దేశ రాజకీయాలను మార్చేసిన మండల్, ఇంతకు ఎవరీ మండల్?

(వడ్డేపల్లి మల్లేశము)

భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యారంగంలో రిజర్వేషన్ లు కల్పించే విషయం మీద స్వాతంత్య్ర పోరాట కాలంలో కొంత కృషి జరిగింది. లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో అంబేద్కర్ ఈ ప్రస్తావన చేసినప్పటికీ ,సరైన మద్దతు లభించ లేదు.  తర్వాత  ఎలాగైనా  శూద్రులకు (అంటే ఓ బి సి లు) తగిన గుర్తింపు ఇవ్వాలని ఆలోచించి రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ను పొందుపరిచారు.

అప్పుడు మొదటిసారిగా వెనుకబడిన తరగతులు అనే పదాన్ని ఉపయోగించారు. ఎస్సీ ఎస్టీల మాదిరిగా వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కొందరు వ్యతిరేకించడంతో డా. అంబేద్కర్  కలతచెంది భద్రత కల్పించే విషయంలో భారత రాష్ట్రపతి చే ప్రత్యేక కమిషన్ వేసి ఆర్థిక, విద్యా, సాంస్కృతిక ,సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్న వారిని ఇతర వెనుకబడిన తరగతుల లో చేర్చి వారి జనాభా దామాషా గా విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు.

రాజ్యాంగబద్ధంగా జరిగిన కృషి

న్యాయ శాఖ మంత్రి హోదాలో ఓబిసి రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని అంబేడ్కర్ అనుకున్నప్పుడు కొందరు అడ్డుకోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీహార్లో ఓబిసి చైతన్య ర్యాలీ నిర్వహించిన ప్పుడు నెహ్రూ ప్రభుత్వం ర్యాలీ భగ్నం చేసి అంబేద్కర్ మీద రాళ్ల దాడి చేయించి అణచి వేశారు.


ఈ రోజు మండల్ జయంతి


చివరికి నెహ్రూ ప్రభుత్వం 1953 లో తలొగ్గి ఓబీసీలకు గుర్తింపు అధ్యయనం కోసం కాకా కాలేల్కర్ (kaka kalelkar) కమిషన్ను నియమించినప్పటికి, 2935 కులాలను గుర్తించి 54 లో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ దాన్ని పట్టించుకోలేదు.

బిపి మండల్ చొరవ కృషి

రాజ్యాంగంలో పొందుపరచిన 340 అధికరణ మేరకు పంతొమ్మిది వందల 78లో జనతాదళ్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పనపై రెండవ జాతీయ బీసీ కమిషన్ బిపి మండల్ అధ్యక్షతన ఇతర నలుగురు సభ్యులచే నియమించబడింది.

అంతకుముందు కేంద్ర ప్రభుత్వం 1951లో రాజ్యాంగ సవరణ ద్వారా సామాజిక విద్యా పరంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కల్పనకు బీజం వేసిన ప్పటికీ ముందుకు సాగలేదు. మొదటి రాజ్యాంగ సవరణ మేరకు ఓబీసీలకు ప్రభుత్వ విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ల కల్పనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేసినప్పటికీ ఆ రాష్ట్రాల హైకోర్టులు కొన్ని విషయాలను కారణంగా చూపి ఓబీసీ రిజర్వేషన్లను ఆపి వేశాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్లు 50 % మించ వద్దని తీర్పులు రావడంతో అమలు ఆగిపోయిన వి.

మండల్  నివేదిక ప్రాతిపదిక

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ,16 ద్వారా రిజర్వేషన్ల కల్పనకు అనేక అంశాలను న్యాయస్థానం తీర్పును పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానాలలో ఓబిసి రిజర్వేషన్లు ఆగిపోకుండా బిపి మండల్ నివేదికను సమగ్రంగా తయారుచేశాడు.

కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని అంటే మూడు ప్రాతిపదికలు ఏర్పరుచుకున్నాడు1) సామాజిక వెనుకబాటు 12 పాయింట్లు2) విద్య వెనుకబాటుకు నాలుగు పాయింట్లు3) ఇ తర వెనుకబాటుకు నాలుగు పాయింట్లు. దేశంలో సామాజిక వెనుకబాటుకు కులమే ప్రామాణి
కం కాబట్టి ఒక కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని అంటే కనీసం 11 పా.యింట్ రావాలని నిర్ధారించుకున్నాడు.

దేశవ్యాప్తంగా పర్యటించి మొత్తము 0బీసీల జనాభా ను 52% గా తేల్చి 3743 కులాలను ఓబీసీగా గుర్తించి వీరి జనాభా 52 శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్లు 50 శాతం మించ కూడదనే బంధన మేరకు బిపి మండల్ ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల అమలును ప్రధాన సిఫారస్ గా మిగతా 39 సిఫారసులు చేస్తూ తుది నివేదికను 31 డిసెంబర్ 1984 న రాష్ట్రపతికి సమర్పించాడు.

బిపి మండల్ జీవిత విశేషాలు

భారతదేశ చరిత్రలోనే ఓబీసీలకు అగ్రతాంబూలం అందించిన బిపి మండల్ జీవిత చరిత్ర తెలుసుకోవడం చాలా ఉపయుక్తం. ఉత్తర బీహార్ లోని సహర్సా లో అత్యంత ధనికుడైన యాదవ్ జమీందారీ కుటుంబంలో 1918 ఆగస్టు 25 న జన్మించాడు. బాల్యంలో అనేక వివక్షతకు ఆటుపోట్లకు గురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఉన్నత విద్యను అభ్యసించి 45 నుంచి 51 మధ్య కాలంలో మాదే పుర డివిజన్లో జీతం తీసుకోకుండా మెజిస్ట్రేట్ గా పనిచేసి కాంగ్రెస్ తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 52 లో 65 లో తన నియోజకవర్గంలో ఉన్న మైనారిటీలు దళితులపై ఉన్నత వర్గాలు, పోలీసులు, రాజపుత్రులు చేస్తున్న దాడులు అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పార్టీలో ఉండి ప్రశ్నిస్తా వాఆని ముఖ్యమంత్రి గర్జిస్తే నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ నుండి నిష్క్రమించి ఇ తర పార్టీలో చేరాడు.
1968లో బీహార్ శాసన సభ్యునిగా ఎన్నికై ఆరోగ్య మంత్రిగా పని చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం వలన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ వాళ్ల ఆగడాల పైన విచారణ కమిటీని వేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ప్రధాని ఇందిరాగాంధీ విచారణను ఆపివేయాలని ఆదేశించినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి వదులుకొని నైతిక విలువలకు కట్టుబడి ఉన్నటువంటి మండల్ నాయకత్వంలో మండల్ కమిషన్ ఏర్పడడం వల్లనే నిజాయితీని చిత్తశుద్ధిని చాటుకుని ఓ బీసీల హక్కుల పరిరక్షణకు రిజర్వేషన్లు ప్రకటించి ఓ బీసీల స్ఫూర్తి దాత గా నిలిచారు..

మండల్ కమిషన్ నివేదిక పై చర్య

1978లో జనతాదళ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం కోసం వేసిన టువంటి మండల్ కమషన్ 1987 డిసెంబర్ 31న నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ కు నివేదిక అందిస్తే 1990 వరకు దశాబ్దంపాటు ఆ నివేదికను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కొటారి కమిషన్ నివేదిక విద్యారంగంపై గత 60 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి అయినట్లు మండల్ కమిషన్ నివేదిక కూడా దశాబ్దంపాటు నిర్లక్ష్యానికి గురైంది. తిరిగి 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన జనతాదళ్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోమారు ప్రదర్శించి మండల కమిషన్ సిఫార్సుల లోని మొదటి సిఫారసు అయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను వి.పి.సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 7 1990 నా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/august-7-obc-birthday-bp-mandal-mandal-commission-reservations/

అప్పటికి దేశంలోని అన్ని వ్యవస్థలో తిష్ట వేసిన ఉన్నత వర్గాలకు ఓబీసీలకు పిడికెడు న్యాయం చేయడానికి పూనుకుంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణాల వారు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆత్మాహుతి ఆత్మహత్యలతో కలిసివచ్చిన అవకాశాన్ని అడ్డుకున్నారు. అప్పుడే మందిర్ మసీదు వివాదం పెద్దగా ప్రాచుర్యం లోకి వచ్చినా రాజకుటుంబానికి చెందిన ప్రధాని విపి సింగ్ తన సామాజిక బాధ్యతను అతి చతురతతో నిర్వహించినప్పటికీ కొన్ని శక్తులు ప్రతిపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో వి.పి.సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. అయినా ఈ సందర్భంగా వి.పి.సింగ్ అన్న మాటలను ప్రస్తావించవలసి ఉంది.

“ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల సౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో
ఉపేక్షించే సమస్య లేదు. ఈ ఉత్తర్వులు అమలు అయ్యేదాకా రాజధానిలో నేను అడుగు పెట్టను” అని ఢిల్లీ దాటి వెళ్లిపోయాడు. మరో సందర్భంలో ఉత్తర్వులు అమలు కోసం తుపాకీ ఉపయోగించడానికి అయినా వెనుకాడను
అని విపి సింగ్ చేసిన ప్రకటనను కొంతమంది పెద్దలు గుర్తు చేస్తుంటే రాజ
వంశానికి ఉన్నటువంటి ఇంగితజ్ఞానం మిగతా పార్టీలకు లేకపోవడాన్ని చింతించవలసి ఉన్నది.

రిజర్వేషన్లు వ్యతిరేక ఉద్యమానికి స్పందించిన సుప్రీం కోర్టు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నిలిపివేస్తూ 16 నవంబర్ 1992 న తుది తీర్పును వెలువరించింది. రాజ్యాంగబద్ధంగా ఎంతో విజ్ఞత గా బిపి మండల్ చేసిన 27 శాతం రిజర్వేషన్లను ఆమోదించిన సుప్రీంకోర్టు సంపన్న వర్గాలను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని సూచించింది.

పై సుప్రీం కోర్టు తుది తీర్పుకు అనుకూలంగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబిసీ రిజర్వేషన్లు 1993 నుండి అమలవుతున్నాయి. బిపి మండల్ తన జీవితాన్ని దేశంలోని 27 శాతం జనాభా కలిగిన వారి ఉద్యోగ విద్యా రంగాలలో సమాన వాటా కోసం అంకితం చేస్తే, నివేదికను ఆమోదించి ఉత్తర్వులు ఇచ్చినటువంటి ప్రధాని వి.పి.సింగ్ తొలి నియామక పత్రాన్ని స్వయంగా ఇంటికెళ్లి అందించ డం ద్వారా చిరస్మరణీయులు అయినారు. మండల్ కమిషన్ అనగానే ఓబిసీ రిజర్వేషన్లు, రిజర్వేషన్ల అమలు అనగానే పదవిని కోల్పోయిన పట్టువదలని వి.పి.సింగ్,అధికారిక ఉత్తర్వులు భారత చరిత్ర ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి.

(వడ్డేపల్లి మల్లేశం, సామాజిక విశ్లేషకడు, అధ్యక్షుడు జాగృతి కళాసమితి హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *