‘ఎన్నికల ప్రచారం పార్టీలు చేయాలి, పదవుల్లో ఉన్నవాళ్లు కాదు’

(వడ్డేపల్లి మల్లేశం)

విలువలతో కూడిన రాజకీయ పార్టీకే ఈ దేశాన్ని రాష్ట్రాలను పాలించే అర్హత ఉండాలని ప్రజానీకము గొంతెత్తి నినదించ గలిగితే ఈ దేశము  రూపురేఖలే మారుతాయి. అవినీతి అంతమై, అసమానతలు అదృశ్యమై, వివక్షత విచ్ఛిన్నమై , దురాగతాల దూరమై, నియంతృత్వం నీరుగారి, నిరంకుశత్వం నివ్వెరపోయి, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

అందుకే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే చైతన్యవంతమైన ప్రజానీకం చాలా అవసరం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నొక్కి చెప్పారు. అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు రాజకీయ పార్టీల  విలువలు క్రమంగా క్షీణిస్తూ నేడు అంత్య దశలో ఉన్నాయనడంలో సందేహం లేదు అది అతిశయోక్తి కాదు.

అందుకే కారణాలెన్నో, ఆచరణలో సాధ్యం కాకపోతున్నా, భవిష్యత్తు మీద ఆశావాదము కలిగిన ప్రజలు, బుద్ధి జీవులు, మేధావులు, కార్యకర్తలు, సంఘసంస్కర్తలు కొందరై దేశంలో రాజకీయ ప్రక్షాళన జరగాలని ఓటర్లలో మార్పు రావాలని విలువలతో కూడిన సుపరిపాలన రావాలని కోరాలి.

విలువలతో కూడిన రాజకీయ పార్టీ అంటే:

ప్రధానంగా ప్రజలే కేంద్రంగా  పరిపాలన సాగాలి. ప్రజా సమస్యలు, పరిష్కారాలు, అవాంతరాలు, అధిగమించే విధానాలమీద స్పష్టమైన ఆలోచన కలిగిన పార్టీని విలువలతో కూడిన పార్టీగా గుర్తించవచ్చు. ఇందులో ప్రధానంగా అవినీతికి ఆస్కారం లేకుండా సేవా దృక్పథం ప్రధాన ఆయుధంగా పని చేయాలి. పని చేసే వారందరికీ ఉపాధి కల్పించే విధంగా ఉన్నప్పుడు అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది.

మన దేశంలో రాజకీయాలలో  అవినీతికి ఆస్కారం పెరిగి రాజకీయాలు పక్కదారి పడుతున్నాయి.  శాస్త్రీయతను కోల్పోయి అక్రమార్జనకు భూ దందాలకు పాల్పడుతూ రాజకీయాలు అంటే పరిపాలన అంటే సంపాదించుకోవడమే అనే దుష్ట ఆలోచనతో నేడు దేశంలోని రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నవి. కొద్ది పార్టీలు మినహా దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతున్నది అందుకే రాజకీయ పార్టీల ప్రక్షాళనకు ప్రజలు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థలు నడుం కట్టవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

స్వచ్ఛమైన పార్టీతో ప్రయోజనాలు ఏమిటి:

ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్న అట్టడుగు వర్గాలు పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానానికి సంబంధించిన సకల సమస్యలు కూడా ఇలాంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉంటేనే  పరిష్కారమవుతాయి.
అంతరాలు అసమానతలు వివక్షత కులాధిపత్యం కుల పరమైన సమస్యలు ఈ దేశాన్ని నిట్టనిలువునా చేస్తున్నవి. అలాంటి వాటిని అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజల కోసం వెచ్చించే క్రమంలో, ఆదాయ అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తూనే, పెట్టుబడిదారీ విధానాన్ని క్రమంగా తగ్గిస్తూ సమానత్వ సాధన వైపు గా తీసుకువెళ్లే ఆస్కారం తద్వారా సామ్యవాద సమాజ స్థాపనకు ఆస్కారం ఉంటుంది.

రాజకీయ పార్టీ తను ఎంచుకున్న విలువలపై నిలబడినప్పుడు, రాజకీయ పార్టీ విధానాలను అధికార పార్టీ ఆలోచనలను నిరంతరం జాగరూకులై నా ప్రజలు గమనిస్తూ ప్రశ్నిస్తూ ఉంటే, దేశంలోని న్యాయవ్యవస్థ తన ప్రధాన భూమికను మానవతా దృక్పథంతో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా నిర్వహిస్తే నేడు అతిగా ఊరిస్తున్న మన ఆశలు ఆకాంక్షలు ఆశయాలు నెరవేరడానికి వీలుంటుంది. ఉదాహరణకు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుందాం.

రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం భారత దేశంలో నేడు ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చాలా మటుకు తను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా నైతిక విలువలకు కట్టుబడి ఎన్నికలలో అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ప్రయత్నిస్తూ ప్రజలకు మేలు చేస్తున్న పార్టీగా గుర్తింపు పొందినది.

ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు మంత్రులు ప్రజా ప్రజలు ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడమే కాకుండా విద్యా వైద్య రంగంలో భారతదేశంలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తూ స్పష్టంగా చూడవచ్చు.

విద్యారంగానికి 26 శాతానికి పైగా నిధులు కేటాయించారు. అలాంటి కొన్ని పార్టీలు కూడా ఈ దేశంలో సుపరిపాలన అందించడానికి కృషి చేస్తున్నాయి కానీ మెజారిటీ పార్టీలు అవినీతి లో కూరుకుపోయిన కారణంగా ప్రజలు సైతం అవినీతికి పాల్పడి అలవాటు పెంచుకొని మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సందర్భం మనం కళ్ళారా చూడవచ్చు.

ఈ దేశంలో ఇక ఎంత మాత్రం కూడా రాజకీయ జాడ్యాన్ని, అవినీతిని, అక్రమ పాలన, ప్రజల నిర్లక్ష్యాన్ని భరించే పరిస్థితి లేదు కనుక రాజకీయ ప్రక్షాళన అనివార్యమైనది

రాజకీయ పార్టీల ప్రక్షాళన 

క్రమంగా రాజకీయ పార్టీలు హద్దు అదుపు లేకుండా నైతిక విలువలను కోల్పోతున్నాయి అంటే దానికి కారణాలను ఎన్నో చెప్పవచ్చు. న్యాయపరమైన  ఆంక్షలు కనుక బలంగా ఉంటే రాజకీయ పార్టీలు మరింత క్రమశిక్షణగా ఉండేవి. అలాగే ఎన్నికల సంఘం నిబంధనల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలకు పూర్వం టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంఘ ప్రధాన అధికారి గా ఉన్న సమయంలో రాజకీయ పార్టీల యొక్క స్వాతంత్రాన్ని తగ్గించి అనేక అకృత్యాలకు కళ్లెం వేయడం జరిగింది. కొన్ని నిబంధనల్లో మార్పులు తీసుకురావడం ద్వారా రాజకీయపక్షాలు ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరించకుండా కొంత పద్ధతిగా ఉండేవి కానీ నేడు క్రమంగా ఎన్నికల సంఘం ఆంక్షలు తగ్గుతూ ఉండడంతో రాజకీయ పార్టీలు విలువలకు కట్టుబడి లేకపోవడాన్ని మనం గమనించవచ్చు.

ఎన్నికల వ్యయాన్ని ఇటీవలి కాలంలో పెంచడం జరిగింది. అలా కాకుండా ఎన్నికల వ్యయాన్ని నామమాత్రం చేస్తే తప్ప ఎన్నికల్లో అవినీతి అంతం కాదు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ మద్యం పంపిణీ లాంటి వాటి పైన పత్రికలు టీవీల లో కథనాలు వస్తాయి తప్ప వాటి పైన తీసుకున్న చర్యల గురించి తిరిగి ప్రజానీకానికి తెలియజెప్పిన దాఖలాలు లేవు. ఆ విషయాల్లో పారదర్శకత ఉంటే అవినీతి తగ్గి ఆస్కారం ఉంటుంది.

ఎన్నికలపు అధికార పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడం సర్వసాధారణమయింది. పోలీసు వ్యవస్థను అధికార వర్గాన్ని  వినియోగించుకుంటున్న సందర్భాలు అనేకం. ఇలాంటి వాటిపైన పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించాలి.

అలాగే పార్టీలకు పార్టీల అధ్యక్షులు మిగతా కార్యవర్గం యంత్రాంగం ఉంటుంది కనుక వారు మాత్రమే పార్టీ ప్రచారం చేయాలి తప్ప  ముఖ్యమంత్రులు ప్రచారం చేయరాదు. మంత్రులు, ముఖ్యమంత్రులు చేయడం ద్వారా వాగ్దానాలు చేసి ప్రజలను ప్రలోభ పెట్టే ఆస్కారం ఉంది.

ఇటీవలి కాలంలో అలాంటి సందర్భాలలో మనం అనేక చూశాం.
పరిపాలనా కాలంలో మర్చిపోయినట్టు వంటి అనేక అంశాలను ఎన్నికలప్పుడే జ్ఞప్తికి రావడం ఎన్నికలలో వాగ్దానాలు చేయడాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించాలి.

ఇవాళ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి గారు పర్యటించిన సందర్భంలో అనేక ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలకు మంజూరు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ప్రధానమంత్రి కూడా అధికార పరిధి లోని ఆర్థిక విషయాలను ఇష్టారాజ్యంగా వరాలు కుమ్మరిస్తు ఓట్ల కోసం ప్రవేశపెట్టడాన్ని ఎన్నికల సంఘం ఒక కంట కనిపెట్టి అటువంటి పార్టీలను గుర్తింపును రద్దు చేయాలి.

కట్టుదిట్టమైన చర్యలను గనుక ఎన్నికల సంఘం చేపట్టి ప్రవేశపెట్టి అమలు చేసినట్లయితే రాజకీయపార్టీల ప్రక్షాళన సులభంగా సాధ్యమవుతుంది ప్రజల కోణంలో ఆలోచించే స్థాయికి చేరుకొని నైతిక విలువలకు కట్టుబడి ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

ప్రజలు, ఓటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. ప్రధానంగా బాధ్యతలు విస్మరిస్తున్న ది ప్రజలు , ఓటర్ లేనని చెప్పక తప్పదు.

ఎన్నికల సమయంలో  ఓటర్లు ప్రధాన డిమాండ్లను అభ్యర్థుల ముందు పెట్టాలి కానీ ఆర్థిక పరమైన ఎటువంటి లావాదేవీలు ఆశలకు తాయిలాలకు అమ్ముడు పోకుండా ప్రభువులు గా ఉండాలి. బానిస స్థాయికి దిగజార రాకూడదు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో జీవన్ రెడ్డి గారు ప్రకటన చేసి విజ్ఞప్తి చేసినంత మాత్రాన పట్టభద్రులు స్వచ్ఛందంగా ఓటు వేసిన విషయాన్ని కొంతవరకు మనం గుర్తించాలి.

అలాగే మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రెండుసార్లు ఎన్నికైన సందర్భంలో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా వారి యొక్క పని విధానం ద్వారా ఎన్నిక కావడాన్ని మనము ఇచ్చినట్లయితే అటు పార్టీలు ప్రజలు మారినట్లు అయితే తప్పకుండా రాజకీయ పక్షాలు ప్రక్షాళన జరిగి పరిపాలన ప్రజల కోణంలో సాగుతుందని గాఢంగా నమ్మవచ్చు.

పాలకులు గానీ రాజకీయ పార్టీలు గానీ ప్రజలతో పాటు ఓటర్ల అందరు కూడా ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో సుపరిపాలన సాధ్యమవుతుంది. అవినీతికి, అక్రమార్జనకు, భూ దందాలకు పాల్పడే వారిని జైల్లో పెట్టి ప్రజాస్వామిక విలువలను కాపాడవచ్చు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవచ్చు అందుకు అందరము కూడా బాధ్యులను అందరం మన వంతు చేయూతనిద్దాం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన ప్రజలకు అందేలా కృషి చేద్దాం.

Vaddepalli Mallesam

( వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, జాగృతి కళా సమితి అధ్యక్షుడు, సిద్ధిపేట హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *