Home Features డిజైనర్ బేబీలను సృష్టించిన చైనా శాస్త్రవేత్తకు జైలు శిక్ష, డిజైనర్ బేబీలంటే?

డిజైనర్ బేబీలను సృష్టించిన చైనా శాస్త్రవేత్తకు జైలు శిక్ష, డిజైనర్ బేబీలంటే?

105
0
He Jiankui (source wikimedia commons)
(Jinka Nagaraju*)
చైనాలో డిజైనర్ బేబిని సృష్టించిన శాస్త్రవేత్త హె జియాన్ కుయ్ (సదరన్ యూనివర్శిటీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షెంజెన్ )  కి జైలు శిక్ష పడిండి. ఒక చైనా కోర్టు ఈ జన్యుశాస్త్రవేత్తకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు 327,360 డాలర్ల ఫైన్ కూడా విధించింది.
ఈ ఘన కార్యంలో సహకరించిన మరొక ఇద్దరు శాస్త్రవేత్తలకూడా శిక్ష పడింది. జియాన్ కుయ్ చేసిన పని తప్పని, అది అనైతికమని, చైనా ప్రభుత్వం నుంచి ఈ ప్రయోగాలకు అనుమతి లేదని, అయితే, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి జియాన్ కుయ్ ఈ పనికి పూనుకున్నాడని చైనా ప్రభుత్వం నేరారోపణ చేసింది. ఆయన చేసిన పని ‘చట్టవ్యతిరేక వైద్య చికిత్స’ అని చెబుతూ షెంజెన్ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
జియాన్ కుయ్ ప్రయోగం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. వివాదం రేకెత్తించింది. అందుకే  ఇలాంటి ప్రయోగాలు చేయిస్తున్నదనే అపవాదు రాకముందే చైనా వెంటనే స్పందించి ఆయన మీద కేసుపెట్టి జైలు శిక్ష విధించింది.
జియాన్ కుయ్ ఏంచేశాడు?
ఈ మధ్య ఒక రెండు పుస్తకాలు ప్రపంచంలో బెస్ట్ సెల్లర్స్ అయిపోయాయి. వాటిపేర్లు ‘సేపియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ మ్యాన్ కైండ్ (Sapiens: A Brief History of Humankind), హోమో డెయుస్ : ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టుమారో (Homo Deus: A Brief History of Tomorrow).  వీటిని రాసిన పండితుడు యువల్ నోఆ హరారే (Yuval Naoh Harare). ఆయన జెరూసలేం యూనివర్శీటీలో చరిత్ర ప్రొఫెసర్. ఇపుడు ప్రపంచంలో సోషల్ సైన్సెస్ లో రాక్ స్టార్ లా వెలిగిపోతున్నాడు. ఆయన ఉపన్యాసాలను యుట్యూబ్ లో వినవచ్చు. 21 వ శతాబ్దంలో   ప్రపంచం ఒక పెద్ద సవాల్ ను ఎదుర్కోబోతున్నది,అది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) నుంచి వస్తున్నదని చెప్పారు.
ఈ సవాల్ ఏమిటంటే, మనిషి దైవిక శక్తిని సమకూర్చుకుని దేవుడు కాబోతున్నాడు. ఇదంతా ఎఐ తో జరుగబోతున్నది.అపుడు ప్రపంచంలో రెండురకాల మనుషులుంటారు. ఒకరు డిజైనర్ మనుషులు.  రెండోది మనలాంటి వాళ్లు. క్రమంగా మామూలు మనుషులు అంతరించిపోయి ప్రపంచంలో డిజైనర్ మనుషులే మిగిలిపోతారు. పారిశ్రామిక విప్లవం వచ్చినపుడు పరిశ్రమలలో పనిచేసే కార్మిక వర్గం అంటే  వర్కింగ్ క్లాస్ తయారయింది.రేపు ఎఐ పనికి పనికిరాని (యూజ్ లెస్ ) క్లాస్ ను తయారు చేస్తుంది. అంటే చాలా మందికి చేసేందుకు పని ఉండదు. ఉన్న పనికి వీళ్లు పనికిరారు.  ఇది రానున్న సంక్షోభం. దీనిని అపేందుకు సాధ్యం కాదు. ఎందుకంటే, అణ్వస్త్ర పరీక్షలు వంటి ప్రమాదకర పరీక్షలు  బహిరంగం కాబట్టి ఎవరు చేసినా  ప్రపంచానికి తెలిసిపోతాయి. వాటిని నివారించేందు ప్రపంచదేశాలు చర్యలు తీసుకుంటాయి.
కాని డిజైనర్ బేబీలను సృష్టించడమనేది ఎక్కడో ఒక మూల ఒక గదిలో కూర్చుని చేసే ప్రయోగాలివి. అందువల్ల దొంగచాటుగా ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ఇపుడు మనకు తెలియకుండా బిటి వంకాయలు  మార్కెట్లోకి వచ్చినట్లు డిజైనర్ పిల్లలు పుట్టి సమాజంలోకి వస్తూ ఉండవచ్చు. ఇది ప్రమాదం కదా?
అందుకే ఇప్పటికయితే, నైతిక కారణాల వల్ల ఈ ప్రయోగాలను నిషేధించారు. రేపు ఎవరైనా నియంత హిట్లర్ లా ఆలోచించి, మన జాతి ప్రపంచంలోనే గొప్ప జాతి కావాలనుకుని ఈ ఇలాంటి పిల్లలను సృష్టించే ప్రయోగాలకు రహస్యంగా అనుమితిస్తే ఏమవుతుంది.
ఈ భయాన్ని ప్రొఫెసర్ హరారే పుస్తకాలు వ్యక్తం చేశాయి. ఇలాంటి ప్రపంచానికి బాటవేసే  జీన్ ఎడిటింగ్ ని విజయవంతం చేసి ఇద్దరు ఆడశిశువులను హె జియాన్ కుయ్ సృష్టించారు.
జియాన్ కుయ్ ఎలా చేశాడు?
కొత్త మనిషిని, మనకిష్టమయిన లక్షణాలతో, లేదా మనకిష్టంలేని లక్షణాలను తీసేసి అన్ని మంచి లక్షణాలతో సృష్టించవచ్చా. సృస్టించవచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి రుజువు చేశారు. ఈ విధానాన్ని జీనోమ్ ఎడిటింగ్ లేదా జీన్ ఎడిటింగ్ అంటారు.
జియాన్ కుయ్ హెచ్ ఐ వి మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ఆయనకు ఇంతవరకే అనుమతి వుంది. డిజైనర్ బేబీలను సృష్టించప్రయోగాలకు అనుమతి లేదు. అయితే, Crispr-Cas9 అనే పద్ధతిని ఉపయోగించి  గర్భస్థ అండంలోని CCR5  అనే జీన్ ని ఎడిట్ చేశాడు. ఇది హెచ్ ఐ వి ఇన్ ఫెక్షన్ తో సంబంధం ఉన్న జీన్.
ఇపుడు ఈ రెండు మాటల గురించి తెలుసుకుందాం.Crispr-Cas9 అంటే Clustered Regularly Interspaced Short Palindromic Repeats.  ఇది జీన్ ని ఎడిట్ చేసేందుకు ఉపయోగించే విధానం.ఈ టూల్ ను ఉపయోగించి జీన్ లోని కొత్త భాగాన్ని తొలగించవచ్చు, అక్కడ కొత్త ది అతికించవచ్చు. జీన్ లోకేషన్ ని మార్చవచ్చు. ఈ పద్ధతిలో చాలా వేగంగా, చవకగా,యాక్యురేట్ గా జీన్ ని ఎడిట్ చేయవచ్చు.ఇది ప్రకృతి వైద్యంలో లాంటిది. బాక్టిరియాలలో సహజంగా జరిగే జీన్ ఎడిటింగ్ నుంచి రూపొందించిన విధానం.
ఈ ప్రయోగానికి ఆయన ప్రభుత్వానుమతి లేకుండా కొన్ని జంటలను ఎన్నుకున్నాడు. దీనికి ఫోర్జరీ డాక్యుమెంట్లను వాడాడు. ఈ జంటలలో పురుషుడిలో హెచ్ ఐ వి వైరస్ ఉంది.  మహిళలలో లేదు. ఎనిమిది అండాల మీద ఆయన 2018లో ప్రయోగాలు చేశాడు. ఒకటి విజయవంతమయింది.
కొన్ని రకాల బ్యాక్టిరియాలలో సహజంగా వైరస్ దాడిని ఎదుర్కొనే విధానం ఉంది. ఎదయినా వైరస్ దాడిచేసినపుడు ఈ బ్యాక్టీరియా ఈ వైరస్ డిఎన్ ఎలోని కొంత భాగాన్ని తీసుకుని ఆ రకం డిఎన్ ఎలను ప్రతి సృష్టి చేస్తుంది. వీటిని క్రిస్పర్ (CRISPR)లు అంటారు. ఈ శకలాలకు తన మాతృ డిఎన్ ఎ ని గుర్తించే శక్తి ఉంటుంది. మళ్లీ ఎపుడైనా ఆ వైరస్ ఈ బ్యాక్టీరియా మీద దాడి చేసినపుడు ఈ క్రిస్పర్ డిఎన్ ఎ నుంచి ఒక ఆర్ ఎన్ ఎ ను తయారవుతుంది. ఇది Cas9 అనే ఒక ఎంజైమ్ ను విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ దాడి చేసిన వైరస్ లోకి ప్రవేశించి దాని ఒరిజినల్ వైరస్ ను ముక్కలు ముక్కలు చేస్తుంది. దీనితో ఆ వైరస్ నిర్వీర్యమవుతుంది. అది తెచ్చే వ్యాధి ఇక రాదు.
బ్యాక్టీరియాలో జరిగే ఈ జీవ రసాయన చర్యను శాస్త్రవేత్తలు ల్యాబ్లో కూడా సృష్టించారు. విజయవంతమయ్యారు.మనుషుల్లో పరీక్షించేందుకు రకరకాల నైతిక సమస్యలు, సామాజిక సమస్యలు, జీవపర్యవసానాలు ఎదురవుతున్నాయి.
ఇపుడు చైనా శాస్త్రవేత్త హె జియాన్ కుయ్ వీటిని లెక్క చేయకుండా ఈ ప్రయోగాన్ని చడీ చప్పుడు లేకుండా మనిషుల మీద ప్రయోగించి, హెచ్ ఐ వి జబ్బుకు కారణమయిన  CCR5 జీన్ ని ఎడిట్ చేసి ఎయిడ్స్ తెచ్చే వైరస్ ఒక వేళ దాడి చేసినా జబ్బు రాకుండా ఉండే ఏర్పాట్లతో డిజైనర్ కవలలను సృష్టించాడు.
ఈ విషయాన్ని ఆయన ఆ మధ్య హాంకాంగ్ లో జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు. ఆయన వెల్లడించి ఉండకపోయిఉంటే ప్రపంచానికి తెలిసేదే కాదు. కొంతమందిలో ఎయిడ్స్ రాకుండా జన్యుపరమయిన ఏర్పాటు ఉంటుంది. ఈ గుణాన్ని ఇతరుల్లో కూడా సృష్టించవచ్చేమో చూసేందుకే తాను ఈ ప్రయోగం చేశానని జియాన్ కుయ్ చెప్పినా, ఇది శాస్త్ర ప్రపంచంలో దూమారం సృష్టించింది. ఎందుకంటే ఈ ప్రయోగం ఇంకా లాబ్ స్థాయిలోనే ఉంది. ఇందులో ఉన్న రిస్క్ గురించి ఇంకా ఒక వైపు అధ్యయనం జరుగుతూ ఉంది. అలాంటపుడు ఒక మనిషి మీద జియాన్ కుయ్ జీన్ ఎడిటింగ్ చేయడాన్ని ప్రపంచం ఖండించింది.
అందుకే , ఇలాంటి డిజైనర్ బేబీలను సృష్టించడాన్ని ప్రోత్సహిస్తున్నదనే అపవాదు రాకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం చర్య లు తీసుకుంది. జియాన్ కుయ్ మీద కేసు పెట్టి జైలు కు పంపింది. అయితే, ఇలాంటి ప్రయోగాలను ఆపడం సాధ్యమా? తెలివైన పిల్లలు పుడతారంటే ఎంతఖర్చయినా పెట్టగల తల్లితండ్రులున్నారు. అందంగా కనిపించాలని ఈ రోజు ఎన్నో మందులు వాడుతున్నట్లు , ేపు తెలివైన పిల్లలకోసం ఎమయినా తెగింపు రహస్యంగా చేయగలరు? మనిషిలోని స్వార్థాన్ని అపడం కష్టం. అందుకే ప్రొఫెసర్ హరారే ముందున్నది పెను ముప్పు అంటున్నారు.

(Jinka Nagaraju is a Hyderabad based journalist. He covered the entire spectrum of political activities of Telugu states from Hyderabad and New Delhi for about 2.5 decades.He studied Physical Anthropology and his area of interest is Political Anthropology and Population Genetics)