తెలంగాణ ప్రైవేటు ఆసుపత్రులో కరోనాకు ఉచిత చికిత్స : సమాజ్ వాది పార్టీ డిమాండ్

కరోనా రోగం అంతమయ్యే వరకు రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రైవేటు హాస్పిటల్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా పేషంట్లకు ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ సమాజ్ వాది పార్టీ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, ప్రయివేటు ఆసుప్రతులలో విపరీతంగా ఫీజు వసూలు చేస్తూ ఉండటం, గాంధీ ఆసుపత్రిలో రోగులకు సరైన చికిత్స అందకపోతూ ఉండటం లేదని రోజూ మీడియాా రిపోర్టు చేస్తూ ఉంది.
తెలంగాణలో గత 24 గంటలలో 1924 కొరొనా పాజిటివ్ కేసులు  11 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్ 324కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 29836 చేరింది. మొత్తంగా 11933 కరోనా రోగులు వివిధ ఆసుప్రతులలో చికిత్సపొందుతున్నారు. ఒక్క జిహెచ్ ఎంసి నుంచే 1590 కొత్త కేసులు నిన్ననమోదయ్యాయి. రంగారెడ్డి  జిల్లాలో 99 కేసులు కనిపించాయి.
ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యదర్శి అక్కల బాబూ గౌడ్ ఈ ప్రకటన చేస్తూ రాష్ట్రంలో విపత్కర తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం సచివాలయం కూల్చివేసే పనిలో పడింది తప్ప ఆ భవాలను తాత్కాలిక ఆసుప్రతిగా మార్చి రోగులకు ఉచితంగా మంచి చికిత్స ఇవ్వాలనుకోక పోవడాన్ని బాబూ గౌడ్ నిరసించారు.
అక్కల బాబూ గౌడ్
ఆయన చేసిన ప్రకటన లో ముఖ్యాంశాలు:
మనుషులు చస్తుంటే శవాలమీద లక్షల్లో బిల్లులు వేసి అందినకాడికి దోచుకోమని పాలకులు అనుమతి ఇవ్వడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇది చాలా దురదుష్టకరం.
ప్రైవేటు హాస్పిటల్ లో వేసే లక్షల బిల్లులు చూసి పేషంట్లు కరోనా రోగ తీవ్రత కన్నా ముందే వణికిపోయి చనిపోతున్నారు. కరోనా పేషంట్లకు బెడ్లు దొరక్క నానాపాట్లు పడుతుంటే మంచి కండీషన్ లో వున్న సచివాలయాన్ని కూల్చడం ముదిరిన మూర్ఖత్వంగా భావించాలి.
ప్రజల ప్రాణాలపై ఏమాత్రం బాధ్యత, కనీస సానుభూతి వున్న ఏ పాలకుడైనా కూల్చే సచివాలయాన్ని తాత్కాలిక హాస్పిటల్ గా మార్చి కరోనా పేషంట్లకు వైద్యం అందించేవారు.
ఈ కరోనా విపత్కర పరిస్ఠితిలో 3 లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద మోపి వేల కోట్లు వడ్డీలు కట్టుకుంటున్న ఈరోజుల్లో కొత్త సచివాలయం అవసరమా? ప్రజల ప్రాణాలు కాపాడే హాస్పటల్ ముఖ్యమా ?
ఇప్పటికైనా ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్ఠులు, ఉద్యోగులు అందరూ ఆలోచించాలి. గడిచిన ఆరేండ్లలో పాత పదిజిల్లాలలో కనీసం జిల్లా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి వుండుంటే ఈనాడు ప్రజల ప్రా ణాలు గాలిలో కలిసి పోయేవికావు. ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కరోనా రోగ నివారణకు ప్రభుత్వం పూర్తి భాధ్యత చేపట్టాలని డిమాండు చేయాల్సిన అవసరం వుంది.
కూల్చుతున్న సచివాలయాన్ని తక్షణమే నిలిపివేసి కోవిడ్ హాస్పిటల్ గా ఉపయోగించాలని సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది.
ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యానికి బడ్జెట్ లో కనీసం 15% నిధులను కెటాయించాలి. ప్రతి నియోజక వర్గంలో ఒక వంద పడకల హాస్పిటల్ ను అన్ని రోగాల స్పెషలిస్టు డాక్టర్సుతో, సరియైన మౌలిక సదుపాయాలతో నిర్మించాలని సమాజ్ వాదిపార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇది ఇలా ఉంటే, పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రికూడా  కరోనా విషయంలో తెలంగాణప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. గవర్నమెంట్ దగ్గిర  కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమయిన పథకమేమీ లేదని వ్యాఖనిస్తూ ప్రభుత్వ ధోరణినిని ట్విట్టర్లో ఖండించారు.