Home Breaking కేంద్ర బృందం పర్యటన కంటితుడుపు చర్య: డా. దాసోజు శ్రవణ్

కేంద్ర బృందం పర్యటన కంటితుడుపు చర్య: డా. దాసోజు శ్రవణ్

176
0

సీఎం కేసీఆర్ కి   ఫాం హౌస్ లో

చెట్లపై వున్న ప్రేమ వరదల్లో సర్వం

కోల్పోయిన ప్రజలపై లేదు: దాసోజు

 

”తెలంగాణ రాష్ట్రానికి, గ్రేటర్ హైదరాబాద్ కి వరదల వలన కలిగిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వస్తుందంటే చాలా సంతోష పడ్డాం. కేంద్ర బృందం వచ్చి ప్రజల కష్టాలని తెలుసుకొని వారికి సరైన న్యాయం చేస్తుందని భావించాం. కానీ కేంద్ర బృందం ఉత్సవ విగ్రహాల్లా, అదీ సీఎం కేసీఆర్ కట్టిన పల్లకీలో ఊరేగి, తిరిగి గర్భగుడికి వెళ్లిపోయినట్లు ఢిల్లీ వెళ్ళిపోయింది” అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
ఈ రోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బృందం..వరద బాదితులని కలవలేదు. ప్రజలకు జరిగిన నష్టాన్ని గుర్తించలేదు. గ్రేటర్ హైదరాబద్ తో సాహ తెలంగాణ రాష్ట్రం వరదల్లో మునిగిపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. కేవలం రెండు రోజులు.. ఒక వెకేషన్ కి వచ్చినట్లు ఏసీ గదులు, కార్లలో కూర్చోని అధికారులని కలసి తూతూ మంత్రంగా కేంద్ర బృందం వ్యవహరించిన తీరు శోచనీయం. ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ ఇద్దరూ ప్రజలని మోసం చేస్తున్నారు” అని మండిపడ్డారు.
”మాకు స్పష్టమైన సమాచారం వుంది. కేవలం హైదరాబాద్ లోనే దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు వరదల కారణంగా నష్టపోయారు. ఎవరికీ ఎలాంటి సాయం అందలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అందరినీ ఆదుకున్నామని అధికారులతో చెప్పిస్తుంది. ఆ అధికారులు అంతా బావుందని కేంద్ర బృందానికి చెప్పారు. వారు చప్పట్లు కొట్టి రాసుకొని వెళ్ళిపోయారు. కేంద్ర కమిటీని సూటిగా అడుగుతున్నా .. ఇలాంటి డ్రామాల కోసమే ఇక్కడి వచ్చారా ? లేదా నిజమైన బాధితుల గోడు తెలుసుకోవలాని వచ్చారా ? అని నిలదీశారు.
”కేంద్ర బృందం వచ్చింది వరద బాదితుల కష్టాలు తెలుసుకోవడానికి. కానీ వున్నది తాజ్ డెక్కన్ లో. కేంద్ర కమీటీ పర్యటన కేవలం కంటితుడుపు చర్య. భారీ వర్షాలు సహజం. కానీ హైదరాబాద్ మునిగిపోవడానికి కేసీఆర్ అసమర్ధత కారణం. అక్రమ కట్టడాలు తొలగించి వుంటే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో వరదలు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఇలాంటి అక్రమాలని ప్రోత్సహించిన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ రాసుకెళ్ళడానికి కేంద్ర కమిటీ ఇక్కడికి రావడం అంటే కంటితుడుపు చర్యకాకపోతే మరేంటి ? అని మండిపడ్డారు.
”సీఎం కేసీఆర్ కి తన ఫాం హౌస్ లో చెట్ల మీద వున్న ప్రేమ వరదల్లో బాధ పడుతున్న ప్రజల మీద లేదు. భారీ వర్షాలకు తన ఫామ్ హౌస్ లో కలిగిన పంటనష్టంపై వున్న ఆవేదన .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు కలిగిన నష్టం మీద లేదు. కేసీఆర్ ఇంట్లో కూర్చొని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. అలాంటి లెక్కలు కేంద్ర కమిటీ రాసుకుంటే తెలంగాణ, గ్రేటర్ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వారౌతారు”అని అన్నారు.
”దాదాపు యాబై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వీళ్ళు అంచనా వేసింది రూ. 8633కోట్లు. ఏం లెక్కలివి.? ఏం అంచనా ఇది.? కేసీఆర్ ఇంట్లో కూర్చొని లెక్కలు రాస్తారా ? మాకున్న ప్రాతిపదిక అంచనా ప్రకారం.. పంట నష్టపరిహారం చెల్లించాలంటే కనీసం 10వేల కోట్ల రూపాయి లు కావాలి”అన్నారు.
”హైదరాబాద్ విషయానికి వస్తే 567కోట్ల రుపాయిలు ఇచ్చామని చెబుతున్నారు. ఇది పక్కా మోసం. ఇందులో రూ. 83 కోట్లు స్టారం వాటర్ డ్రైనేజీ పునరుద్దరణకి రూ. 54కోట్లు చెరువుల పునరుద్దరణకి. 300చెరువులు కబ్జాకి గురైపోయాయి. ఎగ్జిట్ తూములు లేవు. వీటిని పునరుద్దరణకి 54కోట్లు సరిపోతాయని చెప్పడం వెనుక ప్రభుత్వ మోసం బయటపడింది. 28 వేల అక్రమ కట్టడాలు తొలగించడానికి 12వేల కోట్ల రూపాయిలు కావాలని ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు 500వందల కోట్లు ఇచ్చేశాం అంతా బాగు చేసేశామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో 300చెరువులు కబ్జాకి గురయ్యాయి. ఇందులో చాలా వాటిల్లో టీఆర్ఎస్ నాయకులు, వారి మిత్ర పక్షాల నాయకుల కబ్జాలోనే వున్నాయి. బండ్లగూడలోని సల్కం చెరువు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కబ్జాకి గురైయింది. అందులో ఒవైసీ స్కూల్ అఫ్ ఎక్స్ లెన్స్ వెలసింది. దానిపై చర్యలు తీసుకునే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్ కి వుందా ? అని సవాల్ చేశారు.
”ఇంకో పెద్ద మోసం 59 కోట్ల రూపాయిలు బ్లాక్ టాప్ రోడ్ల రిపేర్లు కోసం కేటాయించారు. 370కోట్లు సీసీ రోడ్ల రిపేర్ల కోసం కేటాయించారు. ఎంత వరద వచ్చినా సిసి రోడ్లు నష్టపోవు. కానీ దీనికి 370కోట్లు ఇచ్చారంటే ఇందులో కమీషన్లు దండుకొని ఆ డబ్బు మళ్ళీ GHMC ఎన్నికల్లో పెట్టాలనే ప్లాను” అని ఆరోపించారు.
ఈ వివరాలన్నీ కూడా ఒక బహిరంగ లేఖలో రాశాం. కేంద్ర కమిటీని కలవాలని ప్రయత్నించాం. ఛీఫ్ సెక్రటరినీ అపాయింట్మెంట్ అడిగాం. కేంద్ర కమిటీలో ప్రధాన సభ్యులు ప్రవీణ్ వశిష్ట గారికి మెయిల్ కూడా పెట్టాం. దానికి కూడా సమాధానం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటే కనీస స్పందన లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు.
”ఇక సందట్లో సడేమియా అన్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల తీరు వుంది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయిలు చెక్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేటీఆర్ మొదటి రోజు చెక్ ఇస్తున్నట్లు ఫోటో దిగారు. తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ లీడర్లు క్యాష్ పట్టుకున్నారు. బాదితులకు కాకుండా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులు పంచుతున్నారు. ఇది దారుణం. వాస్తవానికి నష్టపోయిన ప్రతి ఇంటికి డబ్బులివ్వాలి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అభిమానులని ఎంపిక చేసి డబ్బు పంచుతున్నారు. ప్రభుత్వ సొమ్ముని పార్టీ కోసం వాడుతున్నారు. గులాబి కండువా కప్పుకొని ఇలా ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా పంచే అధికారం ఎవరు ఇచ్చారు ? కేసీఆర్, కేటీఆర్, తలసాని.. వాళ్ళ ఇంట్లో నుండి డబ్బు ఇస్తున్నారా ? బాదితులకు కాకుండా టీఆర్ఎస్ అభిమానులకు డబ్బులు ఇవ్వడం ఏంటి ? టీఆర్ఎస్ నాయకులు కాకుండా, జీహెచ్ఏంసీ అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వ అధికారులు కానీ ఈ చెక్కులు పంపిణీ చేయాలి. మొదటి రోజు పది వేల రూపాయిల చెక్ ఇచ్చి తర్వాత రోజు నుండి రూ2000, రూ. 3000 ఇష్టం వచ్చినట్లు క్యాష్ ఇస్తున్నారు. దీనిపై ప్రజలు కూడా ప్రశ్నించాలని కోరుతున్నా” అని విజ్ఞప్తి చేశారు.
”తెలంగాణ వరదలని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రాణం కోల్పోయిన వారికి 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కూలిపోయిన ప్రతి ఇంటికి 5లక్షల రూపాయిలు, పాక్షికంగా దెబ్బ తిన్న ఇంటికి 2 లక్షల రూపాయిలు, ఇంట్లో సామాగ్రి నష్టపోయిన వారికి 50 వేల రూపాయిలు ఇవ్వాలి. 200 పైగా పశువులు ప్రాణం కోల్పోయాయి. దీని గురించి ఎవరూ మాట్లాడాటం లేదు. వాటి నష్ట పరిహారం కూడా చెల్లించాలి. పంట నష్టం కింద ప్రతి ఎకరాకి 20వేల రూపాయిలు చెల్లించాలి”’ అని ఆయన డిమాండ్ చేశారు.