తెలంగాణ సర్కారుకు మరో షాక్.. ప్రకాష్ రెడ్డి రాజీనామా

తెలంగాణ సర్కారుకు మరో షాక్ తగిలింది. తెలంగాణ అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పంపారు.

గత కొంతకాలంగా తెలంగాణ సర్కారుకు, ఎజి ప్రకాష్ రెడ్డికి మధ్య సయోధ్య లేదన్న టాక్ నడుస్తోంది. సర్కారు తీరు పట్ల ప్రకాష్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనను పొమ్మనలేక పొగ పెడుతున్నారన్న విమర్శ కూడా న్యాయవాదుల నుంచి వినబడుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఆకస్మికంగా రాజీనామా చేయడం న్యాయ వర్గాలతోపాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే రామకృష్ణారెడ్డి తొలి అడ్వొకెట్ జనరల్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఎనిమిది నెలల క్రితం ప్రకాశ్ రెడ్డి ఎజి గా నియమితులయ్యారు. అయితే గత కొంతకాలంగా ఎజి కి సర్కారుకు మధ్య అంతరం పెరిగినట్లు చెబుతున్నారు. పలు కేసుల్లో సర్కారుకు కోర్టుల్లో ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చినట్లు సర్కారు భావిస్తోందని చెబుతున్నారు.

ఇటీవల ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు విషయంలో ఎజి ప్రకాశ్ రెడ్డి పట్ల సర్కారు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. హైకోర్టులో ఈ కేసు వాదన సందర్భంగా అసెంబ్లీలో జరిగిన వీడియో పుటేజి ఇస్తానని కోర్టుకు ఎజి తెలిపారు. ఆ వీడియో పుటేజి ఇస్తామని అంగీకరించడం పట్ల సర్కారు ఆగ్రహంగా ఉన్నట్లు న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ పుటేజీ కోర్టుకు ఇస్తామని చెప్పడం పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. అందుకే ప్రకాష్ రెడ్డికి తెలియకుండానే ఈ కేసును వాదించేందుకు కొత్త అడ్వొకెట్ల అన్వేషణలో సర్కారు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి పేరు మోసిన సీనియర్ అడ్వొకెట్ హరీష్ సాల్వేను ఈ కేసును వాదించేందుకు తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రకాష్ రెడ్డి మనస్థాపంతోనే తన పదవి నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆయన తాను ఎందుకు రాజీనామా చేసిందీ.. ప్రకాష్ రెడ్డి నోరు విప్పితే కానీ మరిన్ని వివరాలు తెలిసే చాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *