వైసిపి ఎమ్మెల్యే పిన్నెళ్లి కారుపై రాళ్ల దాడి

రాజధానిని విశాఖకు తరలించేందుకు ఒక వైపు ప్రభుత్వంలో చర్చలు మొదలయ్యాయి. జనవరి నెలాఖరునుంచి తరలింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా వినబడుతూ ఉంది. మరొక వైపు అమరావతి రైతులు   ‘సేవ్ అమరావతి’ ఆందోళనను  ఉధృతం చేస్తున్నారు. పెద్ద యువకులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్  సచివాలయంలో సమావేశానికి వెళుతున్న సీఎం జగన్‌కు అమరావతి ప్రాంత రైతులు నిరసన తెలిపారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకు రైతులు ఆగ్రహం మళ్లించారు.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద  రైతులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు. దీనితో ట్రాఫిక్ జామ్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు రాస్తారోకోలో చిక్కుకుంది. కారు  ముందు రైతులు ఆందోళనకు దిగారు. కారు ముందు బైఠాయించి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిని వైసిపి హత్యా యత్నంగా వర్ణించింది. రైతుల ముసుగులో టిడిపి నాయకులే ఈ దాడి చేశారని పార్టీ ట్వీట్ చేసింది.