కదిరి ప్రాంతంలో 30వేల ఎకరాల్లో పంటలు పండించే మార్గముంది, పట్టించుకోరేం?

( చందమూరి నరసింహారెడ్డి)
కరుకు కరువుకు ఆలవాలము రాయలసీమ జిల్లాలు .ఇక్కడ నిత్యం కరువు సర్వసాధారణమే . రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా .అందువల్లనే ఈ జిల్లాలో కరువు నివారణ పథకం ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
నెర్రెలు బారిన నేలలు బీటలు వారిన బతుకులు అనంతపురం జిల్లా వాసులది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూవస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. నెర్రెలుబారిన నేలలులో పచ్చని పంట పొలాలు పండుతాయి బీటలు వారిన బతుకుల్లో ఆశలు చిగురిస్తాయి. హంద్రీనీవా కు పూర్తి సామర్థ్యం తో నీటిని అందిస్తే రాయలసీమ లో కొద్దోగొప్పో మేలు జరుగుతుంది.
పూర్తి స్థాయిలో రాయలసీమ అభివృద్ధి జరగాలంటే 4జిల్లాలకు 600 టి.యం.సిలు నికరజలాలు కేటాయించి నీటినిల్వ సామర్థ్యం పటిష్టం చేయగలిగితే పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించవచ్చు.
వర్షాధారమైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరు అందించాలని హంద్రీనీవా పథకంకు రూపకల్పన చేశారు.
శ్రీశైలం నుంచి 40 టీఎంసీల వరద జలాలను తరలించి 33 లక్షల మందికి తాగునీరు, 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టులో మొత్తం 8 రిజర్వాయర్లు, 4 బ్రాంచ్ కెనాల్స్, 3 డిస్ట్రిబ్యూటరీలు, 43 పంప్ హౌజులు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులో 13 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఫేజ్-1లో 9 చోట్ల 291.83 మీటర్ల ఎత్తుకు, ఫేజ్-2లో 4 చోట్ల 369.83 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోస్తారు.
2018-19లో2019-2020లో హంద్రీనీవా ద్వారా కొంత వరకు నీటిని అందించారు.
రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు దాటి, కృష్ణా జలాలు.. చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశించాయి.హంద్రీ నీవాలో భాగంగా కర్నూలు జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల నుండి అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా చిత్తూరు జిల్లాలోని కుప్పంకు చేరాయి.
అయితే హంద్రీనీవా కాలువకు ఉపకాలువలు నిర్మించి అనంతపురంజిల్లా లోని కదిరి,ధర్మవరం నియోజకవర్గంలోని మూడు ప్రాజెక్టులను నీటితో నింపితే ప్రత్యక్షంగా 16వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.
పరోక్షంగా భూగర్భజలాలు పెరగడంతో మరో 15వేల ఎకరాలకు నీరు లబిస్తుంది. ఎందుకు ఈదిశ గా ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయడం లేదు?
Maddileru Project
ముదిగుబ్బ మండలం మలకవేముల సమీపంలో మద్దిలేరు వాగు కు నీరు వదిలితే గ్రావిటీ పద్దతిలో మద్దిలేరు ప్రాజెక్టు కు నీరు చేరుతుంది. పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ముందుచూపు కొరవడటం వల్ల ,నిర్లక్ష్యం వల్ల , ప్రశ్నించే జనంలేకపోవడం , పట్టించుకొనే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో మద్దిలేరు ప్రాజెక్టుకు కృష్ణా జలాల చేరడంలేదు.
అనంతపురము జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో యోగివేమన రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద 13వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణముంది. ప్రధానంగా వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి ఈ పంటలనుపండిస్తారు. ఈ ప్రాజెక్టు మీద సుమారు 30 గ్రామాలు రైతులు ఆధారపడ్డారు ఈ గ్రామాలకు మద్దిలేరు ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంది.మద్ది లేరు ప్రాజెక్టులో 0.7 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచ వచ్చు .ప్రాజెక్టు కింద కుడికాలువ20 కిలోమీటర్లు ఎడమ కాలువ21 కిలోమీటర్లు నిర్మించారు. కుడి కాలువ కింద 8500 ఎకరాలు ఎడమ కాలువ కింద 7500 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాలువ నిర్మాణ పనులు పూర్తి చేశారు.
కదిరి నియోజక వర్గంలో పెడబల్లి రిజర్వాయర్‌ ఉంది.
తనకల్లు మండలం దిగువతొట్లిపల్లి వద్ద 20నుంచి30 లక్షల రూపాయలు ఖర్చు చేసి గేట్లను నిర్మించి పాపాగ్ని నదిలో కి నీరువదిలితే పెడబల్లి ప్రాజెక్టును నీటీతో నింపుకోవచ్చు. పాపాగ్ని నదీ తీరం వెంబడి 30కిపైగా గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా తాగునీటి సమస్య లేకుండా చేయవచ్చు.
Pedaballi Project
నంబులపూలకుంట మండలంలో పెడబల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ కింద 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. పిల్ల కాలువ నిర్మాణం కూడా పూర్తి అయ్యింది .ఈ రిజర్వాయర్ నిండితే పరోక్షంగా భూగర్భ జలాలు పెరిగి మరో పదిహేను వందల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 20 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చవచ్చు.
కదిరి నియోజకవర్గంలో మరో ప్రాజెక్టు తనకల్లు మండలంలో చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు ఉంది. తనకల్లు మండలంలో పాపాగ్ని నదిపై చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.తనకల్లు మండలం మొగిలి చెట్ల తాండా సమీపంలో కోటి 50 లక్షల రూపాయల ఖర్చుతో ఒక చిన్న కాలువ నిర్మిస్తే అక్కడి నుండి సిజీ ప్రాజెక్టుకు నీటిని నింపవచ్చు. కర్నాటక ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా మీదుగా పాపాగ్ని నది ప్రవహిస్తుంది. చెన్నరాయస్వామిగుడి ప్రాజెక్టు కింద 1000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. దీని కింద ప్రధానంగా వేరుశనగ, వరి పంటలను సాగు చేస్తారు. ఈ ప్రాజెక్టు హంద్రీ-నీవా నీరు చేరితే పరోక్షంగా భూగర్భ జలాలు పెరిగి మరో వెయ్యి ఎకరాలు సాగులోకి వస్తాయి .అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కింద ఉన్న ముప్పై గ్రామాలలో సాగు తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చు.

అదే విధంగా కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి .వీటికి నీరు నింపితే ప్రత్యక్షంగా ,పరోక్షంగా చాలా గ్రామాలలో వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది .కొన్ని కొన్ని చోట్ల గ్రావిటీ పద్ధతిలోనే తక్కువ ఖర్చుతో చెరువులను నీటితో నింపే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారులు ప్రజా ప్రతినిధులు, సామాజిక వేత్తలు, చైతన్యవంతులు సమిష్టిగా కృషిచేసి ఏ ప్రాంతంలో తక్కువ ఖర్చుతో గ్రావిటీ పద్ధతిలో చెరువులకు నీరు అందించవచ్చో ఆ ప్రాంతాలను గుర్తించి తక్షణమే నీటిని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఏడాది రాయలసీమలో చాలా ప్రాంతాలలో విస్తారమైన వర్షాలు కురవడంతో చాలా వరకు చెరువులు నిండాయి. అయితే ఈ ఏడాది కూడా కదిరి ప్రాంతంలోని మూడు ప్రాజెక్టులు మరియు చాలా చెరువులుకు నీరు రాలేదు చెరువులు నిండే అంత వర్షపాతం నమోదు కాలేదు. అంత తీవ్ర దుర్భిక్షం ప్రాంతం కదిరి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలోని ప్రాజెక్టులను నీటితో నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లాలో 100 ఎకరాలు పైబడి 305 చెరువులు ఉన్నాయి.వీటి కింద 89,991 ఎకరాలు సాగు అవుతుంది.100 ఎకరాలు లోపు 959 చెరువులు ఉన్నాయి.వీటికింద 28,405 ఎకరాలు సాగుభూమి ఉంది. ఈచెరువులు నింపగలిగితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది.
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత)