తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలి: వంశీచంద్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత 15 సంవత్సరాలుగా గ్రామాలలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ చేపట్టి కోట్లాది మందికి ఉపాధి పనులు కల్పించిన దాదాపు 7700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా తొలగగించడాన్ని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి తప్పుబట్టారు.
కేసీఆర్, రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత వొదిలి, ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని, ఇది ఉద్యోగస్తుల, నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు.
కరోనా విపత్తులో ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలే కాక మిషన్ భగీరథ పథకంలో పనిచేసే ఇంగినీర్లను ఇతర శాఖలోని ఉద్యోగస్టులను కూడా ఏమాత్రం కనికరం లేకుండా తొలగిస్తున్నారని, ఇందుకేనా మనం తెలంగాణ సాదించుకున్నదని ప్రశ్నించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శులకు బదిలీ చేస్తూ, తగు శిక్షణ అందించాలని, ఇట్టి శిక్షణ ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేయాలని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ జులై 27న Lr.No.4779/EGS/PM(PI)/2013 ద్వారా ఆదేశాలు జారిచేయడాన్ని తప్పుబట్టారు.
ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్న పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం మోపడం ప్రభుత్వం చేస్తున్న శ్రమదోపిడీ అని అభివర్ణించారు.
అన్యాయంగా తొలగించిన దాదాపు 7700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే పునర్నియమించాలని, తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న పంచాయతీ మరియు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు తీర్చాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.