నవంబర్ 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఎందుకో తెలుసా?

(పి. ప్రసాద్ (పీపీ), కే. పొలారి)
నాణేనికి ఒకవైపు మాత్రమే చూస్తే లేబర్ కోడ్లు ఉనికిలోకి వచ్చిన తర్వాత తలెత్తే రేపటి దృశ్యం ఒకరకంగా కనిపిస్తుంది.
రెండోవైపు కూడా తరిచి చూస్తే, అది మరోరకంగా కనిపిస్తుంది. సార్వత్రిక సమ్మె నిర్వాహణలో మునిగి వున్న కార్మిక సంఘాల నాయకత్వ శ్రేణుల్లో ఈ రెండు రకాలదృశ్యాల పట్ల కూడా తగు స్పష్టత ఉండాలి. ముఖ్యంగా శ్రామిక వర్గ విప్లవ సంస్థలకు సైద్ధాంతిక రాజకీయ స్పష్టత వుండాలి. ఒకవేళ అది లోపిస్తే రేపటి ఆచరణలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం వుంటుంది.
తాజా సార్వత్రిక సమ్మె వల్ల డిమాండ్లకు తక్షణ ఉపశమనం కలుగుతుందనే ఆశతో పాల్గొనే సాధారణ కార్మికవర్గంలో అంతిమంగా పెను నిరాశను నింపవచ్చును. అందుకే దీనిపై ఒక రాజకీయ స్పష్టత అవసరం అవుతుంది.
మోడీ షా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్ల తర్వాత ఏర్పడబోయే రేపటి కొత్త ప్రతికూల పరిస్తితి భారత కార్మిక వర్గానికీ నూరేళ్ల క్రితం బ్రిటీష్ పాలన కాలం కంటే ఎక్కువ ప్రమాదకరమైనదిగా పైన పేర్కొనడం జరిగింది. అది నిజానికి ఉపరితల దృశ్యం మాత్రమే. అది పాక్షిక పరిశీలన ద్వారా వెల్లడయ్యే పాక్షిక సత్యం మాత్రమే. అది సమగ్ర సత్యం కాదు.
కానీ సాపేక్షిక దృష్టితో చూస్తే పై “సత్యం” కూడా వెంటనే “అసత్యం”గా మారిపోతుంది. ఆ పరిస్థితిని నాణేనికి మరోవైపు నుండి నిశితంగా చూస్తే, పెట్టుబడిదారీ వర్గం లేబర్ కోడ్లు ఉనికిలోకి వచ్చిన తర్వాత అంతకంటే తీవ్ర ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోక తప్పదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది.
పైపైన చూస్తే లేబర్ కోడ్లు పెట్టుబడిదారీ వర్గానికి అధిక లాభాల పంటని పండిస్థాయి. అది నిజమే. కానీ లోలోపలికి తరిచి చూస్తే, శ్రామిక వర్గానికి వర్గ ద్వేషం, వర్గ కసి, వర్గ చైతన్యాలని సత్వరంగా రగిల్చి తద్వారా నేడు మురిసిపోయే పెట్టుబడిదారీవర్గానికి త్వరలో పెను విషాదాన్ని ఓ కానుకగా అందిస్తుందనే చారిత్రిక సత్యం అర్థమవుతుంది.
నిజానికి నేడు శ్రామికవర్గ విప్లవ సంస్థలు “బొమ్మ” వైపు మాత్రమే చూసి నిరుత్సాహ పడనక్కర లేదు. గతార్కిక దృక్కోణంతో అవి “బొరుసు” వైపు స్థితిని కూడా చూడాలి. అప్పుడు వాటి కళ్ళకు నూతన “విప్లవ పరిస్తితి” కనిపిస్తుంది.
శ్రామికవర్గ విప్లవ శక్తులకు కొత్త వస్తుగత విప్లవావకాశాలతో కూడిన భౌతిక ప్రాతిపదికని అది కళ్ళారా సాక్షాత్కరింప జేస్తుంది. అట్టి భవిష్యత్ విప్లవ సాకార దృశ్యాన్ని సరిగ్గా అవి దర్శించగలిగితే, వాటిలో విప్లవ సంకల్పాన్ని అది ద్విగుణీకృత స్థాయికి పెంచుతుంది. అవి శ్రామికొద్యమ విప్లవ పథంలో నేటికంటే రేపు మరింత ఎక్కువ పరవళ్ళు తొక్కే కొత్త భౌతిక స్థితిని ఆవిష్కరింప జేస్తుంది.
ఔను మరి! రేపటి వస్తుగత దృశ్యాన్ని గతితార్కిక దృష్టితో దర్శించ గలిగితే రానున్న కాలం గొప్పవిప్లవ ఆశావహ దృశ్యాన్ని శ్రామిక వర్గ విప్లవసంస్థల కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది. ఈకొత్త భౌతికస్థితిలో విప్లవపైరు, పంట తెగ ఏపుగా ఎదుగుతుందనే ఒక గొప్ప విశ్వాసాన్ని వాటికి కల్పిస్తుంది. నిజంగా వాటికి ఆ తాత్విక, సిద్ధాంత, రాజకీయ నిబద్ధతలు వుంటే, రేపటి కొత్త ప్రతికూల స్థితిలో తాత్కాలికంగా ఒకింత ఇబ్బంది పడే కార్మిక, శ్రామిక వర్గాల ప్రజలలో కూడా వేగంగా తదనుగుణంగా ఆత్మ విశ్వాసాన్ని అవి పెంచగలవు.
కొత్త ప్రాణాంతక కరోనా వ్యాధికి ఫార్మా లాబీ ఔషధం కనుగొనక ముందే, మానవసమాజం నేడు రాజ్య ప్రమేయం లేకుండానే తనకు తానే రోగ నిరోధక వ్యవస్థని ప్రకృతి సిద్ధంగానే పెంచుకొని, యధావిధిగా స్వీయ చలనం (మొబిలిటీ) లోకి వస్తుండటం తెల్సిందే.
మానవజాతి కి అంతటి గొప్ప సామర్ధ్యం వుంది. అది శ్రామిక వర్గానికి అంతకంటే అనేక రెట్లు వుంటుంది. అదెలాగో చూద్దాం.
ఇటు సమాజంలోనూ, అటు ప్రకృతిలోనూ ఎప్పటికప్పుడు తలెత్తే ప్రతికూల భౌతికపరిస్తితి కి అనుగుణంగా వేగంగానూ & గాఢతరంగానూ మారేగుణం మానవజాతికి వున్నట్లే, దానిలో ఒక విభాగమైన కార్మికవర్గానికీ సాపేక్షికంగా అంతకంటే అది అధికంగానే వుంటుంది.
కొత్త భౌతిక పరిస్తితి కి అనుగుణంగా సమాజంలోని ఒక రైతు, ఒక వ్యవసాయ కూలీ, ఒకవిద్యార్థి, ఒక ఉద్యోగి, ఒక మేధావి కంటే, ఒక కార్మికుడి పరివర్తనా శీలత, సామర్థ్యాలు అధికంగానూ & అదనంగానూ వుంటాయి. (ఒక మినహాయింపు వుంది. దాని పై వివరణ ఇవ్వకపోతే అపోహ కలగవచ్చు.
ఉదా:– సమాజం లో మిగిలిన అందరి కంటే విద్యార్థి ఎక్కువ స్పందిస్తాడు. కార్మికుడి కంటే సత్వర చలనం విద్యార్థి స్వంతం. ఐతే పైన పేర్కొన్న “వేగం” & “గాఢతరం” అనే రెండు ప్రాతిపదికలను గీటురాయిగా చూడాలి. “వేగం” తప్ప “గాఢత” అనే ప్రాతిపదిక విద్యార్థికి వర్తించదు. లెనిన్ పేర్కొన్న “శ్రామికవర్గం డైనమైట్ వంటిది, విద్యార్థి పాత్ర వత్తి వంటిది” అనే పోలిక ఇక్కడ గీటురాయి. “వత్తి” వత్తిగా తప్ప ఎప్పటికీ డైనమైట్ గా మారదు)
ఎంతో కొంత కార్మికులకు ఉపయోగపడ్డ లేదా వాటంతట అవే ఉపయోగపడక పోయినా, తమ పోరాటశక్తితో కార్మికవర్గం వాటిని కొంత ఉపయోగించుకో గలిగిన కార్మిక చట్టాలు ఇప్పటి వరకూ ఉనికి లో వున్నాయి. అలాంటి పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా లేబర్ కోడ్లు రేపు అమలులోకి వస్తాయి. ఫలితంగా రానున్న కాలంలో కార్మిక వర్గానికి కొన్ని అదనపు కొత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదకర స్థితి వుంటుంది. ఆ స్థితి రాదని చెప్పడం లేదు.
ఐతే నిశిత దృష్టితో చూస్తే, అట్టి కొత్త స్థితితో గుండెలు బేజారెత్తేది కార్మికవర్గం కాదు. ముఖ్యంగా పెట్టుబడిదారీ వర్గమే అలా బెజారిత్తి పొక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఐతే శ్రామికవర్గ విప్లవ సంస్థల్లో దీనిపై తగిన సైద్ధాంతిక, నిబద్దతతో కూడిన విశ్వాసం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడిదార్లతో కూడిన కార్పోరేట్ వ్యవస్థ ని గడగడ లాడించవచ్చు.
లేబర్ కోడ్లు ఉనికిలోకి వచ్చిన తర్వాత తొలి దశలో కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారీ వర్గమే భయపెడుతుంది. దాని నుండి మరింత “అదనపు విలువ” (లాభం) ని కూడా బూర్జువావర్గం కొల్లగొడుతుంది. అది నిస్సందేహంతో కూడిన చేదు నిజమే. దాన్ని కాదనడం లేదు.
ఒక్కొక్కసారి నిజంగానే శ్రామిక వర్గం బాగా భయపడి పోవచ్చు కూడా. కానీ వారికి ప్రాతినిధ్యం వహించే శ్రామికవర్గ విప్లవసంస్థలు మాత్రం ఎప్పటికీ తమ సైద్ధాంతిక, రాజకీయ విశ్వాసాలను కోల్పోరాదు.
ఒకవేళ వాటిని కోల్పోతే, చరిత్ర మాత్రం క్షమించదు. చరిత్ర క్షమించని రాజకీయ నేరానికి శ్రామిక వర్గ విప్లవ సంస్థలు పాల్పడకుండా వుండాలంటే, వాటికి చరిత్ర పరిజ్ఞానం ఉండాలి. మరీ ముఖ్యంగా, లేబర్ కోడ్లు ఉనికిలోకి వచ్చిన తర్వాత తలెట్టనున్న రేపటి పరిస్తితి పట్ల గతితార్కిక దృష్టితో కూడిన అంచనా, అవగాహనలు కూడా వుండాలి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాం.
(పి. ప్రసాద్ (పీపీ),అధ్యక్షులు; కే. పొలారి
ప్రధాన కార్యదర్శి. Indian Federation of Trade Unions:IFTU)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *