లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నిక లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. ఏడు విడతల్లో ఈ ఎన్నికలు ముగియనున్నాయి.

చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

మొదటి ఫేజ్ లోనే తెలంగాణ, ఏపీ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 తొలి విడతలోనే ఏపీ పార్లమెంటు, అసెంబ్లీ మరియు తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. మే 23 దేశ వ్యాప్తంగా ఫలితాలు వెలువడనున్నాయి.

జూన్‌ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించామని శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపామన్నారు.  దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించామన్నారు. వాతావరణం, పంటకోతల సమయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని సునీల్‌ అరోరా తెలిపారు.

పోలింగ్‌ స్టేషన్లలో పర్యవేక్షణ, సునిశిత పరిశీలన ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. ఓటు హక్కు వినియోగానికి 12 గుర్తింపు కార్డులు పరిగణలోకి తీసుకోనున్నామన్నారు. పోలింగ్‌ కు 5 రోజులు ముందుగా ఓటర్లకు పోల్‌ చిట్టీలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోల్‌ చిట్టీలను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోమన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ లు వినియోగిస్తామని చెప్పారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపారు. పర్యావరణహిత ఎన్నికల ప్రచార సామాగ్రి మాత్రమే వినియోగించాలన్నారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లుండగా..వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సున్న ఓటర్లు 1.5 కోట్లున్నారని సీఈసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *