Home Features చైనా దాడితో మారుమ్రోగుతున్న మాట ‘గాల్వాన్ వ్యాలీ‘, ఇంతకీ గాల్వాన్ కథేంటి?

చైనా దాడితో మారుమ్రోగుతున్న మాట ‘గాల్వాన్ వ్యాలీ‘, ఇంతకీ గాల్వాన్ కథేంటి?

1741
0
ఇపుడు భారతదేశంలో కరోనా తర్వాత అంతగా వినబడే మాట గాల్వాన్ (Galwan). తెలంగాణ సూర్యపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో పాటు మరొక 19 మంది వీరజవాన్లు భారతదేశ సరిహద్దును కాపాడుతు ప్రాణ త్యాగం చేసిన ఏరియా గల్వాన్ లోయ. అక్కడే వీరందరిని చైనా పీపుల్స్ ఆర్మీ సేనికులు రాళ్ల, రాడ్లతో దాడి చేసి తలలు పగులగొట్టి చంపారు. అక్కడ పారే నది గాల్వాన్ నది.
1865 లో WH జాన్సన్ అనే సర్వేఅధికారి భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ గీశారు. అదే జాన్సన్ లైన్. ఆయన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కాశ్మీర్ లో కలిపాడు. అందుకే చైనా ఈ లైన్ ను అంగీకరించడం లేదు. అక్సాయ్ చిన్ తన భూభాగం అని చైనా చెబుతుంది. అయితే, భారత్  తో ప్రపంచంతా జాన్సన్ లైన్ నే రెండు దేశాల మధ్య సరిహద్దుగా భావిస్తున్నాయి.  గత ఏడాది గాల్వాన్ నది మీద భారత్ ఒక వంతెన(కిందిపోటో) నిర్మించింది. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ దీనిని ప్రారంభించారు. ఇది అక్సాయ్ చిన్ ను చేరుకునేందుకు వేసిన మార్గం. ఇది లైన్ ఆప్ యాక్చువల్ కంట్రోల్ కి 7.5 కిమీ దూరాన ఉన్నా చైనా అభ్యంతరం చెప్పింది.దీనికి కారణం, భారత్ అక్సాయ్ చిన్ ను పర్మనెంటుగా తన భూభాగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని చైనా అనుమానం.ఈ  గాల్వాన్  బ్రిడ్జి(Col Chewang Rinchen Setu) నిర్మాణం చైనాకు కంటకింపుగా తయారయింది. చైనా దూకుడుకు ఇదే కారణం.
Galwan Bridge (Credits PIB)
Galwan Bridge (credits PIB)
సరే ఇపుడు గాల్వాన్ దగ్గిరకు వద్దాం మళ్లీ
సాధారణంగా దేశంలో నదులకు దేవతల పేర్లుంటాయి. నదులన్నీ పురాణ గాధలతో ముడవడి ఉంటాయి.గంగానది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరీ, స్వర్ణముఖీ,మంజీర…ఇలా. ఈ నదులకు సాంస్కృతికంగా చాలా పవిత్రత ఉంటుంది, అందుకే  తల్లితండ్రులు పిల్లలకు నదుల పేర్లు పెడుతుంటారు. కావేరీ, గంగ,నర్మద, యుమున చాలా పాపులర్ పేర్లు. కావేరీ సమీపాన లేకపోయినా, కావేరి పేరు అమ్మాయిలకు పెడుతుంటారు.కాని ఈ నదులకు ఎవరు పేరు పెట్టారో చెప్పడం కష్టం.

అయితే గాల్వాన్ నది దీనికి భిన్నం. గాల్వాన్ నదికి బ్రిటిష్ వాళ్లు ఆ పేరు పెట్టారు. అదొక పర్వతారోహకుల సహాయకుడి (porter) పేరు. పూర్తి పేరు గులామ్ రసూల్ గాల్వాన్. ఆ నదికి ఆ పేరు పెటాక, ఆ ప్రాంతాన్ని, లోయను గాల్వాన్ లోయ అని పిలుస్తున్నారు. 1962 చైనాయుద్ధానికి మూలకారణం ఇక్కడే ఉంది. మొన్న భారత చైనా సైనికులఘర్షణ బీజం ఇక్కడే ఉంది. కారాకోరం పర్వత శ్రేణులలో గాల్వాన్ నది పుడుతుంది. ఆ తర్వాత పడమటికి ఆక్సాయ్ చిన్ గుండా 80 కిమీ ప్రయాణించి లదాఖ్ తూర్పున ఉన్న ష్యోక్ నదిలో కలుస్తుంది. ష్యోక్ సింధునదికి ఉపనది.
ఇంతకీ ఎవరీ గులామ్ రసూల్ గాల్వాన్
అతగాడు 1878న్ లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతం గుండా పోయే పర్వతారోహకులు, అన్వేషకులకు సాయం చేసేవాడు, వాళ్లిచ్చ పరకో బ్యాడో తీసుకుని అమ్మకిచ్చేవాడు.కుటుంబ పోషణ అలాాసాగేది.ప్రపంచదేశాల వాళ్లందరి మూటలు మోస్తూ దారిచూపిస్తూ ఉండటంలో సాహసం, ఆనందంరెండూ చూశాడు. ఇక మరొక వృత్తి ఎంచుకోకుండా దొరల సేవలోనే ఉండిపోయాడు.

భారత్ చైనా ఘర్షణల జాబితా ఇదే…1962 యుద్ధం తర్వాత నిన్నటిదే పెద్ద ఘర్షణ

ఆ రోజుల్లో ప్రపంచమంతా కొత్త దార్లు వెదకడం జోరుగా సాగుతూ ఉంది. వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే కొత్త ప్రాంతాలకు వెళ్లాలి. వాటికి దార్లు కనుగొనాలి. టిబెట్, యార్కండ్ (ఇపుడు చైనా సిన్సియాంగ్ ప్రాంతంలో ఉన్న ఆయ్గూర్), కారాకోరం, పామీర్, సెంట్రల్ ఆసియాలకు వ్యాాపారం పెంచాలనుకున్న బ్రిటిష్ వాళ్లు అక్కడి వెళ్లుందుకు దార్లు వెదకడం మొదలుపెట్టారు.  ఇలా ఈ ప్రాంతాలకు వచ్చేవారికి దారిచూపి పనిలో మనవాడు ఆరితేరాడు. సముద్ర మట్టానికి 5 వేల నుంచి 7 వేల అడుగుల ఎత్తున జరిగే యాత్రలన్నీ కూడా సాహసయాత్రలే. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనల్ 30 డిగ్రీల దాకా పడిపోతుంది. సరైన రక్షణ వస్త్రాల్లేకపోత, మనిషికి పది నిమిషాల్లో హైపోథర్మియా వస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా పోవాలి, ఎలా రావాలి,తిండితిప్పల్నీ గాల్వాన్ చూసే వాడు.

Like this story? Share it with a friend!

ఆ రోజుల్లో పేరు మోసిన అన్వేషకులందరికీ గాల్వానే సహాయకుడు, వాళ్ల మూటలు మోశాడు, మాటలు చెప్పేవాడు వాళ్లకు సేవలు చేశాడు, వాళ్లకు దారి చూపాడు, దారితప్పితే దారికి తెచ్చాడు, దారులు వెతికిపెట్టాడు.
1887లో ఈ ప్రాంతానికి వచ్చిన ఇంగ్లీష్ జియాలజిస్టు మేజర్ హెచ్ హెచ్ గాడ్విన్-ఆస్టెన్ కు సహాయకుడిగా ఉన్నాడు. K2 శిఖరం ఎత్తు కొలిచింది గాడ్విన్ ఆస్టెనే. 1892 ఏడవ డన్ మోర్ ఎరల్ (Earl of Dunmore) చార్లెస్ ముర్రే తో కలసి ఈ ప్రాంతమంతా తిరిగాడు. 1890,1896లలో సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ ను ఈ ప్రాంతంమంతా కలియతిప్పి దార్లు చూపించాడు. 1904లో ఆంగ్లో టిబెటన్ ఒప్పందం సూత్రదారి యంగ్ హజ్బెండే.
తర్వా 1913లో గాల్వాన్ ఇటాలియన్ జంతు శాస్త్రవేత్త ఫిలిప్పో డి ఫిలిప్పి తో కలసి ఈ ప్రాంతంలో అన్వేషణల్లో పాల్గొన్నాడు. ఇవి కేవలం కొన్ని ముఖ్యమయినవి మాత్రమే. ఎందుకంటే, 1925లో 47 వ యేట చనిపోయేదాకా ఆయన నిరంతర యాత్రికుడిగా, అన్వేషకుడిగా ఉండిపోయాడు. ఆయన జీవితమే ఒక సుదీర్ఘ యాత్ర.
1892లో చార్లెస్ ముర్రేతో కలసి పర్యటిస్తున్నపుడు వాళ్లొకచోట దారితప్పారు. ముందుకుపోయేందుకు ఎత్తయిన పర్వత శ్రేణులు అడ్డొచ్చాయి. అపుడుగాల్వాన్ వయసు కేవలం 14 సంవత్సరాలు.ఈ పర్వతశ్రేణు ల మధ్య ఎక్కడయినా ప్రత్యామ్నాయ మార్గం వుందేమో వెదికేందుకు గాల్వాన్ ధైర్యంగా ముందుకు వెళ్లాడు. అక్కడి కనుమలన్నీ ఎక్కిదిగి, గాలించి ఒక దారి కనుక్కుని ముర్రేని ముందుకు నడిపించి అబ్బురపరిచాడు. కుర్రవాడిసాహసానికి ఆశ్చర్యపోయిన డన్ మోర్ ఎరల్  గారు గలగలా ఒక సెలయేరు పారుతున్నఆ నాలాకు ‘గాల్వాన్ నాలా’ అని పేరు పెట్టారు. ఆ పేరు స్థిరపడిపోయింది. ఇలా ఒక నదికి లేదా నాలాకు ఒక వ్యక్తి పేరు పెట్టడం  భారత ఉపఖండంలో తొలిసారిగా జరిగింది. ఆ తర్వాత   ఆ చిన్న గాల్వాన్ నది గా మారింది. ఈ ప్రాంతమంతా గాల్వాన్ కనుమగా పేరులోకి వచ్చింది. ఆధునిక చరిత్రలో ప్రపంచంలో ఉద్రిక్త ప్రాంతంగా గుర్తింపులోకి వచ్చింది. ఒక యుద్ధానికి దారి తీసింది.
ఇంగ్లీష్ లో ఆటోబయాగ్రఫీ రాసిన పోర్టర్
తన కుటుంబానికి మరొక జీవనాధారం లేకపోవడం గాల్వాన్ కు ఇదొక వృత్తిగా మారింది. 12 వ యేట నుంచి ఆయన చనిపోయే దాకా ఆయన ఇదే పనిలోనే ఉన్నారు. ఇలా అనేక దేశాల పర్యాటకులకు, పరిశోధకులకు సాయం చేసి చేసి గాల్వాన్ అనే భాషలు నేర్చుకున్నాడు. అయనకు లదాకి, తుర్కి, ఉర్దు, కాశ్మీరీ, టిబెటన్ బాషలొస్తాయి.
అనేక మంది బ్రిటిష్ ప్రముఖులతో ఆయన పనిచేయడంతో మొదట నాలుగు ముక్కలు ఇంగ్లీషు నేర్చకున్నాడు.తర్వాత ఇంగ్లీషను మెరుగుపర్చుకుని స్వీయ చరిత్ర రాశాడు. జమ్ము కాశ్మీర్ ప్రాంతం నుంచి ఇంగ్లీష్ ఆటోబయాగ్రఫీ రాసిన మొదటి వ్యక్తి గాల్వానే అంటారు చరిత్రకారులు. ఈ పుస్తకాన్ని క్యాధరీన్ బెరెట్ ఎడిట్ చేశారు. తన భర్త, అమెరికా సాహస యాత్రికుడు రాబర్ట్ బెరెట్ దగ్గిర పనిచేస్తున్నపుడు గాల్వాన్ ఇంగ్లీషు బాగా సానపట్టుకున్నాడని, రాబర్ట్ గాల్వాన్ కు పనికొచ్చేలాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడని ఆమె గాల్వాన్ ఆటోబయోగ్రఫీకి  ఎడిటర్స్ ఇంట్రొడక్షన్  రాస్తూ వెల్లడించారు.
(credits: bamedunia blogpost)
ఆయన ఆటోబయాగ్రఫీ పేరు “Servant of Sahib: A book to be Read Aloud”. 1923లో W Haffer & Sons Ltd ఈపుస్తకాన్ని ప్రచురించింది. ఈపుస్తకానికి సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ పరిచయం రాశారు. పామీర్ కు, సెంట్రల్ ఏషియాకు వర్తక మార్గాలను కనిపెట్టమని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని గూఢచారిగా పంపించింది. అపుడు గాల్వాన్ ఆయన ఎంతో సహకరించారు.
ఒకనాడు గాల్వాన్ వాడిన వస్తువులు (credits: Bameduniya blostpost)
గాల్వాన్ లే (Leh)పట్టణలంలో పుట్టాడు. 1878 సంవత్సరంలో పుట్టాడని చెబుతారు. ఆయనకు తండ్రి లేడు. తల్లియే చిన్న చిన్నపనులు చేసి పెంచింది. లే పట్టణం సిల్క్ రూట్ లో ఉన్న కీలకమయిన జంక్షన్. కాశ్మీర్, పాకిస్తాన్,పంజాబ్, ఆఫ్గనిస్తాన్, టిబెట్, చైనాల నుంచి వర్తకులు సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తున ఈ పట్టణంలోనే సంతపెట్టుకునే వారు.ఇక్కడే వస్తు వినిమయ వర్తకం జరిగేది.
లే పట్టణంలో గాల్వాన్ గెస్టు హౌస్
2013 లో ఒక బ్లాగర్ ఈ గాల్వాన్ వారుసులను కలసి ఒక చక్కటి పోస్టు bamedunia లో రాశారు. గాల్వాన్ అంటే కాశ్మీరీ భాషలో దారిదోపిడి దారు అని అర్థం. ఈ బ్లాగర్ మొదట 1974లో ఈ ప్రాంతం సందర్శించాడు. ఒక సమకాలీన  వ్యక్తి పేరు మీద ఉన్ననది భారత ఉపఖండంలో ఇదేనని ఆయన పరిశోధించి చెప్పారు. గాల్వాన్ పేరు వెనక ఉన్న జానపద నేపథ్యాన్ని ఆయన వెలికి తీశాడు.
(credits: bamedunia blogpost)
గాల్వాన్ ముత్తాత ఒక పెద్ద దారిదోపిడి దారు. ఆయన పేరు కారా గాల్వాన్. కాశ్మీరీ భాషలో దీనర్థం నల్లదొంగ (Black Robber) అని అర్థం. ఆయనొకసారి కాశ్మీర్ మహారాజు పడగ్గదిలో ప్రవేశించాడు,దొరికిపోయాడు. ఆయనను ఉరితీశారు. అప్పటి నుంచి ఆయన సంతానికి గాల్వాన్ అని పేరు స్థిరపడిపోయింది. జీవితం చరమాంకంలో గాల్వాన్ చాకిరీ కి గుర్తింపు వచ్చింది. 1917లో లే పట్టణ డిప్యూటీ కమిషనర్ ఆయనను హెడ్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ గా నియమించారు.
వలసపాలకులతో తన జీవితమెలా సాగిందో చాలా నిర్భయంగా గాల్వాన్ పుస్తకంలో రాశాడు.
అయితే, తాను పనిచేసిన వారందరి దగ్గిర గాల్వాన్ మంచిపేరు తెచ్చుకున్నాడు.
“He came of the very poorest. He started as simple village lad. But in every situation he behaved like a gentleman,” అని సర్ ఫ్రాన్సిస్ యంగహజ్బెండ్ ఆయన గురించి రాశారు.
ఆయన వారసులు ’లే‘ లో చాలా మందే  ఉన్నారు. ఆఇంటి కోడలొకామెకు 2008లో 90 సంవత్సరాలు. గాల్వాన్ ను ఆమె ఎపుడూ కలవకపోయినా, ఆయన గురించి లెక్కలేనన్ని ముచ్చట్లు ఆమె చెబుతారని ఈ బ్లాగర్ రాశారు.
గాల్వాన్ ఇంటి కోడలు (credits: Bameduniya blogpost)
ఆయన వారసులు లే పట్టణంలోని చాంగ్ స్పా లో ‘గాల్వాన్ గెస్టు హౌస్’ ను నడపుకుని జీవనం సాగిస్తున్నారు.