆర్’ ప్యాకేజ్ కింద రూ. 7 లక్షలు తీసుకున్నవారు, వెంటనే ఇళ్లు ఖాళీ చేసి, తాళ్లప్రొద్దుటూరుకు దగ్గర పునరావాస కేంద్రంలో (కనీస సౌకర్యాలు లేని)  వారికి కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
నాయ ‘కుల’ రాజకీయం – గ్రామస్తుల పాలిట శాపం 
ఇటీవల రంగప్రవేశం చేసిన చోటామోటా నాయకులు తమదైన శైలిలో వ్యవహరించి ఆ గ్రామస్తుల మధ్యనే కులాల పేరుతొ చిచ్చు పెడుతున్నారని మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ ఆరోపించారు. “ప్రభుత్వం ఏదైనా అధికారులు వాళ్ళే కాబట్టి తెలుగు దేశం ప్రభుత్వంలో ఏమి జరిగిందో వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతున్నదని” ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  పది రోజులు నీళ్లు నిలపమని, ఈ లోపు సమస్య పరిష్కరిస్తామని చెప్పిన జిల్లా అధికారులు ప్రస్తుతం ఆ మాటలు నీటి మూటలుగా మార్చి “సామ,దానాలను పక్కన పెట్టి, భేదం, దండం ప్రయోగిస్తున్నారని” జయశ్రీ ఆరోపించారు.
శ్రీశైలం జలాలకు తోడు విడవకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు గండికోటలో నీటిమట్టం రోజు, రోజుకు పెరుగుతూనే ఉంది. కాళ్ళకు తేమ తగిలే దశ నుండి నడుముల లోతు నీళ్ళలో జీవనం సాగించాల్సి వచ్చింది. వంట చేయడానికి వీలు లేక, చుట్టూ నీళ్లున్నా తాగడానికి చుక్క నీళ్లు దొరక్క  జనం ఇబ్బంది పడుతున్నారు.
మహిళలు, పిల్లల విషయం చెప్పనలవి కావడం లేదు. ఇక పశువులు, గొర్రలు, మేకలు, ఇతర పెంపుడు జంతువుల  విషయం చెప్పడానికి ఏమీలేదు. ప్రజలు ఈ నీళ్లలో వస్తున్న పాములతో కలసి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండంగా బ్రతుకుతున్నారని జయశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి చెపితే నోరెత్తకుండా భూములిచ్చాం- మాకెందుకీ కష్టం జగన్ మోహనా!
“మాకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు  నీళ్లొస్తాయని రాజశేఖర్ రెడ్డి చెపితే మారు మాట్లాడకుండా, అడ్డం చెప్పకుండా మా భూములిచ్చాము. పుట్టి పెరిగిన ఊరిని వదలడానికి అంగీకరించాము.  అయితే జిల్లాకు నీళ్లివ్వడానికి సహకరించిన మాకు నిలువ నీడ లేకుండా చేసి, తాగడానికి కూడా నీళ్లు లేని ప్రాంతాలకు వెళ్ళమనడం మీకు  న్యాయమేనా?” అని  గ్రామస్తులు జగన్ మోహన్రెడ్డి ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతె ఇదంతా జగన్ రెడ్డికి తెలియకుండా అధికారులు ఆడుతున్న ఆటగా అనుకుంటున్నారు.
గత పది రోజులుగా రోడ్డెక్కి గోడు వెళ్లపోసుకుంటున్న వారిని పట్టించుకోకుండా, ముంపువాసులందరికీ  సరైన నష్ట పరిహారం చెల్లించకుండా(కొందరికి మాత్రమే ఇచ్చి), వారి  పునరావాసానికి  చర్యలు తీసుకోకుండా ఉన్న ఫళంగా ఇల్లూవాకిలి వదలి వెళ్లమంటే  ఎలా? ఇదేమి న్యాయం అంటున్నారు తాళ్ళప్రొద్దటూరు, ఎర్రగుడి, చామలూరు ప్రజలు. చేతిలో డబ్బు పెట్టి, మరుక్షణమే ఖాళీ చేయమంటే పిల్లాజెల్లా, పశువులు, తిండి గింజలు, బోకీ-బోలె తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి.  మాకు కొంత సమయం ఇచ్చి, ఆసరా చూపిన  తర్వాతనే ఖాళీ చేయించండి అని వారు  ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
(యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు కడప)