పోలీసుల అదుపులో చంద్రబాబు? : పవన్ కల్యాణ్ హెచ్చరిక

(పవన్ కల్యాణ్, అధ్యక్షులు, జనసేన)
పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణం తెరదించాలి. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ మహిళల్ని, వృద్ధుల్ని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసం కాదు.
గత రెండుమూడు రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతుల విషయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి అవకాశాలను ఇలాంటి చర్యలు దెబ్బ తీస్తాయి.
అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకొని రాజధాని విషయంపై స్పష్టత ఇవ్వాలి.