సీమ పాలకులు పురోగమనం, అభివృద్ధి తిరోగమనం… ఇంకెన్నాళ్లిలా?

 (చందమూరి నరసింహారెడ్డి)
డింసెబర్ 2, 2017 వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిప్రజా సంకల్పయాత్ర 26వ రోజున అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఆరోజున ఆయన గుత్తిలో ప్రసంగించారు. ఆ రోజు చేసిన ప్రసంగంలో ఆయన అనంతపురం జిల్లా కరువు నివారణ గురించి, ఇక్కడి ప్రాజక్టులు పూర్తి చేయడం గురించి మాట్లాడారు. ఈ ప్రసంగం చేసి మూడేళ్లు కావస్తున్నది.ఆయన ముఖ్యమంత్రి అయి ఏడాదిన్నర కావస్తున్నది.  ఈ రాయలసీమ మీద పాలకులు అధికారంలోకి రాకముందు చూపిన ప్రేమకు చాలా పెద్ద చరిత్ర ఉంది. అదేంటో క్లుప్తంగా చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.
దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు కవి కాకి కోగిర ఇలా అన్నారు.
” నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు’ అని సార్ధకం కాని, సఫలీకృతం కాని స్వాతంత్ర్యానికి పెదవి విరిచారు.
అలా నేడు రాయలసీమ విషయంలో ప్రశ్నించాల్సి వస్తోంది.ఇంతమంది ముఖ్యమంత్రులను ఇచ్చిన రాయలసీమ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు. అడుగడుగున దగా ,మోసం, వంచనకు గురి అవుతున్నాం.
ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో గానీ, విద్యా సంస్థల విషయంలో కానీ ,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వెనుకబడి ఉన్నాం .ఇందుకు బాధ్యులెవరు ?పాలించిన పాలకుల నిర్లక్ష్యమా? ప్రశ్నించలేని గొంతెత్త లేని రాయలసీమప్రజలదా?
రాయలసీమ ప్రయోజనాలు అనే మౌలిక అంశం పట్ల తమ భిన్నమైన ఆలోచనలతో కలిసి పని చేయడం శ్రేయస్కరం. ఈసందర్భంలోనే, రాయలసీమ రచయితలూ, మేధావులూ, రాజకీయ నాయకులు ఒక ప్రజాస్వామిక వేదిక మీద ఐక్య సంఘటనగా మారవలసి ఉన్నది. రాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమ ప్రజలు వేదిక రూపం తీసుకోవలసి ఉన్నది.
రాయలసీమ రైతుల అవస్థలు పరిశీలిస్తే అడుగడుగునా
కష్టాలు కన్నీళ్లు కనిపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ధరల కారణంగా వ్యవసాయం చేయలేని పరిస్థితులకి రైతులను నెట్టివేస్తున్నాయి.. నాట్లు వేయడం ,కలుపు తీయడం,పంట నూర్పిడి పనులు ఇలా అనేక రకమైన వ్యవసాయ పనుల కూలీలఖర్చుభరించలేక పోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యన్.ఆర్.ఇ.జి.ఏ (NREGA)
పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయగలిగితే రైతులు వ్యవసాయ పనులు సులభంగా కొనసాగిస్తారు.
నిత్యం కరువుకాటకాలతో ఆర్థికంగా ఎదగలేకపోయిన రాయలసీమ రైతులను కొంతలో కొంతైనా ఆదుకున్న వారవుతారు .
భూములు ఉన్న ఖర్చులకు భయపడి పంట పెట్టని ఎందరో రైతులు తిరిగి పంటలు పండిస్తారు . పంట ఉత్పత్తులు కూడా పెరుగుతాయి.
వృథాగా సముద్రం పాలవుతున్న నదీజలాలను రాయలసీమకు మళ్ళించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది .ఇప్పటి వరకు పాలకులు రాయలసీమ నీటిపారుదల విషయంలో ఎంతో నిర్లక్ష్యం వహించారు. ఇకనైనా పార్టీలకతీతంగా రాయలసీమ నదీ జలాల కోసం కృషి చేయాల్సి ఉంది .
రాయలసీమ అభివృద్ధి విషయంలో పాలకులు , ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సంఘటితమై సాధించుకోవాల్సిన అవసరం ఉంది.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కొంత ముందడుగు వేసింది .దీనికి ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ,ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించాలి. అవరోధాలను తొలగించుకునేందుకు ముందుకెళ్లి కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ,నల్సార్ శాసనవిషయాల సంస్థ (నల్సార్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ,ప్రభుత్వరంగ సంస్థల సంస్థ , ది భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ (ASCI), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ESCI),సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. సాంకేతిక కళాశాలలు ఐఐఐటి (IIITH), బిట్స్ (BITS Hyderabad),ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్,విగాన్ మరియ లీ కళాశాల కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ ,
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్),
జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ),
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ,సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్,సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT),భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కోయిస్) ఇలాంటివి
సుమారు 120 కి పైగా సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి .
విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కి ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రావాల్సి ఉంది. వాటన్నిటిపై సమగ్రంగా నివేదిక తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో అధికార పార్టీ కీలకమైన చొరవ చూపాల్సి ఉంది .అన్ని రాజకీయ పక్షాలు రాజకీయాలకతీతంగా నిస్వార్ధంగా అధికార పార్టీకి సహకరించవలసిన అవసరం ఉంది.
వాటిని సాదించి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా రాయలసీమ కోస్తా ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమానంగా విభజించి వాటిని ఏర్పాటు చేసి సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి జరపాల్సి ఉంది.
అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల కే పరిమితం కాకుండా అభివృద్ధి పథకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇందులో ముఖ్యంగా రాయలసీమ నదీ జలాల విషయం, పారిశ్రామిక హబ్ లు ఏర్పాటు, కేంద్ర విద్యాసంస్థలు ,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో నెలకొల్పాల్సిన భాద్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా రాయలసీమ పైన ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటిని సమగ్రంగా అందించాల్సిన అవసరం ఉంది.

వెనుకబడిన రాయలసీమ కు బుదేల్ ఖండ్ తరహ ప్యాకేజ్ ఆనాడు ప్రకటించారు కానీ నేటికీ అమలు కావడంలేదు.
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమకు మంజూరైన సంస్థలు కూడా ఇతర ప్రాంతాలకు అప్పటి ప్రభుత్వం తరలించడం శోచనీయం.
కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో కెల్లా పెద్దసంస్థ ఆల్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) అనంత‌పురం కు మంజూరు చేశారు .అనంతపురంలో లో ఏర్పాటు చేయాల్సిన సంస్థ ను మంగ‌ళ‌గిరికి త‌ర‌లించారు.
తిరుప‌తిలో 750 కోట్ల‌ రూపాయలతో ఏర్పాటు కావాల్సిన కేంద్ర కేన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించారు. తిరుప‌తి స్విమ్స్‌లో కేన్స‌ర్ ఇనిస్టిట్యూట్ కు శంకుస్థాప‌న ‌రిగినారాజ‌ధాని ప్రాంతానికి తీసుకెళ్లి రాయ‌ల‌సీమ ప్రజలకు అన్యాయం చేశారు.
10 వేల మందికి ఉపాధి క‌ల్ప‌న ల‌క్ష్యంతో హెచ్‌సీఎల్ కంపెనీని తిరుప‌తిలో ఏర్పాటు చేస్తామ‌ని ఆ కంపెనీ చైర్మ‌న్ శివ‌నాడార్ తిరుమ‌ల‌కు వ‌చ్చిన సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు. అయితే ఎందుకు తిరుపతిలో కాకుండా అమ‌రావ‌తిలో ఏర్పాటు చేశారు.
కేంద్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం అనుబంధ సంస్థ నంద్యాల‌లో ఏర్పాటు కావాల్సి ఉండ‌గాదాన్ని కూడా గుంటూరు జిల్లాకు త‌ర‌లించారు. ఇలా రాయలసీమకు అన్యాయం జరుగుతున్న పట్టించుకునే వారే లేరా?
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరు ముఖ్యమంత్రులు మారినా రాయలసీమ కరువు కోరల్లో చిక్కి శల్యం కావాల్సిందేనా? రాయలసీమ నుంచిఎన్నికైన వారే ముఖ్యమంత్రులుగా ఉన్న రాయలసీమను నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు కు పనిచేసిన రాయలసీమ ప్రాంతానికి చెందిన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
నీలం సంజీవరె డ్డి 1 నవంబర్, 1956 – 11 జనవరి,1960 మొత్తం 1167 రోజులు రోజులు.
దామోదరం సంజీవయ్య
11 జనవరి, 1960 – 12 మార్చి, 1962 వరకు మొత్తం
790 రోజులు
రెండో సారి నీలం సంజీవరెడ్డి 12 మార్చి, 1962 – 20 ఫిబ్రవరి, 1964 వరకు మొత్తం 719 రోజులు
కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి
20 సెప్టెంబర్, 1982 – 9 జనవరి,1983వరకు
111 రోజులు
ఎన్. టి. రామారావు
9 జనవరి,1983 – 16 ఆగస్టు, 1984 వరకు 585 రోజులు
రెండో సారి ఎన్. టి. రామారావు 16 సెప్టెంబర్, 1984 – 2 డిసెంబర్, 1989వరకు 1903 రోజులు
రెండోసారి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి 9 అక్టోబర్, 1992 – 12 డిసెంబర్, 1994 వరకు 794 రోజులు మూడోసారి
ఎన్. టి. రామారావు 12 డిసెంబర్, 1994 – 1 సెప్టెంబర్, 1995 వరకు 263 రోజులు
నారా చంద్రబాబు నాయుడు 1 సెప్టెంబర్, 1995- 14 మే, 2004వరకు 3178 రోజులు
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 14 మే, 2004- 2 సెప్టెంబర్, 2009వరకు 1938 రోజులు
ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి 25 నవంబర్, 2010 – 1 మార్చి, 2014 వరకు 1193 రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గా
నారా చంద్రబాబు నాయుడు 8 జూన్, 2014 – 29 మే, 2019 వరకు 1816 రోజులుపాలించారు.
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 30 మే, 2019 నుంచి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.
గతంలో జరిగిన అన్యాయాలను కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ మైనా సరి చేయాల్సిన అవసరం ఉంది.
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో 26వరోజ గుత్తి లో ప్రసంగం లో ఆయన చెప్పిన మాట ఇప్పుడు గుర్తుచేస్తునాం. అధికారం చేపట్టారు కావున చేయాల్సిన బాధ్యత మీపై ఉంది.
అనంతపురం జిల్లాలో కరువును తరిమివేయడం అసాధ్యమేమీ కాదు. ఆ లక్ష్యంతోనే నాన్నగారు హంద్రీ-నీవాతో సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్టుల పనులు అత్యధిక శాతం పూర్తయ్యాయి. అయితే మిగిలిన పనులను పూర్తిచేసి, ఈ ప్రాంతానికి నీరందించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికే దాదాపు పూర్తయిన హంద్రీ-నీవా మొదటి దశ ఆయకట్టు ప్రాంతంలో పిల్లకాలువలు తవ్వితే ఈ జిల్లాలో 1,18,800 ఎకరాలకు నీరు అందించి, జిల్లాను సస్యశ్యామలం చెయ్యవచ్చు. ఈ విషయం నేను గత ఎన్నికల అనంతరం అనంతపురంలో జరిగిన రైతు ధర్నాలో చెప్పాను. అయితే ఆ దిశగా ఇంతవరకూ ఏ చర్యలూ లేవు. కానీ ఈ ప్రభుత్వం అటువంటి శాశ్వత కరువు నివారణ చర్యలపై దృష్టి సారించకుండా, రెయిన్ గన్స్ వంటి ఏ ప్రయోజనమూ లేని పరిష్కారాలను ముందుకు తెచ్చింది.
మరి జగన్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న ఆదిశగా అడుగులు వేయలేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత)