వికేంద్రీకరణ ముసుగులో వ్యవస్థ ధ్వంసమే లక్ష్యమా!: లక్ష్మినారాయణ

(ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానం చాలా చర్చకు దారితీసింది. దీనిని కొందరు కొనియాడితే,మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది విధ్వంసం అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ్య సాంఘిక రాజకీయ విశ్లేషకుడు టి. లక్ష్మినారాయణ వాదన చదవండి)
(టి.లక్ష్మీనారాయణ)
1. అమరావతి రాజధాని నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటన్న అసంబద్ధ వాదనతో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే కుటిల రాజకీయ నీతికి ప్రభుత్వమే పాల్పడడం, ” కంచే చేను మేసినట్లు” ఉన్నది. అసలు లక్ష కోట్లతో రాజధానిని నిర్మించమని ఎవరు అడిగారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన మేరకు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అందించాల్సిన నిథులను రాబట్టుకొని, నాణ్యమైన ప్రజా రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడన్న అంశాన్ని తేల్చకుండానే ఉమ్మడి రాష్ట్రాన్ని కేంద్రం విభజన చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 6ను అనుసరించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజధాని అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించమని శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. రాజధాని ఎక్కడ అన్న అంశంపై ఆ కమిటీ నిర్ధిష్టమైన సిఫార్సు చేయలేదు.
3. ఈ పూర్వరంగంలో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదించాయి. రాష్ట్ర నడిబొడ్డులో అమరావతి ఉండడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలు స్థూలంగా సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతం నిర్ణయమైన తరువాత భూ సమీకరణ విధానంలో రైతుల నుండి 33,000 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసుకొని, కొన్ని నిర్మాణాలను పూర్తి చేసుకొని, గడచిన మూడు – నాలుగేళ్ళుగా పాలన ఆ భవనాల నుండే సాగుతున్నది. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లేని వివాదాన్ని సృష్టించి, విభజనతో కష్టాల ఊబిలో చిక్కుకొని తల్లడిల్లి పోతున్న రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడం ఏ మాత్రం రాజకీయ విజ్ఞత అనిపించుకోదు.
4. రాష్ట్ర రాజధాని వ్యవస్థ(రాజభవన్, సచివాలయం, చట్ట సభలు, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, వగైరా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ) అమరావతి కేంద్రంలోనే ఉండాలి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడికకు అనుగుణంగా కర్నూలులో హైకోర్టును నెలకొల్పాలన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆలోచన సముచితం. దాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది.
5. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను చట్టబద్ధంగా నెలకొల్పి, వార్షిక బడ్జెట్లలో నిథులు కేటాయించి, స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించుకొని అమలు చేసే స్వేచ్ఛ కల్పించాలి.
6. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల మేరకు స్థానిక సంస్థలకు విధులు, నిథులు, బాధ్యతలను పూర్తి స్థాయిలో బదిలీ చేసి, స్థానిక ప్రభుత్వాల వ్యవస్థను బలోపేతం చేయాలి. నూతనంగా నెలకొల్పిన గ్రామ సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా స్థానిక పరిపాలనా వ్యవస్థలో అంతర్భాగం చేయాలి.
7. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడ్డ, వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలి పోయింది. అప్పుల భారం వారసత్వంగా లభించింది. చదువుకొన్న యువతకు ఉపాధి అవకాశాలు లేవు.
8. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య ఐక్యతను పరిరక్షించుకొంటూ, వివాదరహితంగా సమస్యలను పరిష్కరించుకొంటూ, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణతో, సమతుల్యమైన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంకితభావం, చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ పట్టుదలతో కృషి చేయాలి.
9. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన అంశాల అమలుతో పాటు రాజ్యసభ వేదికగా నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక తరగతి హోదాను సాధించుకొని, ఇతర రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో అభివృద్ధి చెందడానికి కృషి సల్పాలి.
10. విభజన చట్టం – షెడ్యూల్ – 9లోని 89 సంస్థలు, షెడ్యూల్ – 10లోని 107 సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఆ సంస్థలను రాష్ట్రంలోని 13 జిల్లాలలో నెలకొల్పాలి.
11. విభజన చట్టం, సెక్షన్ – 85(2)లో పొందుపరచబడిన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో నెలకొల్పాలి.
12. వెనుకబడ్డ, కరవు పీడిత ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై కార్యాచరణను అమలు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన మేరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని రు.25,000 కోట్లతో అమలు చేయాలి. ఈ అభివృద్ధి పథకాన్ని ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళ ద్వారా అమలు చేయాలి.
13. విభజన చట్టంలో పొందు పరచిన మేరకు పారిశ్రామికాభివృద్ధికి 100% జి.ఎస్.టి., ఆదాయపు పన్ను రాయితీలు ఇచ్చి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలి. ఖనిజ, అటవీ, వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నెలకొల్పాలి. ఎన్.టి.పి.సి. / బి.హెచ్.ఇ.ఎల్. సంస్థలు సంయుక్తంగా చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద విద్యుత్తు పరికరాల పరిశ్రమ నిర్మాణాన్ని కొనసాగించాలి. పునర్విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ – చెన్నయ్(వయా శ్రీకాళహస్తి, శ్రీసిటీ) పారిశ్రామిక కారిడార్ మరియు కర్నూలు – అనంతపురం – బెంగుళూరు, బెంగుళూరు – చిత్తూరు – చెన్నయ్ పారిశ్రామిక కారిడార్స్ ను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసి, యువతకు ఉపాథి కల్పన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రాజకీయ సంకల్పంతో కృషి చేయాలి.
14. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం ఓడ రేవును నిర్మించాలి.
15. విభజన చట్టం షెడ్యూల్ 13లో పొందు పరచిన మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైల్వే జోన్ ను విశాఖపట్నంలో త్వరితగతిన నెలకొల్పాలి.
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన విశాఖ మహానగరాన్ని మరింత శక్తివంతమైన, పటిష్టమైన ఆర్థిక, పారిశ్రామిక మహానగరంగా అభివృద్ధి చేసి హైదరాబాదు, చెన్నయ్, బెంగుళూరు, తదితర అభివృద్ధి చెందిన మహానగరాల సరసన చేరే విధంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. నూతన విమానాశ్రయం, పారిశ్రామిక మరియు త్రాగు నీటి అవసరాలకు గోదావరి జలాల తరలింపు, మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.
17. రాయలసీమ నాలుగు జిల్లాలకు రాజధాని అమరావతితో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులను, రైల్వే మార్గాల నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలి. అందులో అంతర్భాగంగా అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే, గుంటూరు – గుంతకల్ రైల్వే మార్గం డబ్లింగ్ – విద్యుదీకరణ నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలి.
18. విభజన చట్టం, సెక్షన్ – 90 మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలి.
19. గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో నిర్మించాలి.
20. విభజన చట్టంలోని షేడ్యూల్ 11లో పేర్కొన్న హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు — నగరి(మొదటి & రెండవ దశ), వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేసి, కృష్ణా నదీ జలాలను శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలి.
21. కృష్ణా డెల్టా – నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించి, కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతం, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు కేటాయించాలి.
22. హంద్రీ – నీవా ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచాలి. తెలుగు గంగ, ఎస్.ఆర్.బి.సి., గాలేరు – నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచాలి.
23. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని , వంశధార – నాగావళి నదుల అనుసంధాన పథకం, నిర్మాణంలో ఉన్న వంశధార రెండవ దశ మరియు ఇతర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
24. పరిపాలన – అభివృద్ధి వికేంద్రీకరణ ముసుగులో రాజధాని వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్న దుష్ట ఆలోచనకు తక్షణం స్వస్తి చెప్పాలి. కులాలు, ప్రాంతాల మధ్య అగాధం, విధ్వేషాలు పెంచే కుటిల రాజకీయాలకు, దుష్ట ఆలోచనలకు అడ్డుకట్ట పడకపోతే రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది.
25. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన కేంద్రీకృత అభివృద్ధి, దుష్పలితాలు, చేదు అనుభవాలను పునరుద్ఘాటిస్తూనే, నేటి 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం మహానగరానికి రాష్ట్ర రాజధానిని ఆమరావతి నుండి తరలించడంలో ఉన్న ఔచిత్యం ఏమిటో విజ్ఞతతో ఆలోచించాలి.
– టి.లక్ష్మీనారాయణ,సామాజిక, రాజకీయ విశ్లేషకులు