తిరుపతి వారధి ప్రమాదంపై ఐఐటి నిపుణుల చేత దర్యాప్తు: నవీన్ డిమాండ్

తిరుపతి పట్టణంలో ఈ రోజు కూలి పోయిన గరుడ వారధి (ఫ్లైవోవర్) పనులలో  నాణ్యతా ప్రమాణాలపైనా, అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపైనా  చెన్నై “ఐఐటి” నిపుణుల ద్వారా విచారణ చేపట్టాలని తిరుపతి యాక్టివిస్టు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం పట్ల దేవుడి దయే నంటూ ఈ ప్రాజక్టుకు ను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకొనకపోవడంపట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ప్రాజక్టు ఎగ్జిక్యూషన్ తీరు ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు.

కరోనా కారణంగా కొన్ని నెలలపాటు పూర్తిగా పనులు నిలిపివేశారు, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కొన్ని నెలలు నిలపివేసింది. టీటీడీ ధర్మకర్తల మండలి గరుడ వారధి ఫ్లై ఓవర్ ను మరింత పొడిగించాలని కొన్ని నెలలు నిలపివేశారు.

ఈ అవాంతరాలతో  తిరుమల బైపాస్ రోడ్ లో తిరుమలకు వెళ్ళే యాత్రికులు, స్థానికులు వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయని నవీన్ ఈ రోజు ప్రమాదం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

అందుకే ఈ నిర్మాణం నాణ్యత మీద సమగ్రంగా ఐఐటి నిపుణులతోచేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల,తిరుపతి ప్రజల సౌకర్యార్థం 2 సంవత్సరాల క్రితం టీటీడీ,నగరపాలక సంస్థ,స్మార్ట్ సిటీ సంయుక్త నిర్వహణలో ఆఫ్కాన్ సంస్థ తిరుమల బైపాస్ రోడ్ గరుడ వారధి పనులు చేపట్టింది. అయితే,  ఫ్లై ఓవర్ పనులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

టీటీడీ 65% నగరపాలక సంస్థ,స్మార్ట్ సిటీ 35% నిధులతో సుమారు 750 కోట్ల గరుడ వారధి పనులు 2021 మార్చి నాటికి పూర్తిచేయాలని ఒప్పంధం ఉన్నా ఫ్లైఓవర్ పనులకు”గ్రహణం” పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు.

టీటీడీ నేటి వరకు చిల్లిగవ్వ కూడా గరుడ వారధి పనులకు కేటాయించకపోవడం ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  స్థానికుడుగా తాను అనేక పర్యాయాలు హెచ్చరించినా ఫలితం లేదని, దీనితో  యాత్రికులతో పాటు స్థానికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
తిరుపతిలో మొట్ట మొదటి సారి అతి భారీ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు అటువైపు వెళ్లే వాహనాలను పూర్తిగా వేరొక మార్గం వైపుకు మళ్లించి పనులు చేపట్టాలి అలా కాకుండా భారీ “క్రేన్” లతో భారీ “సిమెంట్ స్లాబ్” లతో పనులు జరుగుతున్న సమయంలో కూడా మరోపక్క వాహనాలను అనుమతించడం అత్యంత ప్రమాదకరం! ఈ రోజు ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం లేకపోవడం అదృష్టమే అన్నారు.

శ్రీవారి భక్తుల,స్థానికుల,ఫ్లైఓవర్ పనులు చేస్తున్న కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి భద్రతలో భాగంగా ఎటువంటి ముందస్తు సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం!

గరుడ వారధి ఫ్లైఓవర్ పనులకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకొని మానవ తప్పిదాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ సమన్వయంతో సకాలంలో పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *