మేడా ఎంట్రీతో కడప వైసీపీలో కలవరం

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి ఎప్పటి నుండో వైసీపీలో చేరతారంటూ విస్తృతంగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఆయన వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 31 న వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం తన వర్గీయులతో సుండుపల్లెలోని ఎల్లయ్య కల్యాణ మండపంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 31 న తన వర్గీయులంతా వైసీపీలో చేరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన పార్టీ మారుతున్న సందర్భంగా నాయకులు మారినప్పుడల్లా చెప్పే మాటలే ఈయన కూడా చెప్పేశారు. రొటీనే అయినా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఎంతో మానసిక క్షోభకు గురి చేసారు. వైసీపీ తరపున రాజంపేటలో ఎవరికి టికెట్ కేటాయించినా అందరిని కలుపుకుని గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో జగన్ ను సీఎం గా చూడటమే తన లక్ష్యమని మేడా వివరించారు. ఈయన మాటలు ఇలా ఉంటె స్థానికంగా ఉన్న వైసీపీ సీనియర్ లీడర్ల వాదన మరోలా ఉంది.

మేడా పార్టీలో చేరడంపై హైకమాండ్ ఆనందం వ్యక్తం చేస్తున్నా రాజంపేట వైసీపీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి సోమవారం గొల్లపల్లిలో తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు వైసీపీ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. రాజంపేట టికెట్ మేడాకే కేటాయిస్తున్నట్టు టాక్ నడుస్తుండటం వారిలో అసంతృప్తి జ్వాలలను రగిల్చింది.

పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచి ముందుకు నడిపించిన తమ నాయకుడు ఆకేపాటి కాకుండా కొత్తగా వచ్చిన మెడకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని తేల్చి చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆకేపాటి విషయంలో అన్యాయం చేయరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెద్ద పదవులు వద్దని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి చేరవేసిన ఆయన తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, వైసీపీకి తన వర్గీయుల మద్దతు ఉండదని హెచ్చరించినట్లు సమాచారం.

నిజానికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసారు. ఆయనను కాదని కొత్తగా వచ్చిన మేడాకు టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదని పలువురు వైసీపీ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆకేపాటి మద్దతు కోల్పోతే రాజంపేటలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందంటున్నారు. మొదటి నుండి పార్టీ కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడం సమంజసం కాదంటున్నారు. జగన్ కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారని, టికెట్ కేటాయించే విషయంలో సీనియర్ నేతలను, పార్టీ కోసం కష్టపడినవారిని దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రజల్లో అధిష్టానం నిర్ణయాలు వ్యతిరేక ఇమేజ్ ను తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు అని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *